తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో తీర్పు వచ్చినప్పుడే సామాన్యులు కొంత నివ్వెరపోయారు. జయ, శశి, వారి సన్నిహితులు-బంధువులు ఇళవరసి, సుధాకరన్.. వీళ్లందరినీ దోషులుగా తేల్చింది కోర్టు. వారందరిపై నమోదైన అక్రమాస్తుల అభియోగాలు సుమారు 70 కోట్ల రూపాయల వరకూ ఉన్నట్టున్నాయి. అయితే ఒక్క జయకే కోర్టు విధించిన జరిమానా సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉన్నట్టుంది!
అక్రమాస్తులకు మించిన స్థాయిలో ఫైన్ లు ఉండటం వింత కాకపోవచ్చు కానీ, 70 కోట్లకే అక్రమాలు చేసిన వారు.. వంద కోట్లు తేవాలంటే, మరేం చేసి తేవాలి? అనేది సామాన్యుల్లో మెదిలిన ఒక ప్రశ్న! అయితే చట్టం, న్యాయాలు సామాన్యులకు అంతుబట్టవు అని సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందప్పట్లో!
ఆ సంగతలా ఉంటే.. ఇప్పటికే విడుదల అయిన శశికళ సుమారు పది కోట్ల రూపాయల వరకూ ఫైన్ కట్టినట్టున్నారు. అలాగే ఇళవరసి కూడా ఆ మాత్రం ఫైన్ కట్టినట్టున్నారు. అయితే ఇవే కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న సుధాకరన్ మాత్రం ఇప్పుడు ఈ విషయంలో ఆలోచనలో పడ్డట్టున్నాడనే వార్తలు వస్తున్నాయి.
కోర్టు ఒక షరతు విధించిందట. ఒకవేళ వారు ఆ పది కోట్ల రూపాయల ఫైన్ కట్టలేని పక్షంలో.. ఒక ఏడాది పాటు అదనంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని. అయితే అర్జెంటుగా బయటకు వెళ్లి రాజకీయాన్ని చేయాలనే లెక్కలతో ఉన్న శశికి ఆ పది కోట్లు ఒక లెక్క అనిపించలేదు. అలాగే ఇళవరసి కూడా పది కోట్ల రూపాయలను కట్టేసినట్టున్నారు. ఎటొచ్చీ.. సుధాకరన్ మాత్రం ఇంకా ఫైన్ చెల్లించలేదట, ఇప్పటికే నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న సుధాకరన్ ను విడుదల చేయడానికి కర్ణాటక జైళ్ల శాఖ రెడీనట.
అయితే పది కోట్ల జరిమానా చెల్లించకపోవడంతోనే విడుదల ఆగిందట. పది కోట్ల రూపాయలా, 12 నెలలా.. అనేది సుధాకరన్ ముందు ఛాయిస్ గా ఉందట. సుధాకరన్ పది కోట్ల రూపాయల కన్నా, 12 నెలల జైలునే ఎంచుకునేలా ఉన్నాడనే టాక్ తమిళనాట నుంచి వినిపిస్తోంది! ఈ సమీకరణాల ప్రకారం.. జైల్లో సుధాకరన్ ఆదా చేసేది నెలకు సుమారు కోటి!