ఇటు గడ్కరీ, అటు త్రిసభ్య కమిటీ..హోదా మాటేంటి?

బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల కాలంలో గడ్కరీ స్థాయి నేతలెవరూ ఏపీకి రాలేదు. వచ్చినా…

బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల కాలంలో గడ్కరీ స్థాయి నేతలెవరూ ఏపీకి రాలేదు. వచ్చినా ఏపీ ప్రభుత్వంతో కలసి ఇంత భారీ ఎత్తున అభివృద్ధి పథకాలను మొదలు పెట్టలేదు. 

తాజాగా ఏపీలో కేంద్ర నిధులతో నిర్మించిన 20 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లను గడ్కరీ, సీఎం జగన్ తో కలసి జాతికి అంకితం చేస్తారు. 31 కొత్త ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేస్తారు. మరి ఆ తర్వాత ఏం చేస్తారు.. ప్రసంగంలో కనీసం ఏపీ ప్రత్యేక హోదాని ప్రస్తావిస్తారా..? లేక ఏపీని ప్రశంసిస్తారా..? అసలేం జరుగుతుందనేది ఆసక్తికర అంశం.

ఇటీవల కాలంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీని ముప్పతిప్పలు పెడుతోంది. ప్రధాని రాజ్యసభలో మాట్లాడుతూ విభజన సక్రమంగా జరగలేదంటూ ఏపీపై సింపతీ చూపించారు. కానీ అదే నోటితో ప్రత్యేక హోదా ఇచ్చి ఏపీని కాపాడతామని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత త్రిసభ్య కమిటీ మీటింగ్ అజెండాలో ప్రత్యేక హోదాని చేర్చినట్టే చేర్చి తీసేశారు. ఆ తర్వాత ఆ నిందని వైసీపీపై వేసింది ప్రతిపక్ష టీడీపీ. ఇలా బీజేపీ, టీడీపీ కలసి మైండ్ గేమ్ ఆడుతూ వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి.

విజయవాడలో గంటకు పైగా బీజేపీ రాష్ట్ర నాయకులతో గడ్కరీ భేటీ అవుతారు. జనసేనానికి ఆహ్వానం లేదనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సరే ఇంటర్నల్ మీటింగ్ లు ఎలా ఉన్నా.. కనీసం బహిరంగ సభలో అయినా ఏపీ ప్రత్యేక హోదా గురించి గడ్కరీ ప్రస్తావిస్తారో లేదో చూడాలి. 2024లో ఏపీ ప్రత్యేక హోదాని బీజేపీ ప్రధాన అస్త్రంగా చేసుకుంటే మాత్రం ఈరోజు గడ్కరీ నోటి వెంట ఏదో ఒక ఆణిముత్యం వినిపించకపోదు.

త్రిసభ్య కమిటీ సంగతేంటో..?

ఈరోజు త్రిసభ్య కమిటీ మీటింగ్ కూడా ఉంది. ప్రత్యేక హోదాని అజెండా జాబితా నుంచి చివరి నిమిషంలో తొలగించడంతో ఈ మీటింగ్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. మరి ఏపీ కష్టాలకు, ఏపీకి జరిగిన అన్యాయానికి ఈ కమిటీ మీటింగ్ లో ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. గతంలో కూడా ఇలాంటి తతంగాలు చాలానే జరిగాయి కాబట్టి.. నేతలకు దీనిపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చి, ఆ తర్వాత తొలిగింది.. చర్చనీయాంశమైంది త్రిసభ్య కమిటీ.

గడ్కరీ పర్యటన, త్రిసభ్య కమిటీ మీటింగ్.. ఈ రెండిట్లో ఏ ఒక్క సందర్భంలో అయినా ఏపీ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వస్తే మాత్రం ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురించినట్టే లెక్క.