వీళ్లెక్కడి పార్టీ అధినేతలండీ బాబూ!

పద్ధతిలేకుండా మాట్లాడడం, వీధి రౌడీలాగ వార్ణింగులివ్వడం, ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, చిల్లర ట్వీట్లు పెట్టడం లాంటివి పనీపాటాలేని సోషల్ మీడియా జీవులో, జనం ఎన్నుకోక పనిలేకుండా పోయిన పార్టీ…

పద్ధతిలేకుండా మాట్లాడడం, వీధి రౌడీలాగ వార్ణింగులివ్వడం, ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, చిల్లర ట్వీట్లు పెట్టడం లాంటివి పనీపాటాలేని సోషల్ మీడియా జీవులో, జనం ఎన్నుకోక పనిలేకుండా పోయిన పార్టీ పురుగులో, జనం ఎన్నుకున్నా తమ పని వదిలేసి టీవీ ఛానల్లో కూర్చుని పిచ్చవాగుడు వాగడమే జీవితలక్ష్యంగా పెట్టుకున్న కొందరో చేస్తే చేయొచ్చు గానీ పార్టీ అధినేతలు చేస్తేనే అసహ్యం, చిరాకు పుడతాయి. 

లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ తమ పార్టీలకు అధినేతలు. పేరుకి లోకేష్ తెదేపాలో యువరాజే అయినా ప్రాంతీయ పార్టీకి ఇతనే హెడ్డు. తెదేపా జాతీయపార్టీకే తన తండ్రిగారు అధినేత. 

స్థాయికి దిగి పిచ్చి ట్వీట్లు చేయడం వల్ల అసలు అమెరికాలో చదివి లోకేష్ సాధించిన పరిణతి ఏముందబ్బా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎవరో పెట్టే మార్ఫింగ్ వీడియోలు, స్పూఫులు చూస్తాడు. “తియ్యగుంది” అనుకుంటాడో..ఏమో.. ఎత్తుకొచ్చి తన ట్విటర్ హ్యాండిల్లో పెట్టుకుంటాడు. అదేదో తన పార్టీకి చేస్తున్న సేవలాగ, అధికార పార్టీ మీద తొడ చరుపులాగ ఫీలౌతాడు. ఈ పిచ్చిమారాజుకి తెలియాల్సిందేంటంటే ఇలాంటి పోస్టులవల్ల తనని ఎవ్వడూ సీయం మెటీరియల్ గా గుర్తించడని. 

ఒక్కసారి రాహుల్ గాంధీకేసి చూస్తే కాస్త విషయం బోధపడుతుంది. అతనెప్పుడూ అసభ్యకరమైన, బిలో ద బెల్ట్ ట్వీట్లు, మార్ఫింగు వీడియోలు పెట్టడు. ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు చూపించాల్సిన కనీస లక్షణం ఇది. 

ఇక పవన్ కల్యాణ్ విషయానికొద్దాం. ఈయనది మరీ లోకేషంత వెర్రితనం కాకపోయినా ప్రపంచంలో ఉన్న చిరాకు, అసూయ ఈయన మొహంలోనే కనిపిస్తుంటాయి. తనకి అన్ని అర్హతలూ ఉన్నా జనం తనని ఎన్నుకోలేదని చిరాకు, జగన్ మోహన్ రెడ్డి సీయం గా అధికారం వెలగబెడుతున్నాడని అసూయ తాను రాజకీయ వేదికలెక్కినప్పుడల్లా మొహంలో కొట్టొచ్చినట్టు తెలుస్తూనే ఉంటుంది. దానికేదో ధర్మాగ్రహంలాగ కలరిచ్చి ఆవేశంగా స్పీచులిస్తుంటాడు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రెస్నోట్లు, ట్వీట్లు వదులుతుంటాడు. సొంత పనితో జనాన్ని ఆకర్షించే పని కన్నా అధికార పార్టీమీద బురదజల్లితే అధికారం వచ్చేస్తుందనుకునే తలతిక్క మాలోకం ఈ పవన్ కల్యాణ్. “నాకు కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది” అనేది ఈయనగారి సినిమా డయాలగ్. వాస్తవమేంటంటే ఈయనకి తిక్క మాత్రమే ఉంది. దానికి లెక్క డొక్క మాత్రం లేవు. 

పార్టీ అధినేతలుగా తమ తమ పార్టీలని బలోపేతం చెయ్యడానికి వీళ్లు ఏం చేస్తున్నారో ఎవ్వడికీ తెలియదు. తమ కడుపు నిండితే చాలు కనీసం పార్టీ కార్యకర్త మొహం కూడా చూడని నాయకత్వాలు వీళ్లవి. 

జనం మనసుని గెలవడమంటే ఎగస్పార్టీ మీద బురదజల్లి కూర్చోవడంకాదు. బుర్రవాడి జనం మధ్యలోకి వెళ్లాలి. వాళ్ల సంతృప్తులు, అసంతృప్తులు ఎక్కడున్నాయో స్వయంగా తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకుంటే క్లారిటీతో పాటు కాన్ఫిడెన్స్  కూడా వస్తుంది. 

లోకేష్ కి, పవన్ కి క్లారిటీ గానీ కాన్ఫిడెన్స్ గానీ కనపడవు. ఎందుకంటే డయలాగ్ ఆర్టిస్టుల్లాగ ఆ కాసేపు ఎవడో అందించిన సమాచారాన్ని ప్రిపేరయి మాట్లాడతారు తప్ప ప్రజాసమస్యలపట్ల ప్రత్యక్ష అవగాహన లేని పార్టీ అధినేతలు వీళ్లు. 

దేశంలో ఏ పార్టీ అధినేతల్లోనూ కూడా ఈ స్థాయి సోషల్ మీడియా ప్రవర్తన కనపడదు. 

పైగా ఇలాంటి ట్వీట్ల వల్ల, ప్రవర్తన వల్ల సొంత పార్టీలో ఉన్న అనుయాయులు, కులపిచ్చిగాళ్లూ చప్పట్లు కొట్టొచ్చేమో గానీ న్యూట్రల్ ఓటరు ఒక్కడు కూడా ఇంప్రెస్ కాడు. ఎంతమంది తటస్థ ఓటర్స్ ని తనవైపు తిప్పుకున్నాడన్నదాని మీద నాయకత్వ లక్షణం ఉంటుంది. ఆ టాలెంట్ వీరిద్దరిలోనూ బూతద్దమేసి చూసినా కనపడదు. 

జగన్ ప్రభుత్వం బలానికి కారణం వీరి బలహీనతలు కూడా. ప్రత్యర్థి వీకైతే అధికారపర్వానికి ఢోకా ఎందుకుంటుంది? ఈ ప్రాధమికమైన లెక్క ఈ ఇద్దరు మహానుభావులకి ఈ జన్మకి అర్థమౌతోందొ లేదో!

హరగోపాల్ సూరపనేని