జూన్ ఒకటి నుంచి లాక్ డౌన్ ఐదో దశ ఎలా ఉంటుందనే అంశం గురించి మీడియాలో , ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. జూన్ ఒకటి నుంచి ఐదో దశ లాక్ డౌన్ కాదు, ఇక అన్ లాకే అని స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ నుంచి మినహాయింపులను ప్రకటించారు.
లాక్ డౌన్ ను ఎలా అన్ లాక్ చేయాలనే అంశంలో చాలా వరకూ రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంలో తాము రిస్క్ తీసుకోలేమన్నట్టుగా.. రాష్ట్రాలతో సంప్రదింపుల తర్వాతే కీలకమైన అంశాల గురించి ప్రకటన అని పేర్కొంది.
జూన్ ఒకటి నుంచి ముందుగా మతసంబంధ కార్యక్రమాలకు, అన్ని మతాల పవిత్ర స్థలాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు రాష్ట్రాలు మత సంబంధ కార్యక్రమాలకు మినహాయింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ ఒకటి నుంచి ఈ విషయంలో కేంద్రానికి కూడా ఎలాంటి అభ్యంతరాలూ ఉండవని స్పష్టత వస్తోంది.
ఇక మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు.. వీటి విషయంలోనూ కేంద్రం స్పష్టతను ఇచ్చింది. జూన్ ఎనిమిది నుంచి వీటిని ఓపెన్ చేసుకోవచ్చనే తరహాలో కేంద్రం ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటి వరకూ టేక్ అవే తరహాలో కొన్ని చోట్ల ఓపెన్ అయ్యాయి. మరి కొన్ని చోట్ల అనధికారికంగా చిన్న చిన్న హోటళ్లు ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు ఇంకో వారం పది రోజుల్లో అధికారికంగా ఓపెన్ చేసుకోవచ్చన్నట్టుగా కేంద్రం ప్రకటించింది.
ఇక ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ ట్రావెల్స్ కు పరిమితులు ఉండవని స్పష్టం చేసింది. ప్రయాణికుల కోసం అయినా, సరుకు రవాణాకు అయినా.. రాష్ట్రాల మధ్యన ప్రయాణాలకు, రాష్ట్రాల్లో అంతరంగా ప్రయాణాలకు పరిమితులను కేంద్రం ఉపసంహరించింది. అయితే ఈ విషయంలో రాష్ట్రాలు తమ నిబంధనలను అమలు చేసే అవకాశాలున్నాయి. తమ తమ రాష్ట్రాల్లోకి వచ్చే ప్రయాణికులకు బేసిక్ టెస్ట్స్, అనుమానితులను క్వారెంటైన్ లోకి వంటి అధికారాలు రాష్ట్రాలకు ఉండవచ్చునేమో.
వీటి తర్వాత స్కూళ్లు, విద్యాసంస్థలు.. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. జూన్ లో మాత్రం స్కూళ్లేవీ ఓపెన్ అయ్యే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. జూలై నుంచి ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు.
ఇక సామాజిక కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎక్కువమందితో వివాహ వేడుకలు..ఇవన్నీ కూడా ముందు ముందు పరిస్థితులను బట్టి అనుమతులు ఇచ్చే అవకాశాలున్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాలపై ఇంకా స్పష్టత అయితే లేదు. రాష్ట్రాలతో చర్చల అనంతరం ఈ విషయాలపై కేంద్ర హోం శాఖ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.