అంతర్జాతీయ క్రికెట్ లో ఓ మోస్తరుగా రాణిస్తున్న క్రికెటర్లకే ఐపీఎల్ లో కోట్ల రూపాయల విలువ పలుకుతూ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ వరకూ వద్దు.. అండర్ 19 క్రికెట్ లో సత్తా చాటిన వారు కూడా మూడు నాలుగు కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు! కొన్ని వందల కోట్ల రూపాయల మొత్తాన్ని డాలర్ల లెక్కలో ఐపీఎల్ ప్రాంజైజ్ యాజమాన్యాలు క్రికెటర్లపై వర్షింపజేస్తున్నాయి. ఈ వర్షంలో క్రికెటర్లు తడిసి ముద్దవుతున్నారు.
మరి ఇలాంటి వర్షంలో తడవలేకపోతున్న క్రికెటర్లు ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తానీయులు మాత్రమే! ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లపై నిషేధాన్ని బీసీసీఐ కొనసాగిస్తూ ఉండటంతో పాక్ ప్లేయర్లకు ఈ మనీ లీగ్ లో భాగస్వామ్యం దక్కడం లేదు. పాక్ క్రికెట్ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదు. అయితే వారికి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో స్థానం దక్కదంతే!
ముంబైపై ఉగ్రదాడుల సమయం నుంచి పాక్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను తెంచుకుంది బీసీసీఐ. ఈ విషయంలో తమ ఆలోచన ఏమీ లేదని, భారత ప్రభుత్వ నిర్ణయానుసారం వ్యవహరిస్తామని అప్పట్లోనే స్పష్టం చేసింది. దీంతో గత 14 యేళ్లుగా ఇండియా, పాక్ ల మధ్యన ద్వైపాక్షిక సీరిస్ లు లేవు. ఒక్క వరల్డ్ కప్ లు, ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రమే ఈ రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి.
ఐపీఎల్ ఆరంభ సీజన్లలో పాక్ ప్లేయర్లకు మంచి ధర దక్కింది. అఫ్రిదీ, అక్తర్.. వీళ్లంతా మంచి ధర పలికారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ఐపీఎల్ లాగానే పీసీబీ కూడా తమ లీగ్ ఒకటి పెట్టింది. దాంట్లోనూ విదేశీ, తమ దేశ ఆటగాళ్లను ఆడిస్తోంది. అది కూడా పాక్ వేదికగా కాదు. ఎక్కడ జరిగినా.. ఆ పాకిస్తాన్ లీగ్ మొత్తం బడ్జెట్ కూడా ఐపీఎల్ లో ఒక్క ప్రాంచైజ్ బడ్జెట్ కు కూడా సమస్థాయిలో లేదు! క్రికెట్ ఆడే అన్ని దేశాల ప్లేయర్లకూ ఐపీఎల్ ఒక కామధేనువుగా మారింది.
ఒకటీ రెండు ఇన్నింగ్స్ లలో సత్తా చాటినా.. ఒక ఏడాది కాంట్రాక్ట్ గ్యారెంటీగా మారింది. ఇదే అవకాశం పాక్ ప్లేయర్లకూ ఉండి ఉంటే వారికీ కాసుల పంట పండేది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వ ఉగ్రమనస్తత్వం పాక్ క్రికెటర్లకు ఈ సువర్ణావకాశాన్ని లేకుండా చేస్తోంది.