నష్టాల్లో వున్న సంస్థలను వదల్చుకోవడం అన్నది ప్రభుత్వాలకు అలవాటైపోయిన పని. నిజానికి జగన్ మాట ఇచ్చాడని ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్నారు కానీ, మరే ప్రభుత్వం అయినా రివర్స్ లో ఆలోచించి వుండేది. లోకల్ బ్యాంక్ లు అనేకం వున్నాయి. కర్ణాటకలో చాలా బ్యాంక్ లు పుట్టాయి. స్టేట్ బ్యాంక్ కు అనుబంధంగా తలో రాష్ట్రానికి తలో బ్యాంక్ ఏర్పాటు చేసారు. కానీ తెలుగు రాష్ట్రంలో ఏర్పాటైన ఒకే ఒక బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్.
పట్టాభి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాటైన ఈ బ్యాంక్ ఆరంభంలో బాగా పని చేసింది. చాలా జిల్లాల్లో నోడల్ బ్యాంక్ గా సేవలు అందించింది. అలాంటి బ్యాంక్ కు చాలా మంది ఎగనామం పెట్టారు. అప్పులు వసూలు కాక, రాని బాకీలు పెరిగిపోయి నష్టాల్లో కూరుకుపోయింది. కేంద్రం బ్యాంకును మూసేయకుండా, ఖాతాదారుల శ్రేయస్సు దృష్ట్యా యూనియన్ బ్యాంక్ లో విలీనం చేసేసింది.
ఆ విధంగా తెలుగు రాష్ట్రాలకు వున్న ఒకే ఒక బ్యాంక్ మాయమైంది. ఈ ప్రతిపాదన పురుడు పోసుకున్నపుడు అధికారంలో వున్నది మన చంద్రబాబు నాయుడు గారే.
ఇక నిజాం సుగర్స్ సంగతి తెలిసిందే. 1937 లో నిజాం కాలంలో ఏర్పాటైన ఈ చైన్ ఫ్యాక్టరీలను చంద్రబాబు నష్టాలు వస్తున్నాయన్న వంకతో ప్రయివేటు పరం చేసారు. ఆ లావాదేవీలు, లెక్కలు అన్నీ బయటకు తీయాలంటే చాలా వ్యవహారం వుంది. తరువాత వచ్చిన వైఎస్ మళ్లీ వాటిని వెనక్కు తీసుకోవాలనుకున్నారు. కానీ అకాల మరణం పొందడంతో ఆ వ్యవహారం అలా వుండిపోయింది.
ఆల్విన్ ఫ్రిజ్ లు, వాచీలు ఎంత డిమాండ్ తో అమ్ముడుపోయేవి. ఇప్పుడు ఆ కంపెనీలు ఏవీ ఎక్కడ? ఆంధ్రా స్కూటర్స్ సంస్థ ఎక్కడ వుంది? అంతెందుకు బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలంలో ఇసి టీవీ తయారుచేసిన ఇసిఐఎల్ పరిస్థితి ఏమిటి?
ఇవన్నీ ఇలా వుంచుదాం. ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబు ఇలా ఎవరైనా ప్రభుత్వం తరపున ఓ తయారీకర్మాగారం ఏదైనా ప్రారంభించారా? కియాను బతిమాలుకొవడం ఎందుకు? స్వంతంగా కార్ల ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా? అమరావతిలో ఒక్క ఫ్యాక్టరీ అయినా ప్లాన్ చేసారా?
అసలు ప్రభుత్వాలు రోడ్లు, ఎయిర్ పోర్టులు, రేవులు అన్నీ ప్రయివేటుకే ఎందుకు ఇస్తున్నాయి. స్వంతంగా ఒక్కటీ ఎందుకు నిర్మించడం లేదు. విశాఖ పోర్టు వుండగా? గంగవరం పోర్టును చంద్రబాబు ప్రయివేటు వారికి ఎందుకు ఇచ్చి, నిర్మింపచేసారు. ఇప్పుడు అది బంగారు బాతుగుడ్లు ఎలా పెడుతోంది.
మరి అలాంటిది ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మాత్రం చంద్రబాబు ఎందుకు ఇంత యాగీ చేస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ పాక్షికంగా ప్రయివేటీ కరణ చేయడం వల్ల వస్తే, గిస్తే నష్టం ఆ సంస్థ ఉద్యోగులకు తప్ప మిగిలిన వారికి కాదు. ప్రయివేటు యాజమాన్యం వస్తే ఉద్యోగులను ముక్కుపిండి పని చేయిస్తుంది. అంతే తప్ప ఫ్యాక్టరీని ఎక్కడికీ పట్టుకుపోదు. స్టీల్ ప్లాంట్ మూతపడదు. దానిపై ఆధారపడిన, దాని అనుబంధంగా వచ్చిన పరిశ్రమలు అన్నీ అలాగే వుంటాయి.
మరి ఎందుకు చంద్రబాబు యాగీ చేస్తున్నారు అంటే. దీన్ని సాకుగా హడావుడి చేస్తే విశాఖ మేయర్ ఎన్నికల్లో కాస్త పాగా వేసే అవకాశం వుంటుంది. రాజకీయంగా జగన్ ను ఇరుకునపెట్టే చాన్స్ వుంటుంది. అంతకు మించి మరేమీ కాదు.