సోనియా చెల్లించిన భారీ మూల్యం

దేశంలో మరే రాష్ట్రంలోని అత్యంత దౌర్భాగ్య స్థితికి చేరిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎప్పటికీ అధికారంలోకి రాలేము అనుకునే తమిళనాడు, బెంగాల్ లాంటి చోట్ల కూడా అంతో ఇంతో అస్తిత్వం వుంది…

దేశంలో మరే రాష్ట్రంలోని అత్యంత దౌర్భాగ్య స్థితికి చేరిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎప్పటికీ అధికారంలోకి రాలేము అనుకునే తమిళనాడు, బెంగాల్ లాంటి చోట్ల కూడా అంతో ఇంతో అస్తిత్వం వుంది కాంగ్రెస్ పార్టీకి.కానీ ఆంధ్రలో మాత్రం అది కూడా లేదు. పైగా గమ్మత్తేమిటంటే ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం. 

కొత్త ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీకి వున్న ఓట్ల బలం మహా అయితే రెండులక్షలు. కానీ నాయకుల సంఖ్య‌ అందులో ఒక్కశాతం కూడా లేదు. పార్టీ ఇలాంటి హీన స్థితికి దిగజారిపోవడానికి కారణం సోనియా తప్పమరెవరు కాదు.

తెలంగాణ విషయంలో కేసిఆర్ మాయలో పడిపోవడం మరో తప్పు. ఈ తప్పిదం వల్ల తెలంగాణలో అధికారం దూరం అయింది. అయినా పార్టీ వెంట ఓటర్లు లేకపోయినా, నాయకులు అన్నా మిగిలారు. కానీ ఆంధ్రలో అలా కాదు. నాయకులు కూడా లేకుండా చేసుకున్నారు.  

పార్టీలో బలమైన నాయకుడు అనుకుంటే లాలించి బుజ్జిగించి దగ్గరకు తీసుకోవాలి లేదా నచ్చచెప్పి పక్కన వుంచాలి. అదీ కాదు అంటే ఏదో ఒక తాయిలం పడేసి మచ్చిక చేసుకోవాలి. కానీ సోనియా అలా చేయలేదు. 

చంద్రబాబు అండ్ కో, ఇంకా సామాజిక మీడియా మాటల మాయలో పడిపోయారు. జగన్ ను ఏకంగా జైలుకు పంపేలా పావులు కదిపారు. అప్పటికే వైఎస్ వ్యవహారం చవిచూసి వున్నారు. తమ అడుగులకు మడుగులు వత్తే ఫ్యామిలీ కాదు అని అర్థం అయిపోయింది. అందుకే వదిలించేసుకోవాలనుకున్నారు. అందుకే ఆ విధంగా ముందుకు వెళ్లారు. అందుకు భారీ మూల్యం చెల్లించారు.

ఇక ఎప్పటికీ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ వికాసం కనిపిస్తుందా అంటే అనుమానమే. అసలు ఆ దిశగా పార్టీ కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదు భాజపా కనీసం ఓ వ్యహం ప్రకారం కాపులకు పగ్గాలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అలా వ్యూహరచన చేస్తే కమ్మవారికో,కాపులకో పగ్గాలు ఇచ్చి జగన్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ ను రెడీ చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నమే లేదు. 

కమ్మవారికి పగ్గాలు అప్పగించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఆల్టర్ నేటివ్ ను, వైకాపాకు పోటీని తయారు చేసే అవకాశం వుంది. కానీ ఆ దిశగా ఆలోచనలు సాగడం లేదు. చూస్తుంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. 

జగన్ అనేవాడు ఎప్పటికీ కాంగ్రెస్ లోకి రాడు. అది పక్కా. అంత అవమానించి, జైలులోకి వెళ్లేలా చేసిన కాంగ్రెస్ పార్టీలోకి జగన్ వెళ్లడం దాదాపు అసాధ్యం. పైగా భాజపాకు కావాల్సింది కూడా ఇదే.చంద్రబాబు మాదిరిగా తడవ తడవకు ఇటు ఇటు మద్దతు మార్చే వాళ్లు కాకుండా, తమతోనే వుండే వాళ్లు కావాలి. అందుకే భాజపా చంద్రబాబును కన్న జగన్ ను ఎక్కువ నమ్ముతోంది. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద పెట్టిన దృష్టిలో పదో వంతు కూడా ఆంధ్ర మీద పెట్టలేదు. పెడదాం అన్నా నాయకులు కనిపించడం లేదు. చూస్తుంటే వచ్చే ఎన్నికల వేళకు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ అనేది మాయం అయిపోయేలాగే వుంది. ఇది పూర్తిగా సోనియా స్వయంకృతాపరాధం తప్ప వేరు కాదు. కేవలం జగన్ ను కట్టడి చేయాలనే సలహాలను నమ్మడం తో చెల్లించిన భారీ మూల్యం.