అనంత శ్రీరామ్… ప్రముఖ యువ గీత రచయిత. పువ్వు పుట్టగానే పరిమళించిన చందంగా, అనంత శ్రీరామ్‌కు పుట్టుకతోనే సాహిత్యం ఒంటబట్టింది. 12 ఏళ్ల వయసులోనే పాటలు రాయడం మొదలు పెట్టాడు. బాపట్లలో ఇంజనీరింగ్ చదువుతూ అర్ధంతరంగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఇంత వరకూ అతను వందలాది పాటలు రాసి, సంగీత ప్రియుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
తాజాగా ఆయననపై నెల్లూరు జిల్లాలో కేసు నమోదైంది. దీనికి కారణం ఆయన హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే. ఇటీవల కాలంలో 'దిగు దిగు దిగు నాగ' అనే పాట ఎంత హిట్ టాక్ తెచ్చుకున్నదో అందరికీ తెలుసు. ఆ పాట రచయిత అనంత శ్రీరామే. నాగ శౌర్య- రీతువర్మ జంటగా మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో 'వరుడు కావలెను' అనే సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను కూడా చిత్ర బృందం పూర్తి చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన 'దిగు దిగు దిగు నాగ' అనే పాటపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ పాటలో నాగదేవతను కించపరిచేలా ఉందని, దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బీజేపీ మహిళా మెర్చా నాయకురాలు బిందురెడ్డి నెల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల ప్రముఖ గాయని మంగ్లీ పాడిన బతుకమ్మ పాటపై కూడా ఇదే బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటలోని అభ్యంతరకర పదాన్ని తొలగించారు. మరి అనంత శ్రీరామ్ ఏమంటారో చూడాలి.