కరోనా ప్రజలను ఎంతగా భయపెడుతోందో.. చాటి చెబుతున్న సంఘటనలు ఇవి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఒకవైపు కరోనా సోకినా నూటికి 98 మంది సురక్షితంగా బయటపడుతున్నారు. ఏపీలో అయితే ఆ శాతం 99 కి మించి ఉంది.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా సోకిన వారిలో మరణించిన వారి శాతం రెండు లోపు ఉంది. ఏపీలో ఆ శాతం ఒకటి లోపు నిలుస్తోంది. కరోనా కారణం చేత మరణించిన వారిలో చాలా మంది అప్పటికే కొన్ని దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారని ప్రభుత్వం చెబుతోంది. వారు కరోనా కారణంగా మరణించడం దురదృష్టకరమే. అయితే 99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నారనేది భరోసా ఇచ్చే అంశం.
అలాగే తాజాగా పరిశోధన సంస్థలు చెబుతున్న విషయం ఏమిటంటే.. భారతదేశంలో ఎంతో మందికి కరోనా సోకి, దానంతట అదే తగ్గిపోయిందనేది. హైదరాబాద్ లో కొన్ని లక్షల మందికి కరోనా సోకిందని, వారిపై ఆ వైరస్ ఎలాంటి ప్రభావం చూపడం లేదని, ఏపీలోని కొన్ని చోట్ల 40 శాతం జనాభాకు కరోనా సోకిందని, అక్కడ కూడా ఎలాంటి సింప్టమ్స్ లేవని పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.
ఒక రకంగా.. చెప్పాలంటే.. భారతీయులు కరోనాకు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండటం, ఒకవేళ సోకినా సకాలంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే నూటికి 99 శాతం మంది పైనే కోలుకుంటున్నారు. అయినా.. కరోనా భయాలతో ఆత్మహత్యలు చోటు చేసుకుంటూ ఉండటం విషాదం.
ఇప్పటికే ఇలాంటి వార్తలు చాలా వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో, గోదావరి జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని వార్తా కథనాలు వచ్చాయి. అది కూడా యుక్త వయసులో ఉన్న వాళ్లు, వేరే జబ్బులు లేని వారు కూడా కొందరు భయపడి ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నట్టున్నారు. తాజాగా విశాఖలో కరోనాతో ఒక వ్యక్తి మరణించాగా అతడి భార్య, పిల్లలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. వారికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారట.
కరోనా భయంకరమైనదే.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సోకినా మరీ భయ కంపితులు కానవసరం లేదని వైద్యులు భరోసాగా చెబుతున్నారు. ధైర్యమే శ్రీరామరక్ష అని వారు చెబుతున్నారు. అయితే కరోనా భయాలతో కొందరు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటుండటం అవగాహన ప్రజల్లో మరింతగా పెరగాల్సిన అవసరాన్ని చాటుతోంది. టీవీ చానళ్లు నంబర్లు చెప్పి గంటగంటకూ ప్రజలను హడలు కొట్టే పని కూడా కాస్త ఆపాలి. ప్రభుత్వాలైనా చానళ్లను ఈ విషయంలో నిరోధించాలి.