ఒక మనిషి లేదా ఒక నాయకుడు తన నిజాయతీ నిరూపించుకోవడం అంత కష్టం మరోటి వుండదు. నేను మంచోడిని లేదా నేను దుర్మార్గుడిని కాదు అని జనాలు నమ్మేలా మసులుకోవడం అంటే అంత సులువు కాదు. ముఖ్యంగా ప్రజానాయకులకు ఇది మరీ కష్టం. ఎందుకంటే కడుక్కునే బురద కడుక్కుంటూ వుంటే, మీద పడే బురద పడుతూనే వుంటుంది. పైగా ఇక్కడ బురదవేసిన వాడికి బాధ్యత వుండదు. వాడు వేసాడు నువ్వు కడుక్కో అంటుంది మన అతి గొప్ప సమాజం.
వైఎస్ జగన్ అనే ప్రజా నాయకుడి మీద చాలా పద్దతిగా, మరీ ముందు చూపుతో, ఇంకా ఎక్కువగా అధికారానికి దూరంగా వుంచే దురాలోచనతో వైరి పక్షం దాదాపు దశాబ్ధకాలానికి పైగా బురద జల్లుతూనే వస్తోంది. ఈ బురద కూడా మామూలుగా కాదు, బహుముఖంగా… బహుళార్థసాధకంగా…ఎలా?
బురద నెంబర్ 1. జగన్ పక్కా ఫ్యాక్షనిస్టు. అతనికి అధికారం ఇస్తే, రాష్ట్రం అగ్నిగుండమే. ఎక్కడపడితే అక్కడ కడప, పులివెందుల గూండాలే.
బురద నెంబర్ 2. జగన్ అవినీతి పరుడు. లక్షల కోట్లు దోచేసాడు. లేదా దోచేస్తాడు.
బురద నెంబర్ 3. రాష్ట్రం మొత్తం క్రిస్టియానిటీ పెరిగిపోతుంది.
బురద నెంబర్ 4. జగన్‌కు పాలనానుభవం లేదు. పాలించలేడు.
వీటి నుంచి ఎలా బయటపడాలి? జగన్ అదష్టం అక్కడే వర్కవుట్ అయింది. వైరి పక్షాలు అంత బురద వేసినా జనం నమ్మారు. అయిదేళ్లు ప్రతిపక్షంలో వున్నపుడు అతను పడిన శ్రమను నమ్మారు. అవకాశం ఇచ్చారు. అదిగో అప్పుడు వచ్చింది జగన్‌కు, తన మీద పడిన బురదను తుడుచుకునే అవకాశం. అలా తుడుచుకుని తనేంటో జనానికి చూపించే అవకాశం.
పాలించి చూపించాడు
ముందుగా జగన్ చేసింది తనకు పాలనానుభవం లేదు అన్న బురదను కడుక్కోవడం. కావాలని ఖజానాను ఖాళీ చేసి, వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లారు పెద్ద మనిషి చంద్రబాబు. ఏం చేస్తున్నాడో? ఎలా చేస్తున్నాడో? అప్పులే తెస్తున్నాడో? కేంద్రాన్నే బామాలుకుంటున్నాడో? ఇప్పటి వరకు ఈ చేతికి ఆ చేతికి కూడా ఎముక లేకుండా కనీవినీ ఎరుగని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గ్రామ సచివాలయాలు, నగర సచివాలయాలు అనే అద్భుతమైన కాన్సెప్ట్‌ను ప్రవేశ పెట్టాడు. అనేక పాలనా వెసులుబాట్లు అందుబాటులోకి తెచ్చాడు. ఇళ్ల దగ్గరకు రేషన్, పింఛన్, విత్తనాలు ఇలా ప్రతి చోటా విప్లవాత్మక చర్యలు.
