శిథిల అమరావతి: తప్పు బాబుదా..? జగన్ దా..?

– కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లైపోయినా ఏపీకి రాజధాని లేదు. తప్పు బాబుదా..? జగన్ దా..? Advertisement – రాజధానిలో నిర్మాణాలు ఆగిపోయాయి. తప్పు బాబుదా..? జగన్ దా..? – మూడు రాజధానుల కాన్సెప్ట్…

– కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లైపోయినా ఏపీకి రాజధాని లేదు. తప్పు బాబుదా..? జగన్ దా..?

– రాజధానిలో నిర్మాణాలు ఆగిపోయాయి. తప్పు బాబుదా..? జగన్ దా..?

– మూడు రాజధానుల కాన్సెప్ట్ ముందుకు పోవడం లేదు. తప్పు బాబుదా..? జగన్ దా..?

– రాజధాని అంటే మ్యాప్ లో తప్ప, నిజంగా చూపించుకునే పరిస్థితి లేదు. తప్పు బాబుదా..? జగన్ దా..?

ఇలా ఈ ప్రశ్నలకు అంతూ పొంతూ లేదు, కానీ ఆన్సర్లలో మాత్రం రెండే రెండు ఆప్షన్లున్నాయి. ఐదేళ్లు పాలించిన బాబుది ఆ తప్పా, రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ది తప్పా అనేది ఎవరూ తేల్చలేని పరిస్థితి.

అమరావతి ఉద్యమం 600 రోజుకి చేరుకున్న సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా అమరావతిపై వరుస కథనాలనిస్తోంది. అమరావతి శిథిలమైపోతోందని, వేల కోట్ల సొమ్ముతో మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయని మొసలి కన్నీరు కారుస్తోంది. 

అవును నిజమే. వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి, ఇప్పటికిప్పుడు వాటిని తిరిగి మొదలు పెట్టాలన్నా అక్కడ సానుకూల పరిస్థితులు లేవు, పాతవాటిలో నాణ్యత డొల్ల, కొత్తగా కొనసాగించాలంటే నిధుల కరువు. సో.. అమరావతి అనేది రోడ్ ఎక్స్ టెన్షన్లో సగం కూలగొట్టిన బిల్డింగ్ లా దైన్యంగా 
మారిపోయింది.

చంద్రబాబుది కమిషన్ల యావ..

చంద్రబాబు అమరావతి ప్రాజెక్ట్ ని ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారో అందరికీ తెలుసు. 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నా కూడా హడావిడిగా ఉద్యోగులందర్నీ చలో అమరావతి అంటూ తరుముకొచ్చారు. ఓటుకు నోటు కేసుతో అడ్డంగా బుక్కై ఆ తప్పుకి ఉద్యోగుల్ని తిప్పలు పెట్టారు. పోనీ అనుకున్నట్టుగా అమరావతి మొదలు పెట్టారా అంటే అదీ లేదు.

ప్రపంచ స్థాయి నగరం అనే పేరుతో డిజైన్ల కోసమే ఐదేళ్లు కాలం గడిపారు. ఇటుక విరాళాలంటూ జనం సొమ్ము ఆన్ లైన్ లో అఫిషియల్ గా దోచేశారు. కమీషన్ల కోసం మొదలు పెట్టిన అమరావతికి డిజైన్లు గీయించడానికే వేలకోట్లు ఖర్చు చేశారు. సినీ దర్శకుడు రాజమౌళిని తీసుకొచ్చి మాహిష్మతి వర్సెస్ అమరావతి అన్నారు.

తాత్కాలిక నిర్మాణాలంటూ బాబు కట్టించిన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఇంపు, సొంపు ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అక్కడ అమరావతిలో ఆ ఇంద్రుడు వానదేవుడికి ఆదేశాలిస్తే, ఇక్కడ అమరావతిలో ఈ చంద్రుడి నెత్తిపై నేరుగా నీరు పడేలా సెక్రటేరియట్ కి చిల్లులు పడిపోయాయి. నాసిరకం నిర్మాణాలతో అమరావతి ఇమేజ్ ని సగం డ్యామేజీ చేసింది చంద్రబాబే.  

తమవారికి లబ్ధికోసం అమరావతి చుట్టూ భూములు కొని, ఆ తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకు అమ్మేసుకుని, కొంత మిగుల్చుకుని.. అబ్బో ఎన్నెన్ని రియల్ ఎస్టేట్ జిమ్మిక్కులు చేశారో అందరికీ తెలుసు. కేవలం కమీషన్ల కోసమే అన్ని చోట్లా నిర్మాణాలు ప్రారంభించి ఐదేళ్ల తర్వాత చేతులెత్తేశారు.

జగన్ ది ఇగో ప్రాబ్లమ్..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి సై అన్న జగన్, అధికారంలోకి వచ్చాక రివర్స్ అయ్యారు. ఎంత కవర్ చేసుకోవాలనుకున్నా.. సోషల్ మీడియాలో జగన్, రోజా, ఇతర నాయకులు అప్పట్లో చెప్పిన డైలాగులు అందరికీ తెలుసు. 

అమరావతిపై మొదటి నుంచీ జగన్ కి మంచి అభిప్రాయం లేదు. దాన్ని పూర్తి చేస్తే పేరు బాబుకి వెళ్తుంది. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అన్నారు. అదీ మంచిదే, కానీ దానికి కూడా ముందడుగు పడకపోవడంతో విడిపోయి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ ఏపీకి రాజధాని మ్యాప్ లో తప్ప భూమిపై లేదు.

కర్నూలు న్యాయ రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని అన్నారు.. దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయా అంటే, లేదనే చెప్పాలి. పోనీ శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామన్నారు. దానికి తగ్గట్టు శాశ్వత నిర్మాణాల కోసం మిగతా పనుల్ని కొనసాగించారా అంటే అదీ లేదు. 

ఆయన శంకుస్థాపన చేసిన పనిని నేనెందుకు కొనసాగించాలి అన్నట్టుగా జగన్ ఆలోచిస్తున్నారు. జగన్ మొండి వైఖరి వల్ల అమరావతి మొండి గోడలతో మిగిలింది, నిర్మాణం పూర్తి కాకుండానే శిథిల రాజధాని అనిపించుకుంది. ఇంతకీ ఈ తప్పుని ఎవరి ఖాతాలో వేయాలా అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఫలితం మాత్రం ప్రజలదే..

తప్పు చంద్రబాబుది కావొచ్చు, లేదా జగన్ కి కూడా అందులో భాగం ఉండొచ్చు. కానీ ఫలితం అనుభవిస్తోంది మాత్రం ఏపీ ప్రజలు. రాజధాని లేదని, ఉన్నా చెప్పుకోలేని, ఏ అవసరానికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఏపీ ప్రజలు. 

అమరావతి ఉద్యమానికి ఎన్నిరోజులొచ్చాయి అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికైనా మూడు రాజధానులపై న్యాయపరమైన చిక్కులు తొలగించుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది. ఏమీ చేయకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఎదురైతే.. రాజధాని శాపం కాస్తో కూస్తో ప్రభావం చూపించక మానదు.