రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కడిగి పారేసింది. కేవలం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కాపాడే ఉద్దేశంతో…స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సమర్థించిందని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
తదుపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల వాయిదాలో ఎన్నికల కమిషనర్ నిర్ణయంలో రాజకీయ కోణాలున్నాయని అడిషనల్ సొలిసిటరీ జనరల్ దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అలాంటిదేమీ లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించారు. లేకపోతే పరిస్థితి ఇంత వరకూ ఎందుకొచ్చిందని చీఫ్ జస్టిస్ బాబ్డే ప్రశ్నించారు.
సుప్రీంకోర్టులో వాదప్రతివాదనలు ఎలా జరిగాయంటే…
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటరీ జనరల్ నద్కర్ని వాదనలుః
రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపున ఎన్నికల నిరంతరాయంగా వాయిదా వేస్తారు, ఇంకోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తారు? ఈ రెండూ ఎలా చేయగలుగుతారు? ప్రభుత్వం, పాలన స్తంభించపోవాలా? ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల కమిషనర్ తెలుసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తోంది. వీటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేస్తే.. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేవియట్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఒక పొలిటికల్ లైన్ ప్రకారం వెళ్లారని అర్థమవుతోంది. ఎన్నికలను వాయిదా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతిలో వెళ్లలేదు. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైన సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు.
తమ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే స్పందిస్తూ…తప్పకుండా రాజకీయాలు ఉండకూడదని, కాని, పరిస్థితి ఇంతవరకూ ఎందుకు వచ్చిందని నిలదీశారు.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోడ్ఉంటుందని, ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించారు.
మరో జడ్జి గవాయ్ స్పందిస్తూ ఒకవైపు ఎన్నికలను వాయిదా వేశామంటున్నారు, మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగిస్తామంటున్నారు… రెండూ ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. అంతేకాదు ప్రభుత్వం స్తంభించిపోవాలని కోరుకుంటున్నారా? అని జస్టిస్ గవాయ్ గట్టిగా నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలన స్తంభించిపోవాలన్న ఉద్దేశంతో, రాజకీయంగా ఒక లైన్ ప్రకారం వెళ్లారని, ప్రభుత్వం పనిచేయకుండా అడ్డుకోవాలన్న కుట్ర దాగి ఉందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదన వినిపించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాల పంపిణీని హైకోర్టు నిలిపి వేసిందంటూ సుప్రీంకోర్టును రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. దీనికి వెంటనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ అడ్డుపడ్డారు. అలాంటి ఆదేశాలేవీ హైకోర్టు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏజీ కూడా ఇక్కడే ఉన్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రీ నోటిఫై చేయాలని ఆదేశించింది.
ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినందున …ఆ నిర్ణయంపై ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కోడ్ను తక్షణం ఎత్తి వేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇప్పటికే ప్రారంభించిన లేదా ఇన్షియేట్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల సంఘం ఆడ్డుకోవద్దని సుప్రీం ఆదేశించింది.
తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం ఏవైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించింది. తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లోకి తీసుకోవాలని సుప్రీం సూచించింది.