తానా ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం -21

ప్లవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఏప్రిల్‌ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో “ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21” కార్యక్రమాన్ని…

ప్లవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఏప్రిల్‌ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో “ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21” కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం‌ ద్వారా నిర్వహించనున్నామని, 21 + దేశాలు, 21+ తెలుగు సంఘాలు, 21+ గంటలపాటు ఈ మహాకవి సమ్మేళనం కొనసాగుతుందని, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయ కర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతుందని తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ జి. చంద్రయ్య (తెలంగాణ మానవ హక్కు కమిషన్‌ చైర్మన్‌), విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరుకానున్నారు. 

21+ గంటలపాటు కొనసాగే ఈ కార్యకమ ముగింపు వేడకలకు పద్మభూషణ్‌ డా. కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి, ప్రఖ్యాత రచయిత, నటుడు, తనికెళ్ల భరణి, సాక్షి ముఖ్య సంపాదకులు దిలీప్‌ రెడ్డి, ఈనాడు ముఖ్య ఉప సంపాదకులు విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌, మనతెలంగాణ సంపాదకమండలి సలహాదారు గార శ్రీరామ మూర్తి గార్లు హాజరవుతారని తెలియజేశారు.

ముఖ్య అతిధులు, విశిష్ట అతిధులు, కవులు మొత్తం 225 కి మంది, 21 పైగా దేశాలలో ఉన్న తెలుగు సంఘాలు పాల్గొంటున్న, 21 గంటల పైగా నిర్విరామంగా సాగే ఈ మహాకవి సమ్మేళనం సాహితీవేత్తల సందేశాలు, కవితా గానాలతో అలరించనున్నదని, తానా యు ట్యూబ్ ఛానల్, తానా పేస్ బుక్ మొదలైన మాధ్యమాల ద్వారా వీక్షించ వచ్చని చిగురుమళ్ళ శ్రీనివాస్, శిరీష తూనుగుంట్ల అందరికీ ఆహ్వానం పలికారు. పూర్తి వివరాలకు www.tana.org ను సందర్శించవచ్చును.