నిజానికి ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. కానీ జగన్ అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లయినా జిల్లాల పునర్విభజన హడావుడి కనిపించలేదు. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ధిక్కరించి రోడ్డెక్కారో ఆ తరువాతనే జిల్లా విభజన హడావుడి మొదలైంది. ఇది చాలా వేగంగా జరిగింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని సీఎం జగన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమ్మె నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జిల్లాల విభజన అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తెచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దీనికి బ్రేక్ వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వస్తోంది. నిజానికి దేశంలో జనగణన పూర్తి కాకుండా జిల్లా సరిహద్దులు మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు ఇచ్చింది. సరిహద్దులు మార్చడమంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమని అర్ధం.
కానీ జగన్ ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోకుండా జిల్లా పునర్విభజనకు తెర లేపింది. దీంతో కొత్త జిల్లాలకు వాళ్ళ పేర్లు పెట్టాలి వీళ్ళ పేర్లు పెట్టాలంటూ అనేక డిమాండ్లు వచ్చాయి. అలాగే ప్రాంతాల మార్పు, జిల్లా కేంద్రాల ఏర్పాటు, సరిహద్దుల వివాదాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ప్రక్రియకు కేంద్రం బ్రేక్ వేయబోతున్నదా అనే సందేహం కలుగుతోంది. దేశవ్యాప్తంగా జనగణన పూర్తి కాకుండా జిల్లాల సరిహద్దుల్ని మార్చొద్దంటూ గతంలో ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.. తాజాగా దీనిపై మరోసారి రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కోవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా జనగణన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల మార్పుపై రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అర్ధరాత్రి వేళ ప్రకటన జారీ చేసింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాజకీయ రగడ రాజుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రాంతీయతను పరిగణలోకి తీసుకోకుండా జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారంటూ.. ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల కేటాయింపులే తరువాయి భాగం.. అన్న సూచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో.. జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత ఏర్పడింది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యంగా జనగణన చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి. జిల్లాల భౌగోళిక సరిహద్దుల మార్పు ద్వారా జనగణనపై ప్రభావం పడనుంది.
దీంతో కేంద్ర జనగణన శాఖ డైరెక్టర్ ఈ ఏడాది జూన్ వరకూ జిల్లాల సరిహద్దులు మార్చకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు జనగణన శాఖ డైరెక్టర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. జనగణన పూర్తి కాకుండా జిల్లాల సరిహద్దులు మారిస్తే ఇబ్బందులు తప్పవని కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కేంద్రం జనగణన ప్రక్రియతో దీన్ని ముడిపెట్టడం వెనుక వ్యాక్సినేషన్ కూడా కారణంగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో జనగణన నానాటికీ ఆలస్యమవుతోంది. ఈ ప్రక్రియపూర్తయితే కానీ జనగణన చేపట్టేందుకు వీల్లేదు. దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరుతోంది.
అది పూర్తయ్యాక జనగణన చేపట్టి జూన్ కల్లా దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే జిల్లాల సరిహద్దుల్ని మార్చేందుకు వీలు కుదురుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం పావులు కదుపుతోంది. కానీ ఇప్పుడు కేంద్రం జనగణన సందర్భంగా జూన్ వరకూ జిల్లాల సరిహద్దుల్ని మార్చకుండా ఆంక్షలు విధిస్తోంది.
దీంతో ఈ ప్రక్రియ ఉగాది నాటికి పూర్తి కావడం కష్టమేనని తెలుస్తోంది.. కేంద్రం ఆదేశాల మేరకు జూన్ లో జనగణన పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రక్రియ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తాత్కాలికంగా జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడొచ్చనే ప్రచారం జరుగుతోంది.