మూడు రాజధానుల ఎపిసోడ్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు కోరుతున్నట్టుగా తాము చేయలేమని తేల్చి చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా పిటిషనర్ల దురుద్దేశాన్ని ఏపీ హైకోర్టు ఎండగట్టింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో మనుగడలో ఉన్న అభ్యర్థనలపై మరోసారి హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు మూడు రాజధానులపై చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ వాదనలు వినిపించారు. ఈ వాదనపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం (చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు) తీవ్రంగా స్పందించింది.
చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించలేరని, ఆ దిశగా కోర్టులు కూడా ఆదేశాలు ఇవ్వలేవని హైకోర్టు తేల్చి చెప్పింది. మీ అందరి వాదనలు ప్రభుత్వాన్ని చట్టాలు చేయకుండా ముందే నిలువరించాలని కోరుతున్నట్టు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అది ఎలా సాధ్యమని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల్లోని లోపాలను సవరించి, తిరిగి కొత్తవి చట్టసభల ముందుకు తీసుకొస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ బిల్లులను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో విచారణను నిలుపుదల చేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో రోజువారీ విచారణ నిలిచిపోయింది.
తదుపరి ఏం చేయాలనే దానిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇందులో భాగంగా జరిగిన విచారణలో కీలక వాదనలు తెరపైకి వచ్చాయి. పిటిషనర్ల తరపు వాదనలపై త్రిసభ్య ధర్మాసనం కాసింత గట్టిగానే తలంటిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.