వినడానికి ఇది విడ్డూరంగానే ఉంటుంది. సినిమాల్లో అనవిగాని నీతులు చెప్పే హీరోలు రియల్ లైఫ్ లో విచిత్రంగా స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ వంతు వచ్చింది. తన కన్నతల్లిదండ్రుల మీదే విజయ్ పోలిస్ కంప్లైంట్ ఇచ్చిన వైనం ఇది. తన పేరు మీద రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ విజయ్ తన పేరెంట్స్ మీద పోలిసులకు ఫిర్యాదు చేశారు!
ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశమే. ఒకరకంగా చూస్తే విజయ్ తను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి, తల్లిదండ్రులను వారించి ఉండవచ్చు. అయితే ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోయే అంశాన్ని వారు పోలిసుల వరకూ తీసుకెళ్లడం విశేషం. విజయ్ పేరు మీద రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నది ఎవరో అడ్రస్ తెలియని వాళ్లు అయితే కంప్లైంట్ ఇచ్చినా అదో కథ. అయితే తన తల్లిదండ్రుల మీదే విజయ్ ఫిర్యాదు చేయడం, వారు తన మాట వినకుండా తన పేరును వాడుకుంటున్నారన్నట్టుగా కంప్లైంట్ ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయమే.
విజయ్ సినిమాల్లోకి వచ్చింది కూడా తండ్రి ద్వారానే. విజయ్ తండ్రి చంద్రశేఖర్ తమిళంలో ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు. ఆయన సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. ఆ వారసత్వంతోనే విజయ్ సినిమాల్లోకి వచ్చాడు స్టార్ అయ్యాడు. విజయ్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలనేది చంద్రశేఖర్ ఉన్నట్టుంది. ఈ విషయమై గతంలో పలు ప్రకటనలు కూడా చేశాడాయన. అయితే విజయ్ వాటిని మొదట్లో ఖండించాడు. తన తండ్రి తీరుతో తనకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
సినిమాల్లో హీరోలు చాలా సమస్యలను సాల్వ్ చేస్తారు. ప్రత్యేకించి ఫ్యామిలీ డ్రామాల్లో అయితే.. తీవ్రమైన కక్షతో రగిలిపోయే బంధువులను కూడా రాజీ చేస్తారు. ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తారు. రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి దాఖలాలు కనిపించవు! వీరి వ్యక్తిగత బంధాల్లో.. విడాకులు, విబేధాలు, తల్లిదండ్రులపై పోలిస్ కంప్లైంట్లు అన్నీ ఉంటాయి. ఇదీ స్టార్ హీరోల ఇమేజ్ వెనుక దాగి ఉన్న కథ అని సినీ వీరాభిమానులు కూడా అర్థం చేసుకోవాలి!