ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు బండారం మొత్తం బైటపడుతోంది. వైసీపీ ప్రభుత్వం వైపు చంద్రబాబు ఒకవేలు చూపిస్తే.. మిగతా వేళ్లన్నీ బాబు తప్పుల్ని ఎత్తి చూపుతున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ కి చంద్రబాబే ఆద్యుడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అంతే కాదు, తన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన గతంలో జరిగిన సంఘటనలను కూడా ఓ టీవీ షోలో బయటపెట్టారు.
ఇంటెలిజెన్స్ డీజీగా తనకు అనుకూలమైన వెంకటేశ్వరరావుని నియమించుకుని చంద్రబాబు ఎలాంటి దారుణాలకు ఒడిగట్టారో వీర్రాజు వివరించారు. సొంతపార్టీ నేతల ఫోన్ కాల్స్ కూడా చంద్రబాబు దొంగచాటుగా వినేవారట. దీనికోసం విదేశాల నుంచి ఓ ప్రత్యేక పరికరాన్ని కూడా బాబు దిగుమతి చేసుకున్నారని, ఈ పరికరంతోటే ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, సొంతపార్టీ నేతల మాటల్ని కూడా వినేవారని చెప్పుకొచ్చారు.
గతంలో టీడీపీలో ఉండి, ప్రస్తుతం బీజేపీలో చేరిన ఓ సీనియర్ నేత ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ చేసేవారని, అప్పట్లో ఆయన్ను ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన వెంకటేశ్వరరావు హెచ్చరించారని కూడా గుర్తు చేశారు. “మీరు వీర్రాజుతో ఎక్కువగా మాట్లాడుతున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది” అని వెంకటేశ్వరరావు సదరు వలస నేతతో చెప్పారట. ఆ దెబ్బతో ఆయన ఓ ప్రైవేట్ నెంబర్ తీసుకుని వీర్రాజుకి ఫోన్ చేసేవారట.
అప్పట్లో టీడీపీకి మిత్రపక్షంలో ఉన్న తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు వీర్రాజు. ఎవరో నక్సలైట్ నుంచి తనకు ఫోన్లు వస్తున్నట్టు, ఆయన ఫోన్ చేస్తే పోలీసులకు సమాచారమివ్వాలంటూ వెంకటేశ్వరరావు ఓ సందర్భంలో తనకు సూచించారని చెప్పారు వీర్రాజు. చంద్రబాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్నో ప్లే చేసేవారని, ఇంకా తన వద్ద చాలా ఆధారాలున్నాయని, అవన్నీ సమయం వచ్చినప్పుడు బైటపెడతానన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.
మొత్తమ్మీద వీర్రాజు వ్యాఖ్యలతో చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకోండని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా ఆధారాలివ్వాలంటూ చంద్రబాబుకి లేఖ రాసిన వేళ.. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశముంది. వీర్రాజు వ్యాఖ్యలను పోలీసులు పరిగణలోకి తీసుకుని విచారణ మొదలు పెడితే అసలు దోషులెవరో తేలుతుంది.
ఇలాంటి అవకతవకలు జరిగాయి కాబట్టే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కనపెట్టింది. ఆయన వ్యవహారం కూడా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చే అవకాశముంది. కేసు పూర్తిగా రివర్స్ తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకోబోతోంది. వ్యూహాత్మకంగానే వీర్రాజు ఈ విషయాలన్నీ బైటపెట్టారని అర్థమవుతోంది. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై ఎగిరెగిరి పడ్డాక నింపాదిగా ఆయన నీఛ రాజకీయాలను వీర్రాజు బైటపెట్టారు.
వైసీపి ప్రభుత్వం తమ ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తోందంటూ ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు.. మోదీని కూడా తప్పుదోవ పట్టించారని తేలిపోయింది. ఇక ఈ విషయంలో పోలీసులు లోతైన విచారణ జరిపితే.. బాబు హైదరాబాద్ లో దాక్కున్నా ఉపయోగం లేదన్నమాటే. ఎందుకంటే.. హైదరాబాద్ లో ఆల్రెడీ బాబు మీద “బ్రీఫ్డ్ మీ” కేసు ఉంది కదా. సో.. ఈసారి ఆయన తెలంగాణ-ఏపీ కాకుండా అస్సాం పారిపోతారేమో!