అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ విచారణను నిలిపివేస్తూ, అదే సమయంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను బయట పెట్టకూడదని, మీడియాలో కానీ-సోషల్ మీడియాలో కానీ దాని గురించి ఎక్కడా చర్చ జరగకూడదని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్స్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది.
కొన్నాళ్ల కిందట వచ్చిన ఈ ఆర్డర్స్ పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏపీ హై కోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్స్ పై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అప్పట్లోనే ఈ అంశంపై పలువురు ఘాటుగా స్పందించారు.
సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ గాగ్ ఆర్డర్స్ ను ఔట్ ఆఫ్ ఆర్డర్ గా అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖ జర్నలిస్టులు ఆ ఆర్డర్స్ పై విమర్శనాత్మకంగా స్పందించారు.
ఈ కేసులో మాజీ ఏజీ దమ్మాలపాటి కోర్టుకు వెళితే.. అందరి విషయంలోనూ కోర్టు స్పందించిందని, గాగ్ ఆర్డర్స్ ఇచ్చిందని, జరిగిన కుంభకోణంపై విచారణ జరగకూడదా? ఆ అంశంపై ఎక్కడా చర్చ జరగకూడదా? అనే అంశాలపై ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించినట్టుగా తెలుస్తోంది.
దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ గాగ్ ఆర్డర్స్ పై స్టే విధించింది. ఈ కేసును ఫైనల్ చేయవద్దని కూడా హై కోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై తదుపరి విచారణను జనవరి నెలాఖరుకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.
ఏపీ హై కోర్టు గాగ్ ఆర్డర్స్ పై సుప్రీం స్టే నేపథ్యంలో.. ఎఫ్ఐఆర్ పై చర్చ మొదలైంది. మరి సుప్రీం స్పందన నేపథ్యంలో.. ఏసీబీ విచారణ, తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తిదాయకంగా మారింది.