టీటీడీ చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డినే జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. అయితే ప్రస్తుతానికి చైర్మన్ పేరును మాత్రమే ప్రకటించడం గమనార్హం. టీటీడీ పాలకమండలి పదవీకాలం జూన్ 21వ తేదీతో ముగిసింది. దీంతో స్పెసిఫైడ్ అథారిటీ అఫ్ టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్సాటు చేసింది.
చైర్మన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, పాలకమండలి సభ్యులకు మరో మూడు నెలల పదవి కాలం ఉన్నప్పటికీ… చైర్మన్ కాలపరిమితిని ప్రామాణికంగా తీసుకోవడంతో మొత్తానికి పాలకమండలిని రద్దు చేశారు. పరిపాలన కారణాల దృష్ట్యా నూతన పాలకమండలి నియామకం జరిపే వరకు స్పెసిఫైడ్ అథారిటీ ఐఏఎస్ల నేత్రత్వంలో ఏర్పడింది. తాజాగా చైర్మన్ నియామకంతో పాలన ఆయన నేతృత్వంలో సాగనుంది.
ఇదిలా ఉండగా త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సభ్యుల నియామకంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కలియుగ వేంకటేశ్వరస్వామి సేవ చేసుకునే అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. దీంతో టీటీడీ బోర్డు మెంబర్ కోసం గట్టి పోటీ నెలకుంది.
తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఎంపిక చేయాల్సి వుంది. అక్కడి అధికార పార్టీల సిఫార్సు మేరకు ప్రభుత్వం పరిశీలించి టీటీడీ బోర్డును పూర్తి స్థాయిలో నింపనున్నారు.