ఏపీ రాజధాని కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో వరుసగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాలనా వికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు , సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను నిలిపి వేయాలని ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే హైకోర్టులో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి కుమార్తె రుక్మిణి బాబ్డే వాదిస్తున్న విషయాన్ని బాబ్డే దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఆయన వెంటనే నాట్ బిఫోర్ మీ అంటూ విచారణ నుంచి తప్పుకున్నారు. దీన్ని నారిమన్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఈ రోజు నారిమన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో కేసును సదరు న్యాయమూర్తి తండ్రి పాలీశ్యామ్ నారీమన్ కూడా అమరావతి తరపున వాదిస్తున్న విషయాన్ని తీసుకెళ్లారు.
దీంతో న్యాయమూర్తి రోహింటన్ నారిమన్ కూడా ప్రధాన న్యాయమూర్తిలాగే నాట్ బిఫోర్ మీ అంటూ విచారణ నుంచి తప్పుకున్నారు. అమరావతి రైతుల తరపున తన తండ్రి వాదిస్తుండడంతో విచారణ అధికారిగా ఉండడం సరైంది కాదనే భావనతో ఆయన తప్పుకున్నారు. దీంతో కేసు రెండోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో వరుసగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా అమరావతి తరపు పిటిషనర్ల తెలివితేటలకు జనం అబ్బురపోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో న్యాయమూర్తి రక్త సంబంధీకులను న్యాయవాదులుగా నియమించుకోవడంలో అమరావతి తరపు పిటిషనర్ల తెలివి తేటలు, దూరపు ఆలోచన ఎంతమందికి ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. కేసు నెగ్గేందుకు అమరావతి తరపు పిటిషనర్లు అన్ని రకాలుగా సర్వశక్తులు ఒడ్డుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రెండు రోజుల క్రితం విచారణ నుంచి తప్పుకునే సందర్భంలో నారీమన్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పుడే నారీమన్ తండ్రి అమరావతి తరపున వాదిస్తున్న విషయాన్ని తీసుకెళ్లి ఉంటే…ఇప్పుడు వాయిదా పడే అవకాశం ఉండేది కాదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరిగి కేసు ఎప్పుడు విచారణకు వచ్చేది చెప్పలేదు.