ఆ 900 ఎకరాలపై సీఎం జగన్ దృష్టి

అమరావతిలో భారీ భూ కంభకోణం జరిగింది అనేది వాస్తవం. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో 4వేల ఎకరాలకు పైగా భూమి చంద్రబాబు బినామీలు, టీడీపీ ఎమ్మెల్యేలు-మంత్రులు, లోకేష్ స్నేహితులు, బాలయ్య బంధువుల చేతిలోకి వెళ్లిందనేది…

అమరావతిలో భారీ భూ కంభకోణం జరిగింది అనేది వాస్తవం. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో 4వేల ఎకరాలకు పైగా భూమి చంద్రబాబు బినామీలు, టీడీపీ ఎమ్మెల్యేలు-మంత్రులు, లోకేష్ స్నేహితులు, బాలయ్య బంధువుల చేతిలోకి వెళ్లిందనేది పచ్చి నిజం. 

మరి దీన్ని ప్రక్షాళన చేయడం ఎలా? ఏసీబీ సంగతి సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి ప్రభుత్వం ఏం చేయాలి? అమరావతిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆమోదయోగ్యంగా ఉంటుంది? సరిగ్గా ఇక్కడే జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ముందుగా ఆ 900 ఎకరాలు

మొత్తంగా 4075 ఎకరాల భూమి టీడీపీ నేతలు, వాళ్ల బినామీల చేతుల్లో ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటిలో 900 ఎకరాల అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి లాక్కున్నట్టు తేల్చింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లోనే ఈ వివరాల్ని పొందుపరిచింది ఏసీబీ. ఇప్పుడు ఇక్కడ్నుంచి ప్రభుత్వం తన పనిని ప్రారంభించాలని అనుకుంటోంది. 

ముందుగా దళితులు, పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూముల్ని వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించబోతోంది. వాటిని ముందుగా స్వాధీనం చేసుకొని, సంబంధిత దళితులు, రైతులకు ఇవ్వడం ద్వారా అమరావతి భూ కుంభకోణం ప్రక్షాళన మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతులతో చర్చలు

ఇక ప్రభుత్వం ఆలోచిస్తున్న రెండో అతి పెద్ద చర్య రైతులతో చర్చలు. అమరావతి ఉద్యమం ప్రారంభమైన కొత్తలోనే రైతులను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. స్వయంగా మంత్రి బొత్స చొరవ తీసుకొని ఈ వివాదాన్ని ముగించాలనుకున్నారు. కానీ టీడీపీ మాయలో పడిన కొందరు రైతులు, మరికొంత మంది పెయిడ్ ఆర్టిస్టులతో కలిసి ఉద్యమం బాట పట్టారు. కట్ చేస్తే, ఇప్పుడా ఉద్యమం అతీగతీ లేకుండా పోయింది. చివరికి రాజధాని ప్రాంతవాసులు, ఇతర రైతులే ఆ ఉద్యమాన్ని లైట్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు జరపాలని ప్రభుత్వం ఆలోచన చేయడం, నిజంగా రైతుల అదృష్టంగానే చెప్పుకోవాలి.

అనుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్, రైతులతో చర్చలు జరిపితే టీడీపీకి అది పెద్ద షాక్. ఎందుకంటే, ఇన్నాళ్లూ ప్రభుత్వం-రైతుల మధ్య పెద్ద అగాధం సృష్టించడంలో టీడీపీ సక్సెస్ అయింది. ఇప్పుడు వైసీపీ మంత్రుల చొరవతో రైతులు-ప్రభుత్వం మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడేలా ఉంది. ఇదే టైమ్ లో జగన్ ఓ పరిష్కార మార్గం చూపించగలిగితే రైతుల దృష్టిలో ఆయన దేవుడవుతాడు. అప్పుడిక బాబు, టీడీపీ శ్రేణులు గుమ్మం దాటి బయటకు కూడా రాలేవు.

గ్రీన్ కారిడార్ కు నిధులు

కానీ రైతులతో చర్చలు జరిపి, ఈ సమస్యకు పరిష్కారం చూపించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు 90శాతం భూములు టీడీపీ బినామీల చేతుల్లో ఉన్నాయి. 

చట్టపరంగా వాళ్ల నుంచి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడం సాధారణ  విషయం కాదు. అసైన్డ్ భూముల్ని వెనక్కి తీసుకునే అధికారులు, చట్టపరంగా వెసులుబాట్లు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. మిగతా సాగుభూమిని తన స్వాధీనంలోకి తీసుకోవడం ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. అందుకే ప్రభుత్వం గ్రీన్ కారిడార్ ప్రతిపాదన తీసుకొచ్చింది.

అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే గ్రీన్ కారిడార్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ ప్రాంతంలో అద్భుతమైన పంటలు పండుతాయి. అలాంటి భూమిని కాస్తా రాజధాని పేరిట చంద్రబాబు బీడు చేశారు. తిరిగి దాన్ని సస్యశ్యామలం చేయగలిగితే ఇక ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. రైతులు కూడా దీనికి అభ్యంతరం చెప్పరు.

వీలైతే స్పెషల్  ప్యాకేజీ

ఈ మేరకు వీలైతే అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వర్తింపజేస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మరికొంత ఆర్థిక సాయం అమరావతి రైతులకు అందించే దిశగా జగన్ ఆలోచిస్తున్నారు. 

మొత్తమ్మీద ఏసీబీ ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చేలోపే.. ఇటు రైతులకు న్యాయం చేయడానికి జగన్ సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. బాబు చేసిన కుంభకోణానికి రైతులు బలైపోవడం జగన్ కు ఇష్టం లేదు. 

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి