పాన్ ఇండియా సినిమాలకు బ్రేక్ పడినట్టేనా..?

బాహుబలి తర్వాత ఏ సినిమా తీసినా పాన్ ఇండియా అనేస్తున్నారు. పెద్దగా ఖర్చుపెరిగేదేమీ లేదు, డబ్బింగ్ రైట్స్ అమ్మే బదులు, మనమే సొంతంగా రిలీజ్ చేసుకుంటే పోలా అనుకుంటున్నారు. అందులోనూ ఆయా భాషల్లో తెలుగు…

బాహుబలి తర్వాత ఏ సినిమా తీసినా పాన్ ఇండియా అనేస్తున్నారు. పెద్దగా ఖర్చుపెరిగేదేమీ లేదు, డబ్బింగ్ రైట్స్ అమ్మే బదులు, మనమే సొంతంగా రిలీజ్ చేసుకుంటే పోలా అనుకుంటున్నారు. అందులోనూ ఆయా భాషల్లో తెలుగు సినిమాలకు, తెలుగు హీరోలకు కాస్తో కూస్తో క్రేజ్ ఉండటం కూడా దీనికి బలమైన కారణం. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పాన్ ఇండియా అంటేనే హడలిపోయే పరిస్థితి.

పాన్ ఇండియా అంటే.. ఒకేసారి అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో విడుదల చేసుకునే వెసులుబాటు ఉండాలి. ఓవర్సీస్ దీనికి అదనం. అక్కడ ముందు, ఇక్కడ తర్వాత అంటే కుదరదు, ఆలోపు ఎంచక్కా ఆన్ లైన్ లో మాస్టర్ ప్రింట్ బయటకొచ్చేస్తుంది. అందుకే అన్నిచోట్లా ఒకేరోజు విడుదల చేసి, ఫస్ట్ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయితేనే పాన్ ఇండియా సినిమాలు మనగలుగుతాయి. కానీ ఇప్పుడా పరిస్థితి ఎక్కడా లేదు.

తెలంగాణలో థియేటర్లు పుల్, ఏపీలో కొన్నిచోట్ల మాత్రమే తెరిచారు. తమిళనాడులో అసలు లేదు, కర్నాటకలో ఓపెన్ చేసినా జనాలు రావట్లేదు. ఈ దశలో భారీ బడ్జెట్ సినిమాలు రెడీ అయినా, దర్శక నిర్మాతలు రిలీజ్ కి ధైర్యం చేస్తారా అనేదే అసలు సమస్య. పాన్ ఇండియా అనే పేరు లేకపోయినా భారీ బడ్జెట్ సినిమాలకు కూడా థియేటర్లతోనే లంకె ఉంది. ఫస్ట్ వేవ్,

సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. వీటికి ముగింపు లేకపోయే సరికి ఇకపై థియేటర్లలో సినిమాలు అనే కాన్సెప్టే కనుమరుగయ్యే అవకాశం ఉంది. దీంతో థియేట్రికల్ రైట్స్ నే నమ్ముకున్న భారీ చిత్రాల నిర్మాతలంతా దిగాలు పడ్డారు. ఓటీటీలకు వెళ్లే సాహసం చేయలేక సతమతం అవుతున్నారు. థియేటర్లు ఓపెన్ అయ్యాకే సినిమాలు విడుదల చేస్తామంటూ మొండి ధైర్యంతో కూర్చున్నారు. కానీ రోజు రోజుకీ వారిలో ధైర్యం సన్నగిల్లుతోంది, అన్నిచోట్లా థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కనపడ్డంలేదు.

ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం తెగకపోయే సరికి సగానికి సగం థియేటర్లు మూతబడ్డాయి. దీనికితోడు లోకల్ లాక్ డౌన్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీ మొత్తం నైట్ కర్ఫ్యూ ఉండటంతో సెకండ్ షోల ఊసే లేదు. కొన్నిచోట్ల మధ్యాహ్నం 2వరకే కర్ఫ్యూ సడలింపులు ఉండటంతో మ్యాట్నీ, ఫస్ట్ షో కూడా పడటంలేదు. దీంతో అసలు థియేటర్లు తెరవకపోవడమే మంచిది అనుకుంటున్నారు ఓనర్లు, తొందరపడి సినిమాలు రిలీజ్ చేయకపోవడమే మరీ మంచిది అనుకుంటున్నారు నిర్మాతలు. 

ఓటీటీలే దిక్కయ్యాయా..?

అబ్బే నా మీద ఓటీటీ హీరో అనే ముద్రపడటం ఇష్టంలేదు, అబ్బే నా టాలెంట్ ని 70ఎంఎం స్క్రీన్ మీద తప్ప, బుల్లితెరపై చూపెట్టడం నాకిష్టం లేదు. మా వాడిది డెబ్యూ మూవీ, ఓటీటీకి ఇచ్చేస్తే ఇమేజ్ డ్యామేజీ అయిపోదూ..? ఇలాంటి మాటలకు కాలం చెల్లినట్టే. 

ఒకప్పుడు ఓటీటీ అంటే చీ కొట్టిన హీరోలు, దర్శకులే ఇప్పుడు అదేబాట పడుతున్నారు. దాదాపుగా తెలుగులో దర్శకులంతా ఏదో ఒక సబ్జెక్ట్ తో ఓటీటీతో రిలేట్ అవుతున్నారు. వారే నిర్మాతలవుతున్నారు, కొంతమంది కాన్సెప్ట్ లు ఇస్తామంటున్నారు, ఇంకొందరు సొంత ఓటీటీలు పెట్టుకుంటున్నారు. ఇలా.. ఇండస్ట్రీ రూపు రేఖలే మారిపోతున్నాయి.

సీనియర్లకు మళ్లీ రోజులొచ్చాయా..?

మణిరత్నం వంటి సీనియర్లు కూడా నవరసాలంటూ ఓటీటీ బాట పట్టారు. ఆ నవరసాల దర్శకులంతా పేరున్నవారే. దాదాపుగా పెద్ద దర్శకులంతా ఓటీటీలవైపు వచ్చేస్తున్నారు. సీనియర్లు కూడా చిన్న బడ్జెట్ సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రీఎంట్రీలకు సిద్ధపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే..రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్, పాన్ ఇండియా సబ్జెక్ట్ అంటే ఏ నిర్మాత కూడ పెద్దగా సాహసించకపోవచ్చు.

ఖర్చు తగ్గించుకున్నామా, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నామా, ఓటీటీకి మంచి రేటుకి అమ్ముకున్నామా.. ఇదే ఇప్పుడు లాభదాయకమైన మధ్యేమార్గం. పెద్ద తలకాయలు ఓటీటీ విజయాన్ని ఒప్పుకోడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఆ మార్పు ఎంతో దూరంలో లేదనేది వాస్తవం.