మాజీ మంత్రి వివేకా హత్య కేసు మిస్టరీని ఛేదించే క్రమంలో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇదే సందర్భంలో సీబీఐ వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ చెబుతున్న సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు సంధిస్తున్న ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి. సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు వేస్తున్న ప్రశ్నలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ఔను…వాళ్లు అడుగుతున్న ప్రశ్నల్లో న్యాయం ఉందనే వాదన మరోవైపు బలంగా వినిపిస్తోంది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను అన్యాయంగా ఇరికించేందుకు సీబీఐతో పాటు రాజకీయ ప్రముఖులు ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారనేది నిందితుడి కుటుంబ సభ్యుల ఆవేదన. మీడియాతో సునీల్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ ఆవేదనను పంచుకున్నారు.
సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ వివేకా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరు పెద్ద నాయకులు తన అన్నను ఇరికిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. అలాగే ఆ పెద్దవాళ్లు, సీబీఐ అధికారుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
వివేకాను హత్య చేసిందెవరో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రజలందరికీ తెలుసని కిరణ్ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. సునీల్ భార్య లక్ష్మీ మాట్లాడుతూ… ఈ కేసులో వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన జాబితాలోని 11 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ఎందుకు విచారించట్లేదని కన్నీటిపర్యంతమవుతూ సూటిగా ప్రశ్నించారు.
సునీల్ తమ్ముడు, భార్య ప్రెస్‌మీట్‌లో లేవనెత్తిన ప్రశ్నలతో మరిన్ని అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఇంతకూ ఆ పెద్దలెవరు? వివేకా కుమార్తె హైకోర్టుకు సమర్పించిన అనుమానితులను సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదనే మౌలికమైన ప్రశ్నలు పౌర సమాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అనుమానాలకు, ప్రశ్నించే నోళ్లను మూయించాలంటే సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.