ఎమ్బీయస్: ఇంత రియాక్షన్ అవసరమా?

దేశంలో రైతుల ఆందోళన 70 రోజులుగా నడుస్తోంది. దాన్ని ప్రభుత్వం తనకు చేతనైన రీతిలో డీల్ చేస్తోంది. కొంతమంది ‘ఇది కాదు పద్ధతి, బిల్లులు వాపస్ తీసుకుని, రైతుల భయాలు నివృత్తి చేసి, మళ్లీ…

దేశంలో రైతుల ఆందోళన 70 రోజులుగా నడుస్తోంది. దాన్ని ప్రభుత్వం తనకు చేతనైన రీతిలో డీల్ చేస్తోంది. కొంతమంది ‘ఇది కాదు పద్ధతి, బిల్లులు వాపస్ తీసుకుని, రైతుల భయాలు నివృత్తి చేసి, మళ్లీ చట్టాలు చేయాలి’ అంటున్నారు. మరి కొందరు ‘అలాటి పనేమీ చేయనక్కరలేదు. అంతా భేషుగ్గా వుంది. ఆందోళన చేసే వాళ్లందరూ దేశద్రోహులు, టెర్రరిస్టులు, పాక్ ఏజంట్లు, చైనా తొత్తులు.’ అంటున్నారు.

ఎవరేమన్నా ప్రభుత్వానికి, దాన్ని నడిపే పార్టీకి తన ఆలోచనా విధానమేదో ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలతో పాటు తనకు రాజకీయంగా ఏది లబ్ధి చేకూరుస్తుందో ఆ విధంగా చేస్తుంది. ఈలోగా వీళ్లందరికీ సమాధానాలు యిస్తూ కూర్చోదు. ఇప్పటిదాకా మోదీ ప్రభుత్వం అదే చేస్తూ వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా రైతుల ఆందోళన గురించి వస్తున్న వ్యాఖ్యల గురించి విపరీతంగా స్పందిస్తోంది. చర్యలు తీసుకుంటోంది. అవసరమా? అని ప్రశ్న.

రైతుల ఆందోళన రెండు నెలలుగా నడుస్తోంది. దానిపై కెనడా ప్రధాని ట్రూడూ నవంబరులో వ్యాఖ్యానించాడు. ఆందోళనకారుల్లో పంజాబీ రైతులు ముందువరుసలో వున్నారు కాబట్టి, కెనడాలో పంజాబీలకు (వారిలో కొందరు ఖలిస్తానీ శిఖ్కులు కూడా వున్నారు, అందరు శిఖ్కులూ ఖలిస్తానీలని అనడానికి లేదు) రాజకీయంగా బలం వుంది కాబట్టి వారిని మంచి చేసుకోవడానికి అతను గతంలో కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వున్నాడు.

కెనడా ఎంపీలు, బ్రిటిషు ఎంపీలు కూడా రైతుల ఆందోళనకు భారత ప్రభుత్వం పెద్దగా స్పందించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాటి వ్యాఖ్యలు మనవాళ్లూ చేస్తూంటారు. శ్రీలంకలో తమిళుల గురించి, నేపాల్‌లో మాధేశీల గురించి, మయన్మార్‌లో రోహింగ్యాల గురించి ప్రభుత్వానికి సలహాలు యిచ్చేస్తూనే వుంటారు. ప్రభుత్వశాఖలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తాయి, నిరసనలు తెలుపుతాయి.

శ్రీలంకైనా, నేపాలైనా, మరోటైనా వీటన్నిటికీ వాళ్లిచ్చే రెస్పాన్స్ ఒకటే – మా సంగతి మేం చూసుకుంటాం, మీ జోక్యమేమీ అక్కరలేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే వుంచుకోండి అని. ఈ విషయంలో ఇండియా కూడా అదే చేసింది. ఇక్కడ రైతుల ఆందోళన నెలల తరబడి కొనసాగి, రిపబ్లిక్ దినాన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడంతో అంతర్జాతీయంగా అందరూ ఉలిక్కిపడి చూశారు. ఇక అప్పణ్నుంచి దిల్లీ పోలీసులు రైతు నాయకులను దిల్లీ నుంచి తరిమివేయడంతో యుపి సరిహద్దులలో ఆందోళన కేంద్రీకృతమైంది. వేలాదిమంది రైతులు వివిధ రాష్ట్రాల నుంచి అక్కడకు వచ్చి పడుతున్నారు. అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి వచ్చింది. అంతమందిని గుమిగూడనిస్తే ఏదైనా జరగవచ్చు.

