రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, ఆ దిశగా ఎలాంటి అయోమయం, గందరగోళాలకు తావివ్వడం లేదు. ఏ చిన్న పుకారు పుట్టినా దాన్ని వెంటనే నివృత్తి చేస్తున్నారు.
తనకు, రాజకీయాలకు ఇక స్వస్తి అంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని రోజులుగా షికారు చేస్తున్న 2 పుకార్లకు రజనీకాంత్ వైపు నుంచి పూర్తి స్పష్టత వచ్చేసింది.
అర్జున మూర్తితో సంబంధం లేదు
రజనీకాంత్ ఇక రాజకీయాల్లోకి రారు అనే ప్రకటన వచ్చిన వెంటనే అర్జున మూర్తి పేరు తెరపైకి వచ్చింది. రాజకీయాలకు సంబంధించి రజనీకాంత్ కు కుడిభుజంగా ఉన్న అర్జున మూర్తి, కొత్త పార్టీ పెడతారని, ఆ పార్టీకి తెరవెనక నుంచి రజనీకాంత్ అండదండలు పుష్కలంగా ఉంటాయని అంతా అనుకున్నారు.
ఈ పుకారు వచ్చిన వెంటనే రజనీకాంత్ పై విమర్శల వర్షం మొదలైంది. ఎందుకంటే.. తమిళనాడు బీజేపీ మేథో విభాగం అధ్యక్షుడిగా చాన్నాళ్లు పనిచేశారు అర్జున మూర్తి. ఆయనకు రాజకీయ అనుభవం దండిగానే ఉంది. మరీ ముఖ్యంగా కాషాయం వాసనలు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో.. రజనీకాంత్ పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్నారంటూ ఆయనపై ప్రచారం జరిగింది. దీన్ని వెంటనే ఖండించారు రజనీకాంత్.
అర్జున మూర్తి కొత్త పార్టీ పెడితే, ఆ పార్టీకి రజనీకాంత్ కు చెందిన పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు రజనీ స్థాపించిన మక్కల్ మండ్రం పార్టీకి చెందిన కార్యదర్శులు విస్పష్టంగా ప్రకటన చేశారు.
రజనీకాంత్ భార్య పార్టీ పెడుతున్నారా?
రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటేనేం. ఆయన భార్య లతా రజనీకాంత్ ఉన్నారుగా. ఆమె కొత్తగా మరో పార్టీ పెట్టబోతున్నారు. భర్త ఆశీస్సులతో రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. తమిళ మీడియాలో దాదాపు 3 వారాలుగా నలుగుతున్న పెద్ద వార్త ఇది. దీనిపై కూడా రజనీకాంత్ వెంటనే క్లారిటీ ఇచ్చేశారు. తన భార్య పార్టీ పెట్టబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పేశారు.
ఇలా ఎప్పటికప్పుడు తనపై, తన పార్టీపై వస్తున్న పుకార్లును ఖండిస్తూనే ఉన్నారు రజనీకాంత్. చూస్తుంటే, ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాకముందే రాజకీయ సన్యాసం తీసుకున్నారనే విషయం అర్థమౌతోంది.
అన్నట్టు రజనీకాంత్ పార్టీలో ఇన్నాళ్లూ జిల్లా స్థాయి పదవుల్లో, ఇతర ముఖ్య పదవుల్లో ఉన్నవాళ్లంతా రాజీనామాలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. వాళ్లంతా తమ పదవులకు రాజీనామాలు చేసి డీఎంకే, బీజేపీలో చేరబోతున్నారు. అలా సక్సెస్ ఫుల్ గా తన రాజకీయ ప్రయాణానికి తెరదించేశారు రజనీకాంత్.