ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు తగబడుతున్నాయి. ఏదో చెప్పబోయి, మరేదో మాట్లాడుతుండడంతో అనవసరంగా చిక్కుల్లో పడుతున్నారు. ఇటీవల తాము అధికారంలోకి వస్తే మందును సరసమైన ధరలకే అందిస్తామని హామీ ఇచ్చి అభాసుపాలైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నోరుజారి నెటిజన్లకు చిక్కారు. దీంతో వీర్రాజును సోషల్ మీడియా ఆ ఆట ఆడుకుంటోంది.
ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు కట్టామంటూ కడప ఎయిర్‌పోర్ట్‌ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసనని వీర్రాజు నోరు జారారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు రాయలసీమ వాసుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సోము వీర్రాజు మాట్లాడిన మాటలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ… తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ప్రాణాలు తీసే రాయలసీమ ప్రాంతం, కడప జిల్లా అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ అహంకారపూరిత మాటలను నాగరిక సమాజం ఖండించాలనే కామెంట్స్ పెద్ద సంఖ్యలో ప్రత్యక్షమయ్యాయి.
కడపజిల్లా అంటే…వైఎస్ జగన్, రాజశేఖర్ రెడ్డి, లేదా ఇంకోపార్టీ నాయకులది కాదని, ఇది అందరిదీ అనే కామెంట్స్ సీమ సమాజం నుంచి వెల్లువెత్తాయి. సిగ్గుంటే కడపజిల్లా బీజేపీ నాయకులు రాజీనామాలు చేయాలనే డిమాండ్స్ కూడా రావడం గమనార్హం.
వీర్రాజు వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్లు, రాజకీయా నాయకులు తమను కించపరచొద్దని ఆయన సూచించారు.
రాయలసీమ, కడప జిల్లా మీద సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసేలా సోమువీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని ఆక్షేపించారు. మనుషులను చంపుకునే కడప వారికి ఎయిర్‌పోర్ట్ ఎందుకనడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కోరికోరి సమస్యలు తెచ్చుకోవడం అంటే సోము వీర్రాజునే ఉదాహరణగా చెప్పుకోవాలి. వరుస వివాదాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.