అందుకని ప్రభుత్వం తనకు తోచిన విధంగా వాళ్లను చెదరగొట్టాలని చూస్తోంది. సాధారణంగా నిరసనకారులు రోడ్లు తవ్వేస్తారు, అడ్డంకులు పెడతారు. ఇక్కడ పోలీసులే తవ్వేశారు, రోడ్ల మీద మేకులు దిగేశారు, అడ్డంకులు పెట్టేశారు, ఇనుపతీగ చుట్టలు పట్టుకొచ్చి పడేశారు. నీళ్ల వ్యానులు అటువైపు వెళ్లకుండా చేశారు. అక్కడున్న వూళ్లలో వాళ్లు వాహనాలు వాడకుండా గోతులు తవ్వేసి, కాలినడకన వెళ్లమంటున్నారు. ఇంటర్నెట్ ఆపేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్లు, ఆన్‌లైన్ చదువులు చదివే విద్యార్థులు గొల్లుమన్నా కుదరదు అని చెప్పారు. ఈ మేకులూ అవీ మీడియాలో వచ్చేయడంతో మీడియా వాళ్లను కూడా దగ్గరకి రానీయటం లేదు.

మొత్తం మీద వాతావరణం చూస్తే ప్రభుత్వం, ప్రజలతో యుద్ధానికి దిగినట్లయింది. ఇప్పటిదాకా ప్రభుత్వం కశ్మీరులోనే యిలాటివి చేస్తుందని విన్నాం. కశ్మీరీయులు యావన్మంది పాకిస్తాను ప్రేమికులు కాబట్టి వాళ్లతో ఎలా వ్యవహరించినా పాపం లేదని అనుకుంటూ వచ్చాం. కానీ యిప్పుడు దేశమధ్యంలోనే, మామూలు ప్రజలతోనే యిలా వ్యవహరించాల్సి వస్తోందని ఆశ్చర్యపడుతున్నాం.

ఏదైనా ఇంగ్లీషు న్యూస్ ఛానెల్‌లో అరగంటలో అంతర్జాతీయ వార్తలు వంటి కార్యక్రమం చూస్తూంటే రోజుకి ప్రపంచంలో కనీసం అరడజను దేశాలలో ఏదో ఒకదానికి ఆందోళన జరుగుతూ కనబడుతుంది. ఒకచోట లాక్‌డౌన్ పెట్టమని, మరో చోట ఎత్తివేయమని, యింకో చోట ప్రధానిని దిగిపొమ్మని, మరోచోట ప్రధానిని ఎదిరించినవాడిని సమర్థిస్తున్నామని, యింకో చోట మిలటరీ కుట్రను వ్యతిరేకిస్తున్నామని.. యిలా!

ప్రతీచోటా ఒకే దృశ్యం, పోలీసు డ్రస్సులు, నిరసనకారులు పట్టుకున్న ప్లకార్డులపై భాష మారుతూంటుంది కానీ అన్ని చోట్లా ప్రదర్శకులు రాళ్లు రువ్వుతూంటారు. పోలీసులందరూ వాటర్ కానన్ లేదా టియర్ గ్యాస్ ఉపయోగిస్తూ వుంటారు. పెద్దపెద్ద డాళ్లు పట్టుకుని మూకుమ్మడిగా కదులుతూంటారు. లాఠీలతో కొడుతూంటారు.

కానీ యిలా రోడ్లమీద మేకులు కొట్టే సీన్లు చూడం. ఇదేదో వెరైటీగా వుంది, పైగా ఎన్నికలు రెగ్యులర్‌గా జరుగుతూ, ప్రపంచంలో కల్లా పెద్ద ప్రజాస్వామ్యమని పేరు తెచ్చుకుంటూ, మోదీ రెండోసారి ప్రధాని అయి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచి, యిప్పటికీ అతను తప్ప దేశానికి వేరే దిక్కు లేదని సర్వేలు చెపుతున్న దేశంలో ఆందోళన యింత తీవ్రం కావడం ప్రపంచంలో రాజకీయ నాయకుల దృష్టినే కాక, కొందరు ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది. దాంతో దీని సంగతి ఏదో చూడండి అంటూ ట్వీట్లు పెట్టారు. వారిలో రిహానా ఒకరు.

అమెరికా పక్కనున్న వెస్ట్ ఇండీస్‌లోని బర్బడాస్ అనే చిన్న దేశంలో నల్లవారి కుటుంబంలో పుట్టి, అమెరికాకు వచ్చి గాయనిగా, నటిగా, బిజినెస్ ఉమన్‌గా ఖ్యాతి గడించిన 32 ఏళ్ల రిహానాకు ప్రపంచ సమస్యలపై స్పందించే అలవాటు వుందో లేదో, రాజకీయంగా ఆమె భావాలెటువంటివో నాకు తెలియదు కానీ రైతుల ఆందోళనను కట్టడి చేయడానికి ఇంటర్నెట్ కట్ చేయడం గురించి ఆశ్చర్యపోయి, రైతుల ప్రొటెస్టును ప్రస్తావిస్తూ ‘వై కాన్ట్ వి టాక్ ఎబౌట్ దిస్?’ అని ఫిబ్రవరి 2న ట్వీట్ చేసింది. ఇదేదో పట్టించుకుని, చర్చించాల్సిన విషయంలా వుందనే తప్ప ఉద్యమాన్నో, ప్రభుత్వాన్నో ఖండించిన ధ్వని నాకు అందులో వినిపించలేదు.

