ఆ వైసీపీ ఎమ్మెల్యే చాలా మంది కంటే డిఫరెంట్. తన నియోజకవర్గం ప్రజలకు ఆయన ఒక విధంగా దేవుడుగానే చెప్పాలి. నిత్యం వారికి అందుబాటులో ఉండే ఆ ఎమ్మెల్యే విజయనగరం జిల్లా సాలూరుకి చెందిన గిరిజన నేత పీడిక రాజన్న దొర.
ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన ఇంటికి ఎవరైనా చాలా సులువుగా వెళ్ళి ఎమ్మెల్యేను కలిసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఎస్టీ వర్గానికి చెందిన ఆయన ఈ దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు. పేరుకు అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు కూడా అన్ని విధాలుగా చితికిపోయారని రాజన్నదొర అభిప్రాయపడ్డారు.
అంతే కాదు, ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలతో సమానంగా వారికి కూడా అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కూడా కోరారు. ఇది నిజంగా మంచి విషయమే. ఎందుకంటే అగ్రవర్ణాల మీద ఇప్పటికీ కొన్ని ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత ఉంటూనే ఉంది. వారు పూర్వపు స్థితిలో లేకపోయినా కూడా ఎందుకో వారి మీద అకారణ ద్వేషం సమాజంలో చాలా చోట్ల కనిపిస్తూంటుంది.
అలాంటిది రాజన్నదొర లాంటి వారు ఈ రకంగా మాట్లాడడం ద్వారా చాలా మంది కళ్ళు తెరిపించారనే అనుకోవాలి. కాగా జగన్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రస్తుతించడం విశేషం.