హమ్మయ్య…ఓ బురద వదిలిపోయింది. జగన్‌కు పాలించడం రాదు అనే మాట లేదుగా ఇప్పుడు.. పాలన బాగులేదు అనే కొత్త బురద జల్లడం ప్రారంభించారు. అది వేరే సంగతి. పాలన బాగుంది అనేవాళ్లు పైన చెప్పిన విషయాలు అన్నీ చెబుతారు. పాలన బాలేదు అన్నవాళ్లు లిక్కర్ రేట్లు పెరిగిపోయాయి అని చెబుతారు. మూడు రాజధానులు ఏంటీ? తుగ్లక్ మాదిరిగా అంటారు? అమరావతిని అగమ్యగోచరం చేసాడు అంటారు.
ప్యాక్షనిజం జాడలేవీ?
సరే ఈ విషయాలు పక్కన పెట్టి రెండో బురద అయిన ఫ్యాక్షనిజం సంగతి చూద్దాం. ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లు మన సినిమా జనాల ప్రచారం ప్రకారం రాయలసీమ. అంతే కదా? పలనాడును ఫోకస్ చేయరు మళ్లీ. సరే మరి జగన్ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ఫ్యాక్షన్ పడగ విప్పి నాగిని డ్యాన్స్ చేయాలిగా? లేదా రాయలసీమ సంస్కతి రాష్ట్రం అంతా వ్యాపించేయాలి కదా? ఏదీ ఎక్కడా కనిపించదేం?
జగన్ అధికారంలోకి వచ్చాక పలనాడులో మాత్రమే అల్లర్లు, అలజడులు కనిపించాయి కానీ, శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు మిగిలిన జిల్లాలు ఎందుకు ప్రశాంతంగా వున్నాయి. పలనాడులో 2014 ఎన్నికల తరువాత వైకాపా జనాలను ఊచకోత కోసింది ఎవరు? 2019 ఎన్నికల తరువాత కయ్యాలకు కాలుదువ్వింది ఎవరు? అయినా కూడా ఆరునెలల్లో అక్కడ కూడా అన్నీ అణచి, రాష్ర్టం మొత్తం రాజకీయ గలాభాలు, గొడవలు, మర్డర్లు, లేకుండా చేయగలిగారు జగన్. ఇంక ఫ్యాక్షనిస్టు అన్న బురదకు తావెక్కడిది?
అవినీతికి ఆమడ దూరంలో
ముచ్చటగా మూడో బురద అవినీతి. ఏనాడో దశాబ్దకాలం నుంచి అదే భజన. కానీ జనం నమ్మలేదు. జగన్‌ను మాత్రమే నమ్మారు. ప్రతిపక్షాల, ప్రతిపక్ష మీడియా అవినీతి అనే అడ్డగోలు మైకు ప్రచారాన్ని నమ్మలేదు. అధికారం ఇచ్చారు. అయినా ఈ బురద కూడా కడుక్కోవాల్సిన బాధ్యత జగన్‌దే కదా? ఏడాదయింది? ఏదీ ఒక్క భయంకరమైన స్కాము చూపించమనండి? ప్రతి చోటా పారదర్శకత. పైగా రివర్స్ టెండరింగ్. ఎమ్మెల్యేల మూతులు, చేతులు కట్టేసినట్లే. ఏ ఒక్క మంత్రి మీద లేదా ఎమ్మెల్యే మీద అయినా ఒక్క మచ్చ పడిందా ఇప్పటి వరకు?
జగన్ కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన మనుషులు కానీ, ఎక్కడ దొరుకుతారా? అని చూసే బాబుగారి అను’కుల’ మీడియా ఊరుకుంటుందా? దుర్భిణీ వేసి చూస్తూనే వుంటుంది. అయినా ఎక్కడన్నా ఏమన్నా కనిపించిందా? లేదు కదా? అవినీతి బురద వదిలింది. కానీ బాబుగారు, ఆయన మనుషులు ఊరు కోరు కదా? మద్యం కొనుగొళ్లలో అవినీతి అనే యాగీ చేస్తూనే వుంటారు. తప్ప, వారి రాజకీయ అస్థిత్వం వారి అవసరం అలాంటిది.
సర్వమత సమానత్వం
సరే ఇవన్నీ ఒక ఎత్తు. క్రిస్టియానిటీ అనే మత ముద్ర ఒక ఎత్తు. మొదటి నుంచీ ఇదే గోల. కానీ జగన్ తండ్రి వైఎస్ హయాంలో గుళ్లకు, గుళ్లలో పూజారులకు జరిగిన మేలు మరే ప్రభుత్వంలోనూ జరలేదు. అయినా అదే గోల. జగన్ వచ్చారు. తన వంతుగా ఆలయాలకు, పూజారులకు మేలు చేస్తూనే వున్నారు. వాళ్లతో పాటే ఇతర మతాల పెద్దలకు కూడా ప్రభుత్వం వంతున సాయం అందిస్తూనే వున్నారు.
అప్పటికీ తిరుమలను ఎప్పటికప్పుడు ట్రంప్ కార్డుగా వాడే ప్రయత్నం చేస్తూనే వున్నారు. అలా చేసినపుడల్లా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని దానిని అధిగమిస్తూనే వున్నారు. అంతే తప్ప, తన మాటే తనది, ఎవ్వరు ఏమనుకుంటేనేం అనే మొండిధోరణిలో వెళ్లడం లేదు. ఇంతకన్నా ఏం రుజువు కావాలి? మత ముద్ర లేదు అని చెప్పడానికి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, జగన్ క్రిస్టియన్ అని చెప్పి, హిందువులను దూరం చేయడానికి ప్రయత్నించే వారే, విశాఖలో స్వామిజీ చెప్పినట్లు చేస్తున్నారు. ఆ స్వామీజీ మాటే చెల్లుతుంది అని ప్రచారం చేయడం.
తరువాత ఏంటీ?
ఏమయితేనేం దాదాపు దశాబ్ధకాలంగా తెలుగుదేశం పార్టీ, దాని వెన్నుదన్నుగా వున్న సామాజిక వర్గం, దాని అను’కుల’ మీడియా కలిసి గంపగుత్తగా తెచ్చి పోసిన బురదను జగన్ కడుక్కున్నట్లే. ఇక ఇప్పుడు కొత్తగా పోసే బురద, పాత దాంతో పోల్చుకుంటే తక్కువే. కానీ దాన్ని కూడా పడకుండా చూసుకోవాల్సి వుంది. ఎందుకంటే అధికారంలో వున్నపుడే బురద పడేది. కడుక్కోవడానికి అవకాశం వుండేది కూడా అప్పుడే. కానీ జగన్ అధికారంలోకి రాకుండా వుండడం కోసం బురద వేసారు. అది కడుకున్నాను అనుకుంటే, మళ్లీ మరోసారి రాకుండా వుండడం కోసం బురద వేస్తున్నారు. మళ్లీ గెలిచాక ఆ బురద అదే పోతుంది అని అనుకోవడం తప్పు. అధికారంలో వుండగానే అలాంటి బురదను ఎప్పటికప్పుడు కడిగేసుకోవడం అవసరం.
మన సమాజం స్పెషాలిటీనే అది. బురద వేసే వాళ్లు వేస్తూనే వుంటారు. అదేవారి డ్యూటీ. కడుక్కోవడం మాత్రం బురద పడిన వాళ్ల బాధ్యత. దొంగ అని మేము అన్నాం, కాదని నువ్వు నిరూపించుకో..అంతే కానీ దొంగ అని అన్న మేమే నిరూపణకు దిగము. ఇదీ మన సమాజం స్పెషాలిటీ. అందుకే అధికారం సాధించడం కోసం ఎంత శ్రమించారో అంతకు పదింతలు కష్టపడాల్సి వుంది జగన్ ఇప్పుడు. పోవు కాలమె మేలు వచ్చుకాలము కంటెన్ అన్నారు వెనకటికి. జగన్‌కు కూడా అంతే గడచిన ఏడాది కన్నా, రాబోవు నాలుగేళ్లు కీలకం. ఈ ఏడాది అనుభవంతో ఆ నాలుగేళ్ల విజన్‌ను సంపాదించుకోవాలి. విజేత అని మరోసారి అనిపించుకోవాలి. అప్పుడే అసలైన సంబరాలు వైకాపాకు. జగన్‌కు కూడా.
చాణక్య
[email protected]