సిలబస్, టూల్స్ వేరు

జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని నేటికి పదేళ్ళు. ఈ పదేళ్ళలో అనేక ఆటుపోట్లు ఉన్నా చివరికి లక్ష్యం నెరవేర్చుకుని అధికారపీఠంపై కూర్చున్నారు.  వాస్తవానికి ఈ పదేళ్ళలో జగన్ ఇంతగా పెరగడానికి కాంగ్రెస్ తో…

జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని నేటికి పదేళ్ళు. ఈ పదేళ్ళలో అనేక ఆటుపోట్లు ఉన్నా చివరికి లక్ష్యం నెరవేర్చుకుని అధికారపీఠంపై కూర్చున్నారు.  వాస్తవానికి ఈ పదేళ్ళలో జగన్ ఇంతగా పెరగడానికి కాంగ్రెస్ తో పాటు, టీడీపీ-మీడియా వింత ధోరణే కారణం.

'పిల్లకాకి… వాడేం చేస్తాడు” అనే ధోరణిలో కాంగ్రెస్ ఉండిపోయింది. ఒకదశలో కాస్త మేలుకున్నా, జైలుకు పంపినా పిల్లకాకిని ఉండేలుతో కూల్చే అవకాశం లేక (ఎన్నికలు వచ్చి) కాంగ్రెస్ కుప్పకూలిపోయింది. మొదట్లో సరిగా అంచనవేయలేక పోయిన కాంగ్రెస్ తప్పు తెలుసుకుని తొక్కేద్దాం అనుకునేలోపు ఉండేలు దెబ్బ తనకే తగిలి తను అకాల మరణం చెందింది. 

తుపాకీ శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు అది పేలితే కానిస్టేబుల్ చనిపోవడం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కాంగ్రెస్ కూడా అలాగే పోయింది. ఇక టీడీపీ, దాని అనుబంధ మీడియా కూడా జగన్ ను రాజకీయ కోణం నుంచి చూడలేదు. జగన్ ను ఓ ఫ్యాక్షనిస్టుగా, అవినీతి పరుడిగా చూస్తూ, జనానికి అలాగే చూపెడుతూ వచ్చింది. 

వ్యక్తిత్వ హననం చేస్తే జనం అతణ్ణి అంగీకరించరు అనే అభిప్రాయంతో అదే ప్రచారం చేస్తూ చివరికి లక్షకోట్లు అనే ఆరోపణ విస్తృతంగా చేసింది. 2014 ఎన్నికల్లో కూడా లక్షకోట్లే టీడీపీ ప్రచార అస్త్రం.

అయితే పిల్లకాకి అంటూ కాంగ్రెస్, లక్షకోట్లు అంటూ టీడీపీ-మీడియా జగన్ రాజకీయనేతగా ఎదుగుతున్న విషయాన్ని గుర్తించలేదు. అది జగన్ కు చాలా వరకు అనుకూలించింది. పిల్లకాకి లేబుల్, లక్షకోట్లు లేబుల్ అలానే ఉంచి, ప్రత్యర్థుల్ని వాటిపైనే బిజీగా ఉండేలా చేసుకుని మెల్లిగా రాజకీయ బాట పటిష్టం చేసుకున్నాడు జగన్.

విచిత్రం ఏమంటే ప్రత్యర్ధులు ఇప్పటికీ జగన్ వ్యూహం ఏంటి అని గమనించలేకపోవడం. ఆయన అస్త్రాలు ఏంటి అని దృష్టి పెట్టకపోవడం. ఇంతకుముందు ఓ సందర్భంలో చెప్పుకున్నట్టు జగన్ అంటే రాజారెడ్డి కాదు. రాజశేఖర్ రెడ్డి అంతకన్నా కాదు. 

“మేం రాజారెడ్డినే ఎదుర్కున్నాం” అన్నా లేక “రాజశేఖర్ రెడ్డినే ఢీ కొట్టాం” అన్నా ఇప్పుడు చెల్లదు.   ఆ ఇద్దరూ విడివిడిగా వేరు. ఇప్పుడు జగన్ తో సిలబస్ వేరు. జగన్ ఆయుధాలు వేరు. జగన్ రాజకీయం వేరు. 

చిప్పకూడు అని హేళన చేస్తే అదే చిప్పకూడు తినిపిస్తాడు. అడ్రస్ లేకుండా చేస్తా అని హెచ్చరిస్తే అడ్రస్ లేకుండా చేస్తాడు. అతనిదో డిఫరెంట్ స్కూల్… డిఫరెంట్ టూల్. చంద్రబాబుతో సహా ప్రత్యర్ధులు ఎవరైనా తమ సిలబస్ ఇప్పుడు మార్చుకోవాల్సిందే. 

1984 నాటి సిలబస్, టూల్స్ వాడి ఉంటే 1995లో చంద్రబాబు విజయం సాధ్యమయ్యేది కాదు. అంటే ప్రత్యర్థితో పాటు కాలంలో వచ్చే మార్పులు కూడా పరిగణలోకి తీసుకుని అప్డేట్ అవ్వాలి. 

జగన్ ని గెలవాలంటే రాజారెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని ఏకకాలంలో గెలవడానికి కావలసిన సిలబస్, టూల్స్ ఇప్పుడు ప్రత్యర్థులకు అవసరం. ఆ సిలబస్, ఆ టూల్స్ ప్రత్యర్థుల దగ్గర లేకపోవడమే జగన్ విజయ రహస్యం. 

విచిత్రం ఏమంటే ఈ పదేళ్ళలో అరేళ్ళుగా ఢిల్లీలో మోడీకి, అమిత్ షా కి కలిసొచ్చింది కూడా ఇదే పరిస్థితి. ఢిల్లీలో ప్రత్యర్ధులు ఇంకా వాజ్ పాయ్-అడ్వాణీలపై వాడిన టూల్సే, ఆ సిలబస్ నే మోడీ-షా పై ఉపయోగించి బోర్లా పడుతున్నారు. 

మోడీ-షా ల స్కూల్ వేరు, సిలబస్ వేరు, టూల్స్ వేరు. అవేవీ ప్రత్యర్థుల దగ్గర లేకపోవడమే ఈ ద్వయం విజయ రహస్యం. ఢిల్లీలో అయినా, ఆంధ్రాలో అయినా రాజకీయ పాఠశాలలో సిలబస్ మారింది. లాబొరేటరీలో టూల్స్ మారాయి. తరగతి గదిలో బ్లాక్ బోర్డు, చాక్పిసు స్థానంలో డిజిటల్ బోర్డు వచ్చింది.  

ప్రత్యర్ధులు కూడా తమ సిలబస్, టూల్స్ మార్చుకోకపోతే ఈ రాజకీయం మరో పదేళ్ళు నడుస్తుంది.

Face book post by Gopi Dara