కాంగ్రెస్ ఐక్యత.. నిజంగా నిజమేనా!

హుజూర్ నగర్ బైపోల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్లోకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా దిగుతున్నారట. అలాగే రేపోమాపో రేవంత్ రెడ్డి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయడం మొదలుపెడతారట!…

హుజూర్ నగర్ బైపోల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్లోకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా దిగుతున్నారట. అలాగే రేపోమాపో రేవంత్ రెడ్డి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయడం మొదలుపెడతారట! వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఈ మాటలు. హుజూర్ నగర్ బైపోల్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన ఐక్యత కనిపిస్తూ ఉండటం గమనార్హం.

ప్రత్యేకించి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో.. ఆమె విజయం కోసం కాంగ్రెస్ వాళ్లు గట్టిగా పని చేయబోతున్నారనే విషయమే ఆశ్చర్యకరంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ వైరం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఉత్తమ్ ను పీసీసీ పదవి నుంచి దించడమే ధ్యేయంగా చాన్నాళ్లుగా గడుపుతున్నారు వెంకట్ రెడ్డి. అయితే ఆ విషయంలో ఆయన సఫలీకృతం కాలేకపోతున్నారు.

ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తనుచెప్పిన అభ్యర్థే పోటీచేయాలని పట్టుబట్టారు రేవంత్ రెడ్డి. అభ్యర్థి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. ఉత్తమ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఆయనే ఉత్తమ్ భార్య తరఫున ప్రచారానికి రాబోతున్నారట!

ఇదీ కథ.. ఆశ్చర్యకరమైన కథ. వీళ్లంతా నిజంగానే ఐక్యతతో ఉన్నారా, లేక ఐక్యతతో ఉన్నట్టుగా కనిపించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారా.. అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. గెలిస్తే వీళ్లు అంతా కలిసి కట్టుగా గెలిచామని అనొచ్చు. గెలవకపోతే మాత్రం.. మళ్లీ ఒకర్నొకరు తీవ్రంగా విమర్శించుకోవడం మాత్రం ఆగకపోవచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం