సుప్రసిద్ధ లాయర్ ప్రశాంత్ భూషణ్ క్షమాపణలను, వివరణను దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. 2009లో ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తులంతా అవినీతిపరులంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయమై ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన వివరణ, క్షమాపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తులపై చేసిన తీవ్ర ఆరోపణలు కోర్టు ధిక్కరణ కిందకి వస్తాయా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ కేసును వచ్చే సోమవారం విచారించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.
ఇటీవల కూడా న్యాయసంబంధిత అంశాలపై ప్రశాంత్ భూషణ్ ట్విటర్ వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. వాటిపై కూడా కోర్టు ధిక్కరణ కేసును ప్రశాంత్ భూషణ్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కోర్టు ధిక్కరణ పేరుతో భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారంటూ ప్రశాంత్ భూషణ్ సహా మరో ఇద్దరు ప్రముఖులు సుప్రీంకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇక ఇవాళ సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాల విషయానికి వస్తే… 2009లో తెహల్కా మ్యాగ్జైన్‌కు ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో 16 మంది న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులే ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో ప్రశాంత్ భూషణ్ ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించాయి. న్యాయస్థానాలపై ప్రశాంత్ భూషణ్ తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు.
ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే బైక్‌ను తొలడాన్ని ప్రశాంత్ తప్పు పట్టారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ భావ ప్రకటనా స్వేచ్చకు, కోర్టు ధిక్కరణకు చిన్న తేడా ఉందని అభిప్రాయపడింది. అయితే తన మాటల వల్ల ఎవరు ఇబ్బందిపడ్డా, సీజేఐలు లేదా వారి కుటుంబసభ్యులకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు లాయర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదే సందర్భంలో ప్రశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచురించిన సీనియర్ జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్ కూడా క్షమాపణలు చెప్పారు. కాగా ప్రశాంత్ వివరణ, క్షమాపణలను తిరస్కరించిన సుప్రీంకోర్టు చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.