ఉద్యోగుల జీతాలు ఆపేసి, ఆ డబ్బును సంక్షేమ పథకాలకు మళ్లించుకోవాలని జగన్ చూస్తున్నారట. ఉద్యోగ సంఘాల తాజా ఆరోపణ ఇది. ఎంత బుద్ధి తక్కువ ఆరోపణ ఇది.
ఇలాంటి ఆరోపణలు చేసే ముందు కనీసం ఆలోచించరా? ఉద్యోగుల జీతాలు ఆపేసి ఎన్నాళ్లు జగన్ నెట్టుకొస్తారు? అయినా ఉద్యోగుల జీతాలకు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధం ఏంటి? ఇన్నాళ్లూ ఇలానే చేశారా?
ఫిబ్రవరి-1న జీతాలు పడవనే అక్కసుతో..
ఒకటో తేదీన కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అయితే ట్రెజరీ ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో పాత పీఆర్సీయే తప్పనిసరి అవుతోంది, కానీ ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం లేదు. అంటే ఈ పీటముడి వల్ల ఈనెల జీతాలు ఆలస్యం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఉద్యోగులు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగుతున్నారు. తమకు జీతాలు ఆలస్యం కావడానికి కారణం జగనేనని, దానికి పరోక్ష కారణం సంక్షేమ పథకాలని చెబుతున్నారు.
జీతాలకు ఖజానాలో డబ్బులు లేవని, అందుకే పీఆర్సీ వంకతో వాటిని రాకుండా చేస్తున్నారని, ఆ జీతం డబ్బుల్ని సంక్షేమ పథకాలకి మల్లించుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది పసలేని ఆరోపణ అని తేలిపోతున్నా.. ఒకరకంగా జగన్ ప్రభుత్వంపై మరక వేయాలని చూస్తున్నారు ఉద్యోగులు. ఇలాగైనా పాత పీఆర్సీకి ఒప్పుకుంటారేమోననేది వారి ఆలోచన. ప్రతిపక్షాల కుయుక్తులు లేకపోతే ఇలాంటి నీఛమైన ఆరోపణలు నేరుగా ఉద్యోగులే చేస్తారంటే నమ్మలేం.
కొత్త పీఆర్సీ అమలు అసాద్యం..
నెలాఖరు వచ్చేసింది. మూడు రోజుల్లో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు రెడీ అవడం అసాధ్యం. ఉద్యోగుల ఎస్.ఆర్ లు పరిశీలించి, వారి బేసిక్ ను సవరించి, ఇంక్రిమెంట్ల ప్రకారం బిల్లులు రెడీ చేయాలంటే అయ్యేపని కాదు, అంటే కొత్త పీఆర్సీ అమలు అసాధ్యం అని తేలిపోయింది.
ఉద్యోగులకు జీతం వేయాలంటే ఇక పాత పీఆర్సీ ప్రకారం బిల్లులు రెడీ చేయడమే దిక్కు. అంటే ఒకరకంగా ఫిబ్రవరి-1న కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలనుకున్న ప్రభుత్వ ఆలోచన అమలులోకి రావడంలేదు.
అంటే పరోక్షంగా ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు షాకిచ్చినట్టే లెక్క. కావాలనే బిల్లుల ప్రక్రియ ఆలస్యం చేసిన ఉద్యోగులు, ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేస్తున్నారు. జగన్ ని పలుచన చేయాలని చూస్తున్నారు.