ఆమెకు 10 కోట్ల మంది ఫాలోవర్స్ వున్నారట. వారిలో 7 లక్షల మంది యీ వ్యాఖ్యకు లైకులు కొట్టారు. అంటే ఎంతన్నమాట? 7శాతం మంది. 93 శాతం మంది పట్టించుకోలేదు. ఏదో ఒక దేశంలో, ఏదో ఒక వర్గం వాళ్లు ఎప్పుడూ ఏదో ఒకదానికి గొడవ చేస్తూనే వుంటారు అని మనం అనుకోమూ, వాళ్లూ అలాగే అనుకుని వుంటారు.

రిహానా అలా అనగానే మన దేశంలో ప్రముఖులు కొందరు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, కరణ్ జోహార్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, సైనా సెహ్వాల్ యిలా పలువురు, అందరి కంటె మించి కంగనౌ రనౌత్ ఆమెను విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. ఫెయిర్ ఎనఫ్! ఆమె తన అభిప్రాయం చెప్పింది, వీళ్ల అభిప్రాయం వీళ్లు చెప్పారు.

ఇలా రోజులో చాలామంది ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పుకోవడానికే సోషల్ మీడియా ఉద్భవించింది. అయితే యీ విషయంలో గమనార్హం ఏమిటంటే, రిహానా ట్వీట్‌కు స్పందించినవారిలో దేశ హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. ఆయన దీని గురించి అంత టైము ఎందుకు వెచ్చించారా అని నాకు ఆశ్చర్యం.

ప్రస్తుతం దేశంలో అనేక సమస్యలున్నాయి. అన్నిటికన్న మిన్నగా రైతు ఆందోళన ఎప్పుడు హద్దు మీరుతుందో తెలియక 5 రాష్ట్రాల ముఖ్యమంత్రుల బిక్కుబిక్కుమంటూ వున్నారు. పోలీసులు కొత్తకొత్త పద్ధతుల్లో ఆందోళనను అదుపు చేయడానికి సతమతమవుతున్నారు. రిపబ్లిక్ డే నాడు ఎఱ్ఱకోట దగ్గర బెటాలియన్ సైన్యం, వందలాది పోలీసులు వుండగా అందరి ముందూ స్తంభం ఎక్కి కాషాయ జెండా ఎగరేసి, దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయిన దీపు సిద్దూ యింకా దొరకలేదు.

జాతీయ పతాకాన్ని అవమానపరిచిన అతను దొరికి శిక్షింపబడే వరకు భారతప్రతిష్ఠ తిరిగిరాదని జనం బెంగ పెట్టుకున్నారు. లక్షరూపాయల బహుమతి ప్రకటించినా అతను బయటపడలేదు. పాకిస్తాన్ మీదే సర్జికల్ స్ట్రయిక్ చేయగలిగిన సత్తా వున్న దేశం యితనెక్కడ వున్నాడో కనిపెట్టలేక పోవడమేమిటనే వర్రీలో వుండాల్సిన హోం మినిస్టర్ ఒక పాప్ గాయని ఏం ట్వీట్ చేసిందో చూసి దానికి ప్రతిస్పందించాలా అని నాకు సందేహం.

చూశాక ఆయనకు యిది ఆమె వ్యక్తిగత అభిప్రాయంగా తోచలేదు. పనిగట్టుకుని భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఉద్యమం, భారత్‌ను ముక్కముక్కలుగా చేసే ఆలోచనగా తోచింది. అందువలన ఇండియా ఎగెనెస్ట్ ప్రాపగాండా అనీ, ఇండియా టుగెదర్ అనీ రెండు హాష్‌ట్యాగ్‌లు పెట్టి ‘‘భారత ఐక్యతను ఏ ప్రచారమూ ఆపలేదు, నూతన శిఖరాలను అధిరోహించకుండా ఆపలేదు.

