రాజ్యాంగంలో కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం, వాటి విధులు, విధానాలు చక్కగా పొందుపరచుకున్నాం. ఈ వ్యవస్థల లక్ష్యం అంతిమంగా ప్రజలకు మేలు చేయడానికే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే. తాజాగా జరుగుతున్న్న కొన్ని పరిణామాలపైన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వ్యాఖ్యానిస్తూ వ్యవస్థల మధ్య సంఘర్షణ కూడదని అభిప్రాయపడ్డారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించుకోవాలని అన్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇతర వ్యవస్థలు ఆటంకపరచేలా ఉండకూడదని తమ్మినేని అంటున్నారు. రాజ్యాంగ విభాగాలు ఎవరి పని వారు చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించాలని సూచించారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను ఇతర మార్గాల ద్వారా నిరోధిస్తే పాలనకు అర్ధం ఉండదని ఆయన అంటున్నారు. తమకు న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉందని తమ్మినేని అంటూ ఈసీ నియామకం అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ హక్కు అని చెప్పారు.
ఇలాంటి నియామకాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చేయాలని, అపుడే ప్రజాస్వామ్యానికి అర్ధం, సార్ధకత ఉంటాయని అన్నారు. ఇదిలా ఉండగా రాజ్యాంగ వ్యవస్థలు వాటి విధి విధానాల మీద ప్రజలలో అవగాహన పెరగాలని, మేధావులు, నిపుణులు విస్త్రుతమైన చర్చను చేయాలని కూడా తమ్మినేని అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలన విషయంలో పూర్తి సంత్రుప్తి వ్యక్తం చేసిన తమ్మినేని కొన్ని విధాన నిర్ణయాలు అమలు కాకుండా ఇతర వ్యవస్థల నుంచి ఎదురవుతున్న ఆటంకాలపైన ఆవేదన వ్యక్తం చేశారు. మరి తమ్మినేని చెప్పినట్లుగా రాజ్యాంగ వ్యవస్థలు, విధి విధానాల మీద చర్చకు ఇదే సరైన సమయం, సందర్భమేమో.