రాజీవ్ వ‌ద్దు, మోడీ ముద్దా? ద్వంద్వ నీతే బీజేపీ సిద్ధాంత‌మా!

స‌రిగ్గా ఆరేడేళ్ల కింద‌ట కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎమర్జెన్సీ అంశంపై ఆయ‌న మాట్లాడుతూ, వ్య‌క్తుల‌ను చూసి ఓటేసే ప‌రిస్థితి వ‌స్తే, ఎమర్జెన్సీ వంటి ఉత్పాత్తాలే ఏర్పాడ‌తాయ‌న్న‌ట్టుగా…

స‌రిగ్గా ఆరేడేళ్ల కింద‌ట కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎమర్జెన్సీ అంశంపై ఆయ‌న మాట్లాడుతూ, వ్య‌క్తుల‌ను చూసి ఓటేసే ప‌రిస్థితి వ‌స్తే, ఎమర్జెన్సీ వంటి ఉత్పాత్తాలే ఏర్పాడ‌తాయ‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడారు. మ‌రి కొన్నేళ్లుగా బీజేపీ వాళ్లు మోడీని చూసి ఓటేయ‌డం.. అనే ప్ర‌క‌ట‌న‌ను బాహాటంగానే ఇస్తున్నారు. 

వివిధ రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థుల‌ను ముందుగా ప్ర‌క‌టించుకోవ‌డం, ముఖ్య‌మంత్రుల‌ను అర్ధాంత‌రంగా రాజీనామా చేయించ‌డం వంటి సంద‌ర్భాల్లో కూడా అమిత్ షా స్వ‌యంగా ఇచ్చిన స్టేట్ మెంట్ గుర్తుకు వ‌స్తే త‌ప్పు మ‌న‌ది కాదు!

ఆ సంగ‌త‌లా ఉంటే.. కేంద్ర ప్ర‌భుత్వం ఒక పెద్ద నిర్ణ‌యాన్ని తీసుకుంది. దేశంలో క్రీడాకారుల‌కు ఇస్తున్న అత్యున్న‌త పుర‌స్కారం రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న అవార్డు పేరును మార్చింది. దాని పేరును మేజ‌ర్ ధ్యాన్ చంద్ ఖేల్ ర‌త్న‌గా మార్చింది. మంచిదే.. కాంగ్రెస్ విధానాల‌ను మారుస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ క‌నీసం పేర్ల‌ను అయినా మారుస్తోంది. 

దేశంలో సామాన్యుడి రాత‌, గీత ఏమీ మార‌క‌పోయినా.. ఇలా పేర్ల‌ను మార్చి బీజేపీ వాళ్లు తృప్తి పొందుతున్నారు. ఒకవైపు ధ‌ర‌ల నియంత్ర‌ణ లేదు, కోవిడ్ కోర‌ల్లో చిక్కిన జ‌న‌సామాన్యం ప‌రిస్థితి ఏమ‌ట‌నే చింత లేదు, ఇలాంటి మార్పులు చేసుకుంటూ.. దేశం కోసం, ధ‌ర్మం కోసం అంటూ ఉంటే చాలు.. ఈ మంత్రాల‌కు చింత‌కాయ‌ల్లా ఓట్లు రాలుతూ ఉంటాయి.

మ‌రి ఇక్క‌డ కూడా బీజేపీ త‌న మార్కు ద్వంద్వ నీతిని ఫాలో అవుతోంది.  క్రీడా ర‌త్న అవార్డుకు రాజీవ్ గాంధీ పేరు బీజేపీకి, భ‌క్తుల‌కు అసంమ‌జసంగా అనిపించింది. తీసేశారు. వాళ్ల పేర్లు తీసేశారు కానీ, వీళ్ల పేర్లు పెట్టుకోవ‌చ్చు. ఇది మాత్రం దేశ‌భ‌క్తే!

ఈ మ‌ధ్య‌నే గుజ‌రాత్ లో న‌రేంద్ర‌మోడీ స్టేడియం ఒక‌టి ప్రారంభం అయ్యింది, ప్ర‌పంచంలోనే అతి భారీ క్రికెట్ స్టేడియం అది. దానికి ప్రారంభోత్స‌వానికి ముందు రోజున న‌రేంద్ర‌మోడీ స్టేడియం అంటూ నామ‌క‌ర‌ణం చేశారు! అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌ల జ‌డి మొద‌లైంది. అయితే వెన‌క్కు త‌గ్గ‌లేదు. దానికి న‌రేంద్ర‌మోడీ స్టేడియం అనే పేరునే ఫిక్స్ చేశారు.

ఇక మ‌రింత దారుణం ఏమిటంటే.. చారిత్రాత్మ‌క ఫిరోజ్ షా కోట్ల స్టేడియం పేరును కూడా మార్చేశారు. ఎప్పుడో 1883నాటి ఆ స్టేడియంకు ఇటీవ‌లే నామ‌క‌ర‌ణం చేశారు. దాని పేరు ఇప్పుడు జైట్లీ స్టేడియం! బీజేపీ దివంగ‌త నాయ‌కుడు అరుణ్ జైట్లీ పేరును ఫిరోజ్ షా కోట్ల స్టేడియంకు అతికించారు. మ‌రి దేశంలోని క్రికెట్ కు అరుణ్ జైట్లీ ఏం సేవ చేశాడో ఎవ‌రికీ తెలియ‌దు. 

దేశంలోని నాయ‌కుల పేర్ల‌ను ఇలా గౌర‌వనీయ హోదాలో వాడుకోవ‌డం కామ‌నే కావొచ్చు. చాలా దేశాల్లో ఇలాంటి జ‌ర‌గొచ్చు. ప‌క్క‌నే ఉన్న శ్రీలంక‌లో ప్రేమ‌దాస స్టేడియం ఉంటుంది. లంక దివంగ‌త నేత పేర‌ది. 

మ‌రి బీజేపీ ద్వంద్వ నీతి ఏమిటనేదే అంతుబ‌ట్ట‌దు. క్రీడాంశాల‌కు నేత‌ల పేర్లు స‌బ‌బు కాదంటే.. అన్ని పేర్లూ తొల‌గించాలి. ఢిల్లీ నుంచి గల్లీ వ‌ర‌కూ ఒక విధానం అమ‌లు ప‌ర‌చాలి. అలా కాకుండా.. ఒక్కో అంశంలో ఒక్కోలా, త‌మ‌కు న‌చ్చే అంశం ఒక‌లా, న‌చ్చ‌ని అంశం మ‌రోలా.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం బీజేపీ మార్కు ద్వంద్వ నీతి అవుతోంది. 

ఇటీవ‌లే ఒక టీవీ చాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో.. ఒలింపిక్స్ లో భార‌త్ కు ఈ సారి మెరుగైన స్థాయిలో ప‌త‌కాలు రావ‌డానికి, అనురాగ్ ఠాకూర్ కొత్త‌గా క్రీడాశాఖా మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి ముడిపెట్టి ప‌ర‌మ దారుణ‌మైన కామెంట్లు చేశారు. క్రీడాకారుల క‌ష్టాన్ని ఠాకూర్ రూపంలో క‌లిసి వ‌చ్చిన అదృష్ట‌మంటూ వెకిలి విశ్లేష‌ణ చేశారు. ఏమిటో ఈ విప‌రీత చేష్ట‌లు.