ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు హైకోర్టులో తాత్కాలికంగా చుక్కెదురైంది. ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్ఈసీ తీసుకొచ్చిన ‘ఈ-వాచ్’ యాప్‌ను ఈ నెల 9వ తేదీ వరకు వినియోగించొద్దని హైకోర్టు స్టే విధించింది.
మూడు రోజుల క్రితం విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ-వాచ్ యాప్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆవిష్కరించారు. ఈ యాప్ తయారీతో పాటు నిర్వహించే ఉద్యోగులంతా ప్రైవేట్ వ్యక్తులు కావడంతో రాజకీయ వివాదానికి దారి తీసింది.
ఈ యాప్‌ను టీడీపీ తయారు చేసిందంటూ అధికార వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి వేయాల్సిందేనని ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే ప్రభుత్వంతో పాటు వైసీపీ విజ్ఞప్తిని ఎస్ఈసీ పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రైవేట్ యాప్‌ను నిలిపివేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ యాప్‌పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విలేకరుల అడిగిన ప్రశ్నకు ఎస్ఈసీ స్పందిస్తూ …. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యపడాలి తప్ప వేస్తే ఆశ్చర్యమేముందని ఎదురు ప్రశ్నించారు.
ఈ-వాచ్ యాప్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ యాప్ సెక్యూరిటీ సర్టిఫికెట్ ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. లేదని, ఐదు రోజుల్లో సమర్పిస్తామని ఎస్ఈసీ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 9వ తేదీ వరకూ యాప్ వినియోగాన్ని నిలిపివేయాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ నెల 9న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి.