ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు వేడి ఇప్పుడే నెమ్మదిగా రాజుకుంటోంది. ఇది ఎంత పెద్దగా రగులుకుంటుందో ఇప్పుడు చెప్పలేం. బీజేపీ నాయకులు నిద్ర పోతున్నారా అని మండి పడ్డాడు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. ఎంతోమంది త్యాగాలు చేస్తే విశాఖ ఉక్కు ప్లాంట్ వచ్చిందని, స్టీల్ ప్లాంట్ కోసం ఆనాడు 32 మంది ప్రాణాలు వదిలారని అన్నారు మంత్రిగారు.
అప్పట్లో తెలుగోడి దెబ్బ ఏమిటో చూపించాం అన్నాడు. మరి ఇప్పుడు కూడా తెలుగోడి దెబ్బ ఏమిటో కేంద్రానికి చూపిస్తారా ? ఇదే ఉక్కు కర్మాగారం తమిళనాడులోనో, కర్ణాటకలోనో ఉండి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేసుంటే ఈపాటికి నిప్పు రగులుకునేది.
కానీ ఆంధ్రాలో నిప్పు (ఉద్యమం) పుడుతుందా అనేది అనుమానంగా వుంది. టీడీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసింది ముమ్మాటికీ తప్పే. దాన్ని ఆసరాగా చేసుకొని జగన్ తనను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెప్పిస్తానన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండన్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక బీజేపీకి బండ మెజారిటీ వచ్చిందని, మన సపోర్ట్ తీసుకోవలసిన అవసరం లేకుండా పోయిందని, సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే ప్రత్యేక హోదాను డిమాండ్ చేవాళ్లమని చెప్పారు.
ఇప్పుడు తరచుగా ఢిల్లీకి వెళ్లి విన్నవించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదన్నారు. ప్రత్యేక హోదాను వదిలిపెట్టేది లేదని, అడుగుతూనే ఉంటామన్నారు. చివరకు ప్రత్యేక హోదా సాధన కోసం ఎలాంటి ఉద్యమాలూ జరగలేదు. అది కాలగర్భంలో కలిసిపోయింది.
విశాఖ ఉక్కు విషయంలో ఇంతకంటే భిన్నంగా జరిగితే అది చరిత్ర అవుతుంది. ప్రత్యేక హోదా కోసం జగన్ అప్పుడప్పుడూ కేంద్రానికి లేఖలు రాశారు. అంటే తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నానని చెప్పడమన్న మాట. విశాఖ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని జగన్ నిన్న ప్రధానికి లేఖ రాశారు.
పునరాలోచించాలి అనే కోరారేగాని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని గట్టిగా అన్న దాఖలాలు లేవు. ఇక ఏపీ బీజేపీ నాయకులు నోరు విప్పడంలేదు. ఎవరెంత గగ్గోలు పెట్టినా విశాఖ ఉక్కు అమ్మకం ఆగదు అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నాడు.
కేంద్రం చేస్తున్న మంచి పనులను రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంతవరకు ప్రజలకు వివరిస్తున్నారో తెలియదుగాని, రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలను మాత్రం గట్టిగా సమర్థిస్తారు. కేంద్ర నాయకులకు మించి వీరు బల్లగుద్ది చెబుతుంటారు. ప్రత్యేక హోదా అడగడానికి వీల్లేదని, అది ముగిసిపోయిన అధ్యాయమని అనేకసార్లు చెప్పారు.
ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూడా గట్టిగా చెప్పడం మొదలుపెట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం సాధన కోసం ఆనాడు జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు వదిలారు. కానీ ఇప్పుడు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి ప్రాణాలు వదలడానికి ఎవరైనా నాయకులు సిద్ధంగా ఉన్నారా ? అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాం అని నాయకులు డైలాగులు కొడుతుంటారు.
కానీ ఈ కాలంలో పదవులు వదులుకునే నాయకులుగాని. ప్రాణాలు వదిలే నాయకులుగాని ఎవరూ లేరు. ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ఏనాడో మానుకున్నాడు. జనం ఆయన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో సమస్యలు పెరుగుతున్న కొద్దీ ఆయన సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు సినిమాలనే ప్రధాన వృత్తిగా చేసుకున్నట్లు కనబడుతోంది. బీజేపీతో అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఎలా ప్రశ్నించగలడు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నాడు. కానీ ఆయన అధికారంలో ఉండగా ఎన్నో ప్రభుత్వ సంస్థల, కర్మాగారాల ఉసురు తీశాడు.
ఆయనేమీ ప్రైవేటీకరణకు వ్యతిరేకి కాదు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతాడని అనుకోలేం. కుల రాజకీయాలతో కుళ్లిపోతున్న ఏపీలో జనం ఉద్యమిస్తారా అనేది సందేహమే.