నో డౌట్.. శివశంకరీ పాటను ఖూనీ చేశారు బాలకృష్ణ. బర్త్ డేకు కొన్నిగంటల ముందు ఈ అపవిత్రాన్ని ఆన్ లైన్లోకి ఎక్కించి తెలిసినవాళ్లచేతా, తెలియనివాళ్ల చేతా బండబూతులు తిట్టించుకున్నారు. కనీసం బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్స్.. మొహమాటానికి కూడా ఆ పాట బాగుందని చెప్పలేదు. అలాంటి పాటని ఎందుకు పాడాల్సి వచ్చిందో, దాని రెస్పాన్స్ ఎలా ఉందో స్వయంగా బాలకృష్ణే చెప్పారు.
శివశంకరీ వంటి పాటను టచ్ చేసి, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తో పూర్తిగా ఆత్మరక్షణలో పడిన బాలకృష్ణ.. తన తప్పును కవర్ చేసుకోడానికి అష్టకష్టాలు పడ్డారు. గతంలో తాను ఓ సినిమా కోసం 'మామా ఏక్ పెగ్ లా' అనే పాట పాడానని, తనతోపాటు… చాలామంది హీరోలు సంగీతం వచ్చినా రాకపోయినా సినిమాల్లో పాటలు హమ్ చేస్తుంటారని, కాఫీ, టీ, మందు మీద పాటలు పాడారని చెప్పుకొచ్చారు. ఇలా కాఫీ, టీ మీద పాడడం కంటే.. ఓ మంచి పాటని ఎంచుకుని ఎందుకు పాడకూదనే ఉద్దేశంతోనే తాను 'శివశంకరీ' పాట పాడానన్నారు బాలయ్య.
ఎప్పట్నుంచో తనకో పట్టుదల ఉందని, అందుకే ఆ పాట పాడటాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకుని మరీ పాడానని చెప్పారు. ధైర్యసాహసాలు-పట్టుదల అనేవి నందమూరి వంశంలోనే ఉన్నాయని, అందుకే ఆ ప్రయత్నం చేశానని అన్నారు బాలయ్య. చివర్లో ఆ పాటని అభిమానిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ కృతజ్ఞతలు అని కూడా అనేశారు. ఇంతకీ ఆ పాటని అభిమానించే ఆ దురభిమానులెవరో ఆయనకే తెలియాలి.
వాస్తవానికి శివశంకరీ పాటకి పూర్తిస్థాయిలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. బాలయ్య వ్యవహారం తెలిసినవారెవరూ ఆయన ముందు నోరు విప్పి పాట గురించి చెప్పలేకపోవచ్చు కానీ.. నాగబాబు లాంటి వైరి వర్గాలు, కొంతమంది తటస్థులు, మరికొంతమంది నందమూరి అభిమానులు సైతం బాలయ్య గాత్రాన్ని పరిహాసం చేశారు. దీంతో తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నారాయన. పాట బాగుందని అంటూనే, దాన్ని ఓ సాహసంగా అభివర్ణించుకున్నారు. అలాంటి సాహసాలు చేయడం తనకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని జబ్బలు చరుచుకున్నారు.
మొత్తమ్మీద బాలయ్య వ్యవహారం ఎలా ఉందంటే.. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది. ఆయన సోషల్ మీడియా సందేశం విన్న నెటిజన్లంతా మరోసారి తిట్లు అందుకున్నారు.