భారత్ భవిష్యత్తును నిర్దేశించేది ప్రచారం కాదు, ప్రగతి మాత్రమే…’ అంటూ ట్వీట్ చేశారు. పైన చెప్పిన ప్రముఖులందరూ ఈ ఉప్పందుకుని, యీ హ్యాష్‌ట్యాగ్‌లతోనే తమతమ అభిప్రాయాలు చెప్పారు. అందరూ కూడా భారత ఐక్యత గురించే మాట్లాడేశారు. కంగనా ఐతే ‘..వాళ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే వాళ్లు రైతులు కారు, టెర్రరిస్టులు’ అనేసింది, యీవిడ దగ్గర పోలీసు రికార్డులున్నట్లు!

ఇక ఆ పైన తిట్ల దండకం అందుకుంది. రిహానాను విషయం తెలియని ఫూల్‌వి అంది, ఆమె పాటలను, నటనను, ఆకారాన్ని, ఒంటి రంగుని కడిగిపారేయడంతో బాటు పోర్నో స్టార్‌వి అంది. ఇక సోషల్ మీడియాలో ఎవరి పాటికి వాళ్లు అనేశారు. కొందరు ఆమె బాయ్‌ఫ్రండ్ ఆమెను గతంలో చితక్కొట్టి మంచి పని చేశాడన్నారు.

టీవీలో ఒక మాజీ విదేశాంగ శాఖ అధికారి ‘రిహానా ఒక ఎంటర్‌టైనర్. పాటలు పాడి జనాల్ని ఎంటర్‌టైన్ చేయమనండి, ఇవన్నీ ఎందుకు?’ అన్నారు. మరి కంగనా, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ ఎంటర్‌టైనర్లు కాదా? వాళ్ల గురించి అలా అనలేదేం? కవులు, కళాకారులు అయినంత మాత్రాన రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదా? శ్రీశ్రీ ‘గర్జించు రష్యా, గాండ్రించు రష్యా’ అని గేయం రాస్తే జర్మనీ వాడు వచ్చి నీకేం పనయ్యా? అలా రాశావ్ అని వచ్చి అడిగాడా? ‘కంబోడియాపై వియత్నాం దాడి ఖండించండి’ అని హైదరాబాదులో గోడల మీద రాస్తే వియత్నాం వాడు కోప్పడ్డాడా?

అమెరికా ఇరాక్ మీద దాడి చేస్తే కొందరు దిల్లీలో అమెరికా దౌత్యకార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేస్తే అమెరికా వాళ్లనేమైనా అంటుందా? ఈ భూప్రపంచంలో ఎవరి గురించైనా ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు. ప్రభుత్వపరంగా చేసే మరీ ఘాటు వ్యాఖ్యలకు ఒక్కోప్పుడు అవతలి ప్రభుత్వం నిరసన తెలుపుతుంది. అంతే. ఇలా ప్రయివేటు వ్యక్తుల వ్యాఖ్యలకు కూడా స్పందించడం మొదలుపెడితే యిక ప్రభుత్వాలు పనిచేసినట్లే! కానీ మన విదేశాంగ శాఖ అలా అనుకోలేదు.

సెలబ్రిటీలూ, యితరులూ బాధ్యత లేకుండా తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని విమర్శించింది. ప్రభుత్వమే దీనికి అంత ప్రాముఖ్యత యిచ్చినపుడు తక్కిన మంత్రులు ఊరుకుంటారా? వాళ్లూ దేశం విచ్ఛిన్నమైపోతోంది బాబోయ్ అంటూ ట్వీట్లు గుమ్మరిస్తున్నారు. దేశం నిజంగా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చేసిందా? నిజంగా అదే అయితే, 70 ఏళ్లగా అఖండంగా వున్న దేశాన్ని ఒక్క వ్యాఖ్యతో ముక్కలు చేయగలిగిన రిహానా అమిత శక్తిమంతురాలు అని ఒప్పుకుని తీరాలి. బంగ్లాదేశ్‌ను విడగొట్టామని మనపై కసితో వున్న పాకిస్తాన్ ఆమెకు సాష్టాంగపడాలి.

వాతావరణ పరిరక్షణ కార్యకర్త, స్వీడన్ దేశస్తురాలు గ్రేటా థన్‌బెర్గ్ ‘భారత్ సాగుచట్టాలకు అభ్యంతరాలు తెలిపేవారందరూ యీ లింక్ ద్వారా తెలపండి’ అని ఓ లింకు పెడితే యిక దిల్లీ పోలీసులు భారత్ ప్రతిష్ఠ నాశనం చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోందేమోనని పరిశోధిస్తున్నాం అని ప్రకటించారు. అంటే ఒక పక్క ప్రతిష్ఠా పోతోంది, మరో పక్క దేశం విచ్ఛిన్నమూ అవుతోందన్నమాట. ఏదీ, ట్వీట్ల ద్వారానే!? ట్వీట్లకు యింత బలం వుందని నమ్మింది కాబట్టే భారత ప్రభుత్వం