ఇప్పుడుకాక ఇంకెప్పుడు.. తమ్మినేని చివరి యత్నం

తమ్మినేని సీతారాం.. ఉత్తరాంధ్రలో బలమైన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. ఏకంగా 18 శాఖలను నిర్వహించిన ఘనత ఆయన సొంతం. అయితే అదంతా గతం.…

తమ్మినేని సీతారాం.. ఉత్తరాంధ్రలో బలమైన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. ఏకంగా 18 శాఖలను నిర్వహించిన ఘనత ఆయన సొంతం. అయితే అదంతా గతం. ఇప్పుడాయన ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యే అంతే. వయసు 62 ఏళ్లు. ఈ దశలో ఆయన నిర్వహిస్తున్న స్పీకర్ పదవి ఆయనకు గౌరవాన్నిచ్చింది. రాజకీయాల నుంచి తప్పుకున్నా గౌరవంగానే ఉంటుంది.

కానీ తమ్మినేనికి మాత్రం మంత్రిగా రిటైర్ అవ్వాలనే ఆశ ఉంది. అందుకే ఆయన ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగన్ ముందు తన మనసులో మాట బయటపెట్టారు. మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు.

గెలిచినా ఓడిపోయినా ఆముదాలవలస నియోజకవర్గాన్ని మార్చకపోవడం తమ్మినేని స్పెషాలిటీ. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి జగన్ వేవ్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. 

తనకంటే సీనియర్లు ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి తనకు పోర్టుఫోలియో గ్యారెంటీ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం అదే సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని తమ్మినేని సీతారాంను స్పీకర్ ను చేశారు. దీంతో తమ్మినేని షాకయ్యారు. ఓవైపు స్పీకర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పటికీ ఆయన మనసులో మంత్రి పదవి ఆశ అలానే ఉంది. ఎలాగైనా మంత్రిగా అధికారం చలాయించాలని అనుకుంటున్నారాయన.

ఇదే చివరి ఛాన్స్.. ప్లీజ్..

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ తమ్మినేని చివరి ప్రయత్నాలు మొదలు పెట్టారు. చివరిసారిగా మంత్రిగా పనిచేసి రాజకీయాలకు రాంరాం చెప్పేస్తానని, జగన్ దగ్గర తమ్మినేని తన మనసులో మాట బయటపెట్టారు. తన తర్వాత తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తానని కూడా అన్నారట. ఇదే తనకు రాజకీయంగా చివరి ఛాన్స్ అని జగన్ ని అభ్యర్థించారట.

మరి జగన్ మనసులో ఏముంది?

మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈసారి ఎన్నికల టీమ్ రెడీ చేయాలనేది జగన్ ప్లాన్. మంచి జట్టుతో ఎన్నికల్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. మరి తమ్మినేనిని ఏం చేస్తారు.. స్పెషల్ కేస్ కింద కన్సిడర్ చేస్తారా? తనదైన స్టయిల్ లో ఎలాంటి మొహమాటాలకు పోకుండా వ్యవహరిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

ఒక్కరితో ముగిసే పంచాయతీ కాదిది..

పోనీ పాపం మన తమ్మినేని ఒక్కరే అనుకుంటే జరిగేది కాదు, ఆనం రామనారాయణ రెడ్డిలాంటి వారు మరింత మంది తెరపైకొస్తారు. అప్పుడు జగన్ అసలు లక్ష్యం దెబ్బతింటుంది. పైగా ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు తమ్మినేనిని తప్పిస్తే, స్పీకర్ గా మరొకరు కనిపించడం లేదు. ఒకరిద్దరు ఉన్నా వాళ్లు అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చు.

తమ్మినేనికి దారేది?

మంత్రిగా కంటే, స్పీకర్ గా పనిచేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా గౌరవం. కానీ తమ్మినేని మాత్రం గౌరవం కంటే అధికారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మంత్రి పదవి మోజులో జగన్ పై ఒత్తిడి తెస్తున్నారు.