దాదాపుగా న్యూస్ పేపర్లు అన్నీ పాంప్లేట్లుగానే మారిపోయిన ఈ సందర్భంలో.. ఎక్కడో కొంత న్యూస్, వ్యూస్ మాత్రం కనిపించక మానవు. కానీ టీడీపీ ఈ-పేపర్ మాత్రం పూర్తిగా పాంప్లేట్ స్థాయిలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే కరపత్రం కంటే బాగా దిగజారింది, పడిపోయింది, నేలబారుగా పాకుతోంది. గల్లీ స్థాయిలో టీడీపీ నేతలు చేపట్టిన కార్యక్రమాల కరపత్రికే ఈ ఈ-పేపర్.. కాదు కాదు ఈ పాంప్లేట్. డబ్బు, సమయం, మేన్ పవర్.. అన్నీ వృథా. సోషల్ మీడియా ఫార్వార్డ్ మెసేజ్ లు, ట్విట్టర్ జోకులు.. ఇవే ఇందులో కనిపిస్తాయి.
ఇన్నాళ్లూ తాను పేపర్ పెట్టలేదు, ఛానెల్ పెట్టలేదు అంటూ బిల్డప్ ఇచ్చుకున్న చంద్రబాబు.. అవసాన దశలో ఈ-పేపర్ అంటూ తన పరువు తానే తీసేసుకున్నారు.
ఈ-పేపర్ పెట్టాల్సిన అవసరం ఏంటి..?
ఎలాగూ పచ్చపాత పత్రికలు, ఛానెళ్లు టీడీపీకి బాకాలూదుతున్నాయి కదా, కొత్తగా ఈ-పేపర్ ఏంటి అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ పచ్చ పత్రికలపై ఆ ముద్ర తొలిగించడానికి బాబు వేసిన కొత్త ఎత్తుగడ ఈ-పేపర్. ఇకపై చవకబారు వార్తలు, గాలి కబుర్లు, ఊహాగానాలు అన్నీ టీడీపీ ఈ-పేపర్లోకి వచ్చి చేరతాయి. కాస్తో కూస్తో నమ్మదగ్గ విషయాలు మాత్రమే పచ్చపత్రికల్లో అచ్చోసుకుంటాయి. ఇక పచ్చ మైకులకి కూడా అదే కండిషన్.
ఇప్పటికే టీడీపీకి సోషల్ మీడియాలో పెద్ద నెట్ వర్కే ఉంది. కానీ ఆ పెయిడ్ బ్యాచ్ అంతా.. తలా ఒక వెబ్ సైట్ లో టీడీపీ అనుకూల వార్తల్ని చొప్పిస్తుంటుంది. కొంతమందికి టీడీపీ ఆఫీస్ నుంచే ఆర్టికల్స్ వెళ్తుంటాయనుకోండి. అది వేరే విషయం. పూర్తిగా టీడీపీ స్టాండ్ తీసుకున్న వెబ్ సైట్స్ తోపాటు, న్యూట్రల్ వెబ్ సైట్స్ లో కూడా ఎవరో ఒకరితో ఈ ఆర్టికల్స్ పబ్లిష్ చేయిస్తుంటారు.
కానీ ఈ వ్యూహాలు ఇప్పుడంతగా ఫలించేట్టు కనిపించడంలేదు. అందుకే సొంతగా ఈ-పేపర్ అంటూ మరికొంతమందిని రిక్రూట్ చేయించుకుని మరీ పని మొదలు పెట్టారు చంద్రబాబు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. మొదట్లోనే ఈ పేపర్ క్వాలిటీ ఏంటో అందరికీ తెలిసిపోయింది. దీన్ని టీడీపీ కార్యకర్తలు చదువుకుంటే సరిపోదు, జన సామాన్యంలోకి వస్తేనే ఫలితం ఉంటుంది. తటస్థులు సైతం పార్టీ వైపు ఆకర్షితులవుతారు. కానీ అవేవీ జరిగేట్టు కనిపించడం లేదు.
గల్లీ స్థాయి లీడర్ల సిల్లీ వార్నింగ్ లు, సెటైర్లు, అధినేత కంట్లో పడాలనుకునేవారి కార్యక్రమాలకే ఇది పరిమితం అవుతోంది. రెండ్రోజుల్లోనే దీన్ని వేస్ట్ అంటూ తీసి పక్కనపెట్టేశారు టీడీపీ నాయకులు. ఇక అధినేత, దీన్ని, దీంట్లో పనిచేసే ఉద్యోగుల్ని ఎతంకాలం భరిస్తారో చూడాలి.