పరువు పోగొట్టుకోడానికి ఏ కోర్టు అయితేనేం?

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ప‌రువు మ‌ర్యాద‌ల గురించి పెద్ద‌గా ప‌ట్టింపులు లేన‌ట్టుంది. ఒక‌వేళ ఉంటే న్యాయ‌స్థానాల్లో ఇలాంటి ప్ర‌తికూల పరిస్థితుల‌ను ఎదుర్కొనే దుస్థితి వ‌చ్చేది కాదేమో. ప‌రువు పోగొట్టుకోడానికి ఏ కోర్టు అయితేనేం అన్న‌ట్టుంది వ్య‌వ‌హారం.…

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ప‌రువు మ‌ర్యాద‌ల గురించి పెద్ద‌గా ప‌ట్టింపులు లేన‌ట్టుంది. ఒక‌వేళ ఉంటే న్యాయ‌స్థానాల్లో ఇలాంటి ప్ర‌తికూల పరిస్థితుల‌ను ఎదుర్కొనే దుస్థితి వ‌చ్చేది కాదేమో. ప‌రువు పోగొట్టుకోడానికి ఏ కోర్టు అయితేనేం అన్న‌ట్టుంది వ్య‌వ‌హారం. ఇప్ప‌టికే హైకోర్టులో ప‌దుల సంఖ్య‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా  ఆదేశాలు, తీర్పులు వెల్ల‌డైన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో కూడా పంచాయ‌తీ కార్యాల‌యంలో రంగుల త‌ర్వాత రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను త‌ప్పు ప‌ట్టింది. అంతేకాదు, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌తో అట‌లేమిటిని సుప్రీంకోర్టు గ‌ట్టిగా నిల‌దీసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఒక ఆర్డినెన్సుతో ఎలా తొలగిస్తారని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఆర్డినెన్సు వెనుక ఉద్దేశాలతో తాము సంతృప్తి చెందలేదని, ఇలాంటి ఆర్డినెన్సును ఎలా ఆమోదిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గ‌మ‌నార్హం.

హైకోర్టు కావచ్చు, తాజాగా సుప్రీంకోర్టు కావ‌చ్చు…అక్క‌డ ఏపీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా వ‌స్తున్న తీర్పులు, ఆదేశాల‌పై వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహ‌ల‌కు లోన‌వుతున్నాయి. జ‌గ‌న్ స‌ర్కార్‌లో స‌రైన న్యాయ కోవిదులు లేర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక అంశంపై ఏదైనా ఆర్డినెన్స్ లేదా జీవో తీసుకొచ్చే ముందు న్యాయ‌ప‌రంగా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అస‌లు న్యాయ వ్య‌వ‌స్థ‌తో త‌మ‌కు సంబంధం లేన‌ట్టు ఏపీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జ‌గ‌న్‌ను బాగా అభిమానించే వాళ్లు కూడా విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌భుత్వ బ‌డుల్లో ఒక‌టి నుంచి ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెట్ట‌డంపై ఇప్ప‌టికే హైకోర్టులో చుక్కెదురైంది. సంబంధిత జీవోల‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ నేప‌థ్యంలో మెజార్టీ త‌ల్లిదండ్రుల అభిప్రాయం పేరుతో ఆంగ్ల మాధ్య‌మాన్ని అమ‌లు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ అడుగులు ముందుకేస్తోంది.

ఇదే క్ర‌మంలో  రాష్ట్ర స‌ర్కార్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. మ‌రి అక్క‌డ హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తారా?  లేక ఏపీ స‌ర్కార్‌కు అనుకూలంగా తీర్పు వెలువ‌డుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెల‌కుంది. కానీ ఏపీ స‌ర్కార్ తీసుకుంటున్న అస‌మ‌గ్ర నిర్ణ‌యాల నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది.

-సొదుం

‘జగనన్న చేదోడు’ ప్రారంభం