ప్రపంచ వ్యాప్తంగా భారీగా సంపాదన కలిగి ఉన్న వంద మంది అథ్లెట్ల, స్పోర్ట్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్. ఈ జాబితాలో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ తొలి స్థానంలో నిలిచాడు. ఏడాది కాలంలో 100 మిలియన్ డాలర్ల సంపాదనతో ఈ స్విస్ స్టార్ నంబర్ వన్ పొజిషన్ లో నిలిచాడు. ఫెదరర్ ఏడాది సంపాదన దాదాపు 700 కోట్ల రూపాయలు అని ఫోర్బ్స్ పేర్కొంది.
ఆ తర్వాత పోర్చ్ గీస్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానంలో నిలిచాడు. ఇతడి సంపాదనా వంద మిలియన్ డాలర్ల వరకూ ఉంది. ఏడాదిలో ఫెదరర్ 106 మిలియన్ డాలర్లు, రొనాల్డో 105 మిలియన్ డాలర్లు సంపాదించాడని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక మూడో స్థానంలో అర్జెంటీనన్ ఫుట్ బాల్ స్టార్ మెస్సీ ఉన్నాడు. అతడి సంపాదన 104 మిలియన్ డాలర్లట. ఇక బ్రెజిల్ ఫుట్ బాల్ సంచలనం నెయిమర్ దాదాపు 95 మిలియన్ డాలర్ల వార్షిక సంపాదనతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఎన్బీఏ స్టార్ అథ్లెట్లు భారీ సంపాదనతో నిలిచారు.
ఇక ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయుడు, ఏకైక క్రికెటర్ విరాట్ కొహ్లీ మాత్రమే. కొహ్లీ వార్షిక సంపాదన 26 మిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ పేర్కొంది. ఇందులో 24 మిలియన్ డాలర్లు వివిధ రకాల ఎండోర్స్ మెంట్ ఒప్పందాలతో కొహ్లీకి వస్తున్నాయని, రెండు మిలియన్ డాలర్ల మొత్తం మ్యాచ్ ఫీజులూ గట్రా అని ఫోర్బ్స్ పేర్కొంది. భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే కొహ్లీ సంపాదన ఏడాదికి దాదాపు 175 కోట్ల రూపాయలు!