2019 ఎన్నికల్లో కుదేలై పోయి, రాష్ట్రాధికారాన్ని వైసీపీకి అప్పగించేసిన తర్వాత; టీడీపీ మళ్లీ ఇప్పుడు కోలుకుంటోంది. కాలూ, చెయ్యీ కూడదీసుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. నోరు పెగులుతున్నది. ఇదంతా పొగమంచు లాటి భావనే తప్ప, అందులో వాస్తవం లేదు అనే వారికి కూడా లోటు లేదు. శీతాకాలం రోజులలో చలికి సూర్యుడు ఇంకా నంగి నంగిగా ఉంటూ బాగా బయటకు రాని సమయంలో మొత్తం అంతా పొగమంచు కప్పేస్తుంది. ఇదేదో 'వన్ సైడ్' వ్యవహారం లాగా ఉందే అనిపిస్తుంది. కానీ, సూర్యుడు కొంచెం పైకి రాగానే మంచు తెర కాస్తా క్షణాలలో అంతర్ధానమై పోతుంది. తెలుగుదేశం పరిస్థితి కూడా అలా 'పొగమంచు' లాగా ఉందా అని భావించే వారు లేకపోలేదు.ఈ భావన – ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, రాజకీయ రాగద్వేషాలను బట్టి వ్యక్తమవుతూ ఉంటుంది. మరి, వాస్తవం ఏమిటి?
ఇప్పటికి అయితే, నారా లోకేష్‌ను ముందు పెట్టి, చంద్రబాబు నాయుడు వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారనే భావం రాజకీయ వర్గాల్లో ఉంది. డ్రైవింగ్ స్కూల్ వాళ్లు- స్టీరింగ్ చక్రం ముందు మనల్ని కూర్చోబెట్టి, లీవర్స్ (కంట్రోల్) వారి చేతిలో పెట్టుకుని, మనకు డ్రైవింగ్ నేర్పిస్తారు. కారు మనమే నడుపుతున్న అనుభూతికి లోనవుతుంటాం. అలా, టీడీపీ డ్రైవింగ్ సీట్లో లోకేష్ ను కూర్చోబెట్టి…లీవర్స్ అన్నీ చంద్రబాబు పట్టుకుని, టీడీపీని నడిపిస్తున్నారు. సీనియర్ నాయకులు – లోకేష్ కు 'సపోర్ట్ స్టాఫ్' గా పని చేస్తున్నారు. తప్పు ఏమీ లేదు. తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. టీడీపీ శ్రేణులు సైతం లోకేష్‌ను ముందు పెట్టుకుని -వైసీపీపై యుద్ధానికి బయల్దేరుతున్నాయి.
రాష్ట్రంలో ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలిగినా లోకేష్ బయల్దేరుతున్నారు, వారిని పరామర్శించడానికి. ఇందులోనూ తప్పు పట్టాల్సిందేమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీ విధుల్లో – అది కూడా ఒకటి. బాధితుల్ని పరామర్శించడం వారికి న్యాయం జరిగేవరకు నిద్రపోం అని చెప్పడం సహజం. ఈ ప్రతిపక్ష 'పోరాటానికి' – వెనుక నుంచి మద్దతు ఇచ్చే న్యూస్ చానెల్స్ ఇస్తున్నాయి.
డిబేట్ అంశాలు వేరు వేరు అయినా- డిబేటింగ్ లో పాల్గొనేది ఆ నలుగురైదుగురే అనిపిస్తుంటుంది, రోజూ చూసేవారికి. డిబేటింగ్ గెస్ట్ లు వారే అయినా యాంకర్ల లాగా ఫిక్స్ డ్ గా కనబడుతున్నారు. చూసేవాళ్లకు మాత్రం, 'రోజూ వీళ్లేనా' అనిపిస్తుంటుంది. ఈ డిబేట్ల వల్ల తెలుగుదేశానికి ఎంత మైలేజ్ వస్తున్నదో తెలియదు గానీ, ఈ గెస్ట్స్ మంచి ప్రచారం మాత్రం లభిస్తోంది. ఈ యాంకర్లను ప్రొజెక్ట్ చేస్తూ- యూట్యూబ్ లో మళ్లీ పోస్ట్ లు. 'ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న'. ' జగన్ ను నిలదీసిన.అని. ముఖ్యమంత్రికి సూటి ప్రశ్నలు వేయడానికి, జగన్ ను నిలదీయడానికి ఈ యాంకర్లు ఎవరో అసలు అర్థమే కావడం లేదు. ఆయా చానెల్స్ యజమానులు నిలదీయవచ్చు. సూటి ప్రశ్నలు వేయవచ్చు.
యాంకర్లు ఉద్యోగులు మాత్రమే. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీయడం అనే ట్రెండ్ ఇప్పుడే కనబడుతున్నది. బహుశా, ఆర్నాబ్ గోస్వామిని కాపీ కొడుతున్నట్టున్నారు. అయితే, రిపబ్లిక్ చానెల్లో ఆర్నాబ్ గోస్వామి ఉద్యోగి కాదు, యజమాని. అతను ఏం చేసినా చెల్లుతుంది.
మన యాంకర్లు కూడా ఆర్నాబ్ లాగా 'ఓవర్ యాక్షన్' చేస్తుంటే, చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటోంది. కుక్క తోకను ఊపుతున్నదా లేక, తోకే కుక్కను ఊపుతున్నదా అనే సంశయం కలుగుతోంది. ఈ 'తోక ఊపుడు' డిబేట్ల వల్ల, తమకు మైలేజ్ పెరుగుతున్నదని తెలుగుదేశం నాయకులు ఏమైనా భావిస్తున్నారేమో తెలియదు.
వైసీపీ ప్రభుత్వం కూడా తక్కువేమీ తినడం లేదు. టీడీపీ ఇమేజ్ పెరగడానికి ప్రభుత్వం గట్టి కృషే చేస్తున్నట్టు కనపడుతున్నది. ఐదున్నర కోట్ల జనాభాతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తరించి ఉన్న రాష్ట్రం లో ఒక అరాచకమో,హత్యో, అత్యాచారమో, మోసమో ఇలా ఏదో ఒక అకృత్యం జరుగుతూనే ఉండడానికి అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వమా…, తెలుగుదేశం ప్రభుత్వమా అనే దానితో – క్షేత్ర స్థాయి అకృత్యకారులకు పని లేదు. ఆ మాట కొస్తే, స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ జరుగుతూనే ఉన్నాయ్. 29 రాష్ట్రాలలోనూ జరుగుతూనే ఉంటాయి. భవిష్యత్ లోనూ జరగకుండా ఉండవు.
ఇలాంటి అకృత్యాలు వెలుగులోకి వచ్చినప్పుడు, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, బాధితుల్లో ధైర్యం నింపి, వారికి బాసటగా నిలబడడం ప్రభుత్వ ప్రాధమిక విధి అనే విషయం అందరూ అంగీకరిస్తారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున, ఇలాంటి సంఘటనల నుంచి మైలేజ్ పొందడానికి సహజంగానే ప్రయత్నిస్తుంది. అందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఇటువంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలలో, బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లే సందర్భా లలో- ప్రభుత్వం మాత్రం తన వ్యవహార శైలితో టీడీపీ ఇమేజ్ను పెంచడానికి వైసీపీ- తన వంతు సాయం చేస్తున్నదా అనిపిస్తుంటుంది.
గుంటూరు, నర్సారావుపేటలో రెండు దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయి.ఈ సంఘటనల్లో బాధిత కుటుంబాలను నారా లోకేష్ పరామర్శించాలి అనుకున్నారు. ఆయనపై వందలమంది పోలీసులతో ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏముంది? నరసరావుపేట డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చి, లోకేష్ పర్యటనకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయమంటే- లోకేష్‌కు అయిదు పైసలు ప్రచారం లభించేది కాదు కదా!
కానీ, గన్నవరం విమానాశ్రయంలో ఆయన దిగిన క్షణం నుంచీ ఒకటే తిరునాళ్ళ. చివరకు, ఆయన నరసరావుపేట వెళ్లకుండా అటకాయింపు. ఆ రోజంతా 3, 4 చానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు. సాయంత్రాలేమో డిబేట్లు. గుంటూరు రమ్య హత్య ఘటన సందర్భం లోనూ లోకేష్ వెళ్ళినప్పుడు ఇదే వరుస. అవసరమైన దానికంటే పది, పదిహేను రెట్లు ఎక్కువగా పోలీసులను మోహరింప చేసి, వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ పోరాటాలకు ఈ విధంగా సాయం పడుతున్నది. వీటన్నింటి వల్ల, టీడీపీ బాగా పుంజు కున్నదనే భావం ప్రజలలో వ్యాప్తి చెందింది అనడంలో సందేహం లేదు. లోకేష్ స్థాయిని వైసీపీ ప్రభుత్వం పెంచుతున్న తీరుకు చంద్రబాబు నాయుడు కూడా లోపల్లోపల బాగా సంతోషిస్తూ ఉంటారు.
