మరికాసేపట్లో కీలక చర్చ.. ఎలర్ట్ అయిన టాలీవుడ్

టాలీవుడ్ కు ఏపీ సర్కారు నుంచి గుడ్ న్యూస్ అందబోతోందా? దానికి తొలి మెట్టు ఈరోజే కాబోతోందా? అటు టాలీవుడ్ ప్రముఖులు, ఇటు ప్రభుత్వ పెద్దలు అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా…

టాలీవుడ్ కు ఏపీ సర్కారు నుంచి గుడ్ న్యూస్ అందబోతోందా? దానికి తొలి మెట్టు ఈరోజే కాబోతోందా? అటు టాలీవుడ్ ప్రముఖులు, ఇటు ప్రభుత్వ పెద్దలు అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా నలుగుతున్న టికెట్ రేట్ల అంశంపై ఈరోజు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు టికెట్ రేట్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఈరోజు సమావేశం కాబోతోంది.

మరికాసేపట్లో సమావేశం కానున్న ఈ కమిటీ, ఏపీలోని సినిమా హాళ్లలో టికెట్ రేట్లకు సంబంధించి తమ తుది నివేదికను ఈరోజు ముఖ్యమంత్రికి సమర్పించనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, టికెట్ రేట్ల అంశంపై ప్రభుత్వం రేపోమాపో కొత్త జీవోను విడుదల చేయబోతోంది. ఈ మేరకు ఇదివరకే విడుదల చేసిన జీవో-35 రద్దు కానుంది.

పేదవాడికి కూడా వినోదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో జగన్ సర్కారు థియేటర్లలో టికెట్లు సవరించింది. అయితే ఈ సవరణలు కొన్ని ప్రాంతాల్లో విమర్శలకు తావిచ్చింది. పంచాయతీ పరిథిలో ఉన్న సినిమా హాళ్లలో నేల టికెట్ ధర మరీ తక్కువగా 5 రూపాయలు ఉంది. దీనికితోడు థియేటర్లపై దాడులు, ఫ్లాట్ రేట్లకు అనుమతి నిరాకరణ లాంటి చాలా సమస్యలున్నాయి.

వీటికి సంబంధించి కొంతమంది కోర్టులో కేసులు వేశారు. ఇటు టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి కమిటీని నియమించింది ప్రభుత్వం. అది ఈరోజు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

తాజా సమాచారం ప్రకారం.. కమిటీ సిఫార్సుల మేరకు ఏపీలో సినిమా టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే అవి ఏ మేరకు పెరుగుతాయనిది తెలియాల్సి ఉంది. తెలంగాణలో ఉన్నట్టుగా ధరలు ఉండాలని టాలీవుడ్ కోరుకుంటోంది. ఆ స్థాయిలో ఉండకపోవచ్చని ప్రభుత్వం పెద్దలు సూచనప్రాయంగా చెబుతున్నారు. మరోవైపు ఫ్లాట్ రేట్లు, రోజుకు 5 షోలు వంటి అంశాలపై కూడా టాలీవుడ్ కు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా ఉంది.

కొంచెం క్రెడిట్ మంచు విష్ణుకు కూడా..

టాలీవుడ్ కు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం నుంచి నిర్ణయాలు వస్తే, ఆ క్రెడిట్ మొత్తం చిరంజీవికే వెళ్తుంది. ఎందుకంటే, ఆయన చొరవ తీసుకొని ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయి సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కంటే ముందు దిల్ రాజు వంటి నిర్మాతలు ప్రభుత్వంతో సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ, మొత్తం క్రెడిట్ చిరంజీవి ఖాతాలోనే పడే అవకాశం ఉంది. అయితే సడెన్ గా తెరపైకొచ్చాడు మంచు విష్ణు. 

జగన్ తో చర్చలు జరిపి, సీఎంతో లంచ్ చేసిన విష్ణు.. తను కూడా టాలీవుడ్ సమస్యలపై జగన్ అన్నతో చర్చించానన్నాడు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూడా చర్చలు జరిపామన్నాడు. కాబట్టి టాలీవుడ్ కు అనుకూలంగా నిర్ణయాలు వెలువడితే, అందులో కొంత క్రెడిట్ ను తన ఖాతాలో కూడా వేసుకునేలా విష్ణు ఇలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా చిరంజీవి చెప్పినట్టు టాలీవుడ్ కు గుడ్ న్యూస్ వినిపించే రోజు వచ్చేసింది. జీవో కాస్త అటుఇటు అయినా, జీవోలో ఉండబోయే అంశాలు ఏంటనేది ఈరోజు సాయంత్రానికి బయటకొచ్చే అవకాశం ఉంది. 25వ తేదీ నాటికి జీవో అమల్లోకి వస్తే, భీమ్లానాయక్ లాంటి సినిమాలకు పండగే. ఒకవేళ ఆ టైమ్ కు జీవో రాకపోతే.. రాధేశ్యామ్ నుంచి ఆ ఫలాలు టాలీవుడ్ కు అందుతాయి.