అమరావతి భూ కుంభకోణంపై ధర్యాప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై హై కోర్టు స్టే విధించడాన్ని అభ్యంతరం చెబుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ తుది దశకు వచ్చింది.
తదుపరి విచారణలో తుదివాదనలు వినబోతున్నట్టుగా సుప్రీం ధర్మాసనం ప్రకటించిందని సమాచారం. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై ఆ రాష్ట్ర హై కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.
అసలు విచారణే జరగకూడదంటూ స్టే విధించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ ఉంది. హై కోర్టు ఆదేశాలు అసాధారణంగా ఉన్నాయంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఎక్కింది.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ తీసుకున్న అన్ని నిర్ణయాలనూ విచారిస్తారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించినట్టుగా సమాచారం. అలాంటిదేమీ లేదని, అక్రమాలు జరిగాయనే అంశాల మీదే విచారణ ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించినట్టుగా తెలుస్తోంది.
మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటు అయ్యింది, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను కోరుతూ కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదించిన విషయాన్ని ప్రస్తావించారు.
సిట్ విచారణతో సంబంధంలేని కొంతమంది ఈ కేసులో సుప్రీం కోర్టుకు వచ్చారని, వారు విచారణపై స్టే ను కొనసాగించాలని కోరుతున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ, అప్పుడు తుది వాదనలు వినబోతున్నట్టుగా ధర్మాసనం ప్రకటించినట్టుగా తెలుస్తోంది.