అయితే నిజంగానే టీడీపీ పుంజుకుందా? ఇంకో రెండు రెండున్నర ఏళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో- వైసీపీని సవాలు చేసే స్థితికి టీడీపీ సమాయత్తం అవుతున్నదా? అయితే, ఇక్కడో విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
ఓటర్ల లో 99 శాతం మంది సైలెంట్ ఓటర్లే. వారు మాట్లాడరు.పేపర్ చదవరు. టీవీల్లో డిబేట్స్ చూడరు. వాదోపవాదాల్లో తల దూర్చరు. యాంకర్ల సూటి ప్రశ్నలను పట్టించుకోరు. దేనికీ రియాక్ట్ అవ్వరు. ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల తమకు ఎదురైన అనుభవాలు, భావనలతో వారు ఒక అభిప్రాయానికి వస్తారు. వారికి ఎదురయ్యే గ్రామ వాలంటీరులు, గ్రామ కార్యదర్శులు, ఎస్సైలు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, అధికార పార్టీల చిన్న, పెద్ద నాయకులు వారితో వ్యవహరించే తీరుతోనే వారు ఒక అభిప్రాయానికి వస్తారు. వారికి -'ప్రభుత్వం' అంటే -తమకు రోజూ కళ్ళముందు కనపడే ఈ జనమే. జగన్ కాదు. దీనినే 'పెర్సెప్షన్' అంటారు.
పోలింగ్ సమయంలో సైలెంట్ గా పోలింగ్ బూత్ కు వెళ్లి, తమ అభిప్రాయానికి అనుగుణంగా ఓటు వేసేసి ఇంటికెళ్లి పోతారు. ఆ మిగిలిన ఒక్క శాతం మందే పేపర్లు చదువుతారు. టీవీ డిబేట్లు చూస్తారు. వాటిల్లో బల్లలు గుద్ది వాదిస్తారు. ప్రభుత్వ మంచి చెడ్డలపై గొంతులు చించుకుంటారు. ప్రభుత్వ తీరు తెన్నులపై తీవ్రంగా స్పందిస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడతారు. అల్లరల్లరి చేస్తారు. వీటివల్ల వచ్చిన మైలేజ్ -'సూపర్' అనుకుంటారు.
టీడీపీ ఈ ఒక్క శాతం మంది ' ఒపీనియన్ మేకర్స్' పై ఆధారపడుతున్నదా అనిపిస్తున్నది, చూసేవారికి. వైసీపీ మాత్రం ఈ ఒక్క శాతం 'ఒపీనియన్ మేకర్స్' ను పూర్తి గా వదిలేసి, మిగిలిన 99 శాతం మంది 'సైలెంట్ ఓటర్స్' పై ఆధార పడుతున్నట్టు కనబడుతున్నది. అందుకే- టీవీ డిబేట్స్ ను, పేపర్స్‌ను, విమర్శకులను, ధర్నాలను, చంద్రబాబు నాయుడులను, నారా లోకేష్ లను, వర్ల రామయ్యలను, అయ్యన్న పాత్రుడులను సీపీఐ రామకృష్ణలను పట్టించుకోవడం మానేసింది. ఆ 99 శాతం మందిలో నిరుపేదలు ఉన్నారు. రెక్కాడితే గానీ. డొక్కాడని బడుగులు ఉన్నారు. పూట గడవని గ్రామీణులున్నారు. నోరూ వాయి లేని అభాగ్యులున్నారు. సాయంత్రాలు 'నిబ్' కు కూడా గతిలేని వారున్నారు.
ఏదో ఒక పథకం పేరుతో జగన్ ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలలో జమ చేసే నగదు తో -తాత్కాలికం గా అయినా ఏదో ఒక మేరకు వీరు సేద తీరుతున్నారు. రెండు చుక్కలతో నాలికలు తడుపుకుంటున్నారు. అదే మహాప్రసాదం అన్నట్టుగా- 'జయహో జగన్' అంటున్నారు. అటువంటి వారే-తమకు శ్రీరామ రక్ష అని వైసీపీ భావిస్తోంది. వారిని దృష్టిలో పెట్టుకునే 25 రకాలైన 'సంక్షేమ పథకాల పేరిట వారి ఖాతాలలో నగదు జమ చేస్తున్నది. మరి ,ఆ వర్గాలను టీడీపీ చేరుకుంటున్నదా? వైసీపీ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని చెబుతున్నదా? వైసీపీ కంటే టీడీపీ ఏ విధంగా మంచిదో వివరిస్తున్నదా? టీడీపీ కి ఓట్ వేస్తే- ముఖ్యమంత్రి ఎవరో చెబుతున్నదా? ఇలాంటివే సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా టీడీపీ పుంజుకుంది. పుంజుకుంది అనే ప్రచారం వల్ల- టీడీపీ కి పోలింగ్ సమయంలో వచ్చే లాభం గానీ, వైసీపీ కి వచ్చే నష్టం గానీ కనపడడం లేదు. ఓ పది,పదిహేను పైసలు అటు ఇటు తప్పించి.
వైసీపీకి 150 మంది శాసనసభ్యులు ఉన్నారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయి, మరో 60 స్థానాలు కోల్పోయినా, ఇంకా 90 ఉంటాయి. వైసీపీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. 88 స్థానాలు వస్తే, 175 వచ్చినట్టే. 85 స్థానాలు వస్తే, అసలు ఏమీ రానట్టే. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుంది. నిజానికి, వైసీపీ గ్రాఫ్ కొంత తగ్గింది అనడంలో అనుమానం లేదు. కానీ, ఎంత తగ్గింది అనేదానికి కొలబద్ద ఏమీ లేదు. కానీ, ఆ మేరకు టీడీపీ గ్రాఫ్ జనంలో పెరగలేదు అని టీడీపీ నాయకులు కొందరు గట్టిగా అభిప్రాయ పడుతున్నారు కూడా. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ మ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి కూడా అదే భయంతో రాజకీయాలకు స్వస్తి చెబుదామనుకున్నారు. ఇప్పుడు నడుస్తున్న పద్ధతుల్లో పార్టీ నడిస్తే, 2024 ఎన్నికల్లో- పార్టీ సత్ఫలితాలు సాధించలేదని ఆయన బలంగా నమ్ముతున్నారు. పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి వీసమెత్తు మారలేదన్నది ఆయన అభిప్రాయం. 'ఆత్మ స్తుతి-పరనింద' తో పని జరగదు.
'ఎందుకని' అనే విషయాన్ని టీడీపీ అధ్యయనం చేసుకోవాలి. వైసీపీ కారెక్టర్ ను విశ్లేషించుకోవాలి. వైసీపీ 'డిఎన్ఏ' ని పట్టుకుని, అర్ధం చేసుకోవాలి. ఆ డిఎన్ఏ ని అర్ధం చేసుకోడానికి- శుక్రవారం నాడు చంద్రబాబు ఇంటివద్ద చోటు చేసుకున్న ఘటన కొంత ఉపకరించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఒకరకంగా టీడీపీకి 'భవిష్యద్దర్శనం' వంటిది. దానికి తగిన ప్రతి చర్యలు చేపట్టగలరా అనే విషయం పైనే 2024 ఎన్నికల్లో టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 'ప్రతి చర్య' అనేది నెగటివ్ దృక్పథం తో కాకుండా, 'పాజిటివ్' దృక్పథం తో ఉండాలి. జగన్ నో, సజ్జల రామకృష్ణా రెడ్డి నో, డీజీపీ గౌతమ్ సవాంగ్ నో తీవ్రం గా విమర్శించడం వల్ల, భీకర అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా – ఓటర్ల పై ప్రభావం చూపించలేరు. నిజానికి, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై టీడీపీ ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నట్టు కనపడింది. బెయిల్ రద్దయ్యి, జగన్ జైల్ కు వెడితే, రాజకీయ చక్రం తిప్పడం బాగా సులువవుతుందనే భావం టీడీపీ వర్గాల్లో కొంత కనిపించింది.
మూడు నాలుగు ముక్కలుగా వైసీపీ చీలిపోతుందని; దీంతో ఆ పార్టీ ని తేలికగా హ్యాండిల్ చేయవచ్చునన్న ఆశావహులు కూడా టీడీపీలో కనిపించారు. నిజానికి, బెయిల్ రద్దు అనేది మూడంచెల పోరాటం. మొదటి అంచెలో జగన్ గెలిచారు. ఇప్పుడు తెలంగాణ హై కోర్టుకు రెండో దశ పోరాటం మారుతోంది. ఇది సెమీ ఫైనల్. ఆ తర్వాత సుప్రీమ్ కోర్టు ఉందని రఘురామరాజు ఇప్పటికే ప్రకటించారు. బహుశా, ఫైనల్స్ అక్కడ జరగొచ్చు.
ఆ విషయం అటుంచితే, ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలకు పైగా సమయం ఉంది. ఇప్పటికైతే, వైసీపీ గ్రాఫ్ తగ్గినట్టు కనబడుతున్నది. ఇటీవల నేను కొన్ని గ్రామాలలో తిరిగి చూసినప్పుడు- వైసీపీ ని దూషిస్తున్నవారే తప్ప; అనుకూలంగా మాట్లాడిన వారు పెద్దగా కనిపించ లేదు. వారు వాడిన పదజాలంతో పోల్చితే కొడాలి నానికి ఏమొచ్చు పాపం అనిపించింది.
ఈ నేపథ్యం లో 'ఫాల్స్ ప్రెస్టిజ్ ' ను పక్కన బెట్టి, తమ గ్రాఫ్ పెరిగిందో లేదో టీడీపీ నేతలు నిజాయతీగా మదింపు, చేసుకుని, అడుగు ముందుకు వేయకపోతే….! ఇక చెప్పేదేముంది!?
-భోగాది వేంకట రాయుడు