విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేసి తీరుతామని ఇప్పటికి చాలాసార్లు కేంద్రం ప్రకటిస్తూనే ఉంది. ఇక్కడ ఆ విషయంలో మెచ్చుకుని తీరాలి. ఏ రోజునా తన మాటను మార్చకుండా అలాగే నిలబడి ఉంది. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం ఎందుకూ అంటే నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంటి పెట్టిన మూడు దశాబ్దాలలో నష్టాలు వచ్చిన సందర్భాలు బహు తక్కువ. అది కూడా సొంత గనులు లేకపోవడం వల్లనే.
ఈ లెక్కలు అన్నీ కూడా ఉక్కు మంత్రిత్వ శాఖకు బాగా తెలుసు. అయినా సరే ప్లాంట్ ని భరించలేం వదిలించుకొవాలనే అంటున్నారు. అయితే ఇక్కడ కార్మిక నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ వ్యక్తం చేస్తున్న సందేహాలు చాలానే ఉన్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమీ పూర్తిగా కుదేల్ కాలేదు. కాసింత సాయం అందించి ప్లాంట్ ని నిలబెట్టవచ్చు. కానీ ఎందుకు ఇలా దూకుడు చేస్తున్నారు అంటే ప్లాంట్ కి ఉన్న దాదాపుగా పద్దెనిమి వేల ఎకరాలా భూముల గురించే అన్న మాట కూడా వినిపిస్తోంది.
మా ప్రాంతానికి ప్లాంట్ వస్తోంది అంటే వారంతా ఉదారంగా భూములు ఇచ్చారు. ఇక ఉద్యోగాలు కూడా దక్కని వారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ అలా గాలికి వదిలేసి ప్లాంట్ మాది, దానికి ఇచ్చిన భూములు కూడా మావి ఏమైనా చేసుకుంటామని దూకుడు చేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.
విశాఖ ప్లాంట్ విలువ ఒక ఎత్తు అయితే మిగులు భూముల విలువ మూడు లక్షల కోట్లు గా ఉంటుందని అంటున్నారు. అంత విలువ చేసే ప్లాంట్ ని కేవలం 35 వేల కోట్లకు ఎలా ఇచ్చేస్తారు అంటూ ఉక్కు కార్మికులు కేంద్ర మంత్రులను కలసినపుడు ప్రశ్నించారు.
కానీ వారి నుంచి జవాబు లేదు. దీని బట్టి చూస్తూంటే ప్లాంట్ ప్రైవేటు వెనకాల ఉన్న బంగారు బాతు గుడ్డు లాంటి మిగులు భూముల కోసమే ఈ కధ నడుస్తోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇది భలే మంచి చౌక బేరంగానే ఉంది. దీని వెనక మతలబు ఈ రోజుకీ వరికీ అర్ధం కావడం లేదు అని ఉక్కు లోకం మండిపడుతోంది.