తెలంగాణలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని రకాల విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకూ సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఈ నెల 8 నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ సిఫార్సుల మేరకు విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
గతంలో కరోనా మొదటి, రెండో వేవ్‌లో కూడా విద్యాశాఖ సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు పూర్తిగా సెలవులతోనే విద్యాసంవత్సరం గడిచిపోయింది. ఆన్‌లైన్ క్లాస్‌లతోనే చదువు సాగింది. దీంతో సరిగా అర్థంకాక భారీగా నష్టపోవాల్సి వస్తోందనే ఆవేదన పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. ఇటీవల ఇంటర్‌మీడియటర్ ఫలితాలు ఎంతగా ఆందోళన కలిగించాయో అందరికీ తెలిసిందే.
చివరికి ఫెయిల్ అయిన వారిని కూడా ప్రభుత్వమే పాస్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించిన సెలవులు తాత్కాలికమా లేక రానున్న రోజుల్లో అదే కంటిన్యూ అవుతుందా అనే చర్చకు దారి తీసింది. రానున్న రోజుల్లో కరోనా మరింతగా విజృంభిస్తుందన్న వైద్య శాఖ హెచ్చరిక …చదువుకు సంబంధించి మునుపటి చేదు రోజుల్ని గుర్తు చేస్తోంది. అంటే ఈ సెలవులు వచ్చే నెలలో కూడా కొనసాగుతాయనే చర్చ జరుగుతోంది.