కరోనా విరుగుడు వ్యాక్సిన్ విషయంలో ఇండియాలో మానవ ప్రయోగాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్, భారత్ బయో.. వ్యాక్సిన్ లు ఇండియాలో హ్యూమన్ ట్రయల్స్ లో ఉన్నాయి. అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ విదేశాల్లో ఒకరికి వికటించింది అనే వార్తల నేపథ్యంలో.. ఆ ప్రయోగాలు ఆగినట్టుగా ఉన్నాయి. ఇక భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రయోగాలు ఇంకా తక్కువ నంబర్ల మీదనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇండియాలో రష్యా వ్యాక్సిన్ వాడకానికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం!
తాము రూపొందించిన స్పూత్నిక్ వ్యాక్సిన్ విజయవంతం అయ్యిందని కొన్నాళ్ల కిందట రష్యా ప్రకటించింది. అయితే దాని ట్రయల్స్ పూర్తి స్థాయిలో జరగలేదని పలు పరిశోధన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మూడో దశ ప్రయోగాలే జరగలేదని అవి ఆక్షేపించాయి. అయితే రష్యా మాత్రం తమ వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి అందుబాటులో ఉంచనున్నట్టుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఇండియాలో కూడా రష్యా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీతో ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తోంది.
తొలి విడతగా పది కోట్ల డోస్ లను ఇండియాలో ఈ సంస్థ ద్వారా తయారు చేయనున్నారని సమాచారం. అయితే ఈ వ్యాక్సిన్ విషలుయంలో భారత నియంత్రణ సంస్థల అనుమతి రావాల్సి ఉంది.
ప్రస్తుతం రష్యాలో కొన్ని వేల మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. తొలి దశల్లో ఈ వ్యాక్సిన్ విజయవంతం అని రష్యా ప్రకటించింది. ఇండియాలో హ్యూమన్ ట్రయల్స్ జరగాల్సి ఉంది.
అయితే అత్యవసర పరిస్థితుల్లో స్పూత్నిక్ వ్యాక్సిన్ వాడకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వయో వృద్ధులకూ, కోవిడ్-19 బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి.. అత్యవసరం అనుకుంటే స్పూత్నిక్ వ్యాక్సిన్ ను ఇచ్చే విషయం లో కేంద్రం ప్రభుత్వం ఆలోచనలో ఉందట. అందుకు సంబంధించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
రష్యాలో మూడో దశ ప్రయోగ ఫలితాలు అక్టోబర్ కు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బహుశా ఆ సమయానికి అత్యవసరం అనుకునే వారు రష్యన్ వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో!