బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తన పార్టీ అధిష్టానాన్ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. పార్టీలో ఆయన ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ విషయమై బీజేపీలో విస్తృతంగా అంతర్గత చర్చ జరుగుతోంది. సుజనా చౌదరి ప్రియ శిష్యుడు లంకా దినకర్ కూడా పార్టీ విధానాలకు విరుద్ధంగా టీడీపీ అనుకూల చానళ్లలో మాట్లాడుతుండడంతో షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఇది సుజనా చౌదరికి మరింత మంట పుట్టించిందనే టాక్ వినిపిస్తోంది. లంకా దినకర్‌కు షోకాజ్ నోటీసు అంటే పరోక్షంగా సుజనా చౌదరికి ఇవ్వడమే అని బీజేపీలో ఆయన వ్యతిరేక వర్గీయులు చెబుతున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాజధాని అమరావతి అంశంపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై వెల్లడించిన అభిప్రాయాలు పరస్పరం విరుద్ధంగా ఉండడంతో ప్రజల్లో పార్టీ పలుచన అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశ రాజధానిలో బీజేపీ జాతీయ నేతలు జీవీఎల్ నరసింహరావు, సునీల్ దేవరా (ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ ) సమక్షంలో సోము వీర్రాజు మాట్లాడుతూ రాజధానిపై చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టారు.
‘ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టారు. చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నాం. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటాం. రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని సోము వీర్రాజు ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు యత్నించారు.
ఇక హైదరాబాద్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై ఎప్పట్లాగే రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజధానిపై ఆయనేం మాట్లాడారంటే…
‘ రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది. రాజ్యసభ్య ఎంపీగా చెబుతున్నా కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుంది. రాజధాని వికేంద్రీకరణ బదులు పాలన వికేంద్రీకరణ జరగాలి. రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదు. కౌన్సిల్ ఆమోదిం చకుండా రాజధాని విభజన బిల్లును గవర్నర్‌కి పంపడమే రాజ్యాంగ విరుద్ధం. అసలు రాజధాని మార్పు ఫైల్ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి. సెలెక్ట్ కమిటీ ఆమోదించిందా లేదా అనేది కూడా తెలియడం లేదు’ అని సుజనా చౌదరి ఘాటుగా స్పందించారు.
ఒకవైపు ఢిల్లీలో బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మొట్ట మొదటి విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీగా మాత్రమే రాజధాని అంశంపై పోరాడుతామని చెప్పారు. అంతే తప్ప కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. సోము వీర్రాజు చెప్పిందానికి పూర్తి విరుద్ధంగా ఒకే రోజు సుజనా చౌదరి మాట్లాడడంపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరో వైపు అమరావతి విషయంలో వెనక్కి తగ్గకూడదని సుజనా చౌదరి కూడా గట్టి పట్టుదలతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.
లంకా దినకర్, లక్ష్మిపతిరాజు లాంటి చిన్నచిన్న నాయకులకు షోకాజ్ నోటీసులు, ఇతరత్రా చర్యలు తీసుకోవడంలో బీజేపీ చొరవ చూపింది. మరి సుజనా చౌదరి ఏకంగా పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడుతుంటే కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని విషయంలో పార్టీ విధానాలకు విరుద్ధంగా సుజనా చౌదరి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటే నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కళ్లప్పగించి చూస్తుంటారా? లేక చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తొలి రోజు నుంచే సోము వీర్రాజుకు సుజనా రూపంలో పెద్ద సవాల్ ఎదురైంది. సుజనాపై అనుసరించే వైఖరే ఆయన నాయకత్వ బలమేంటో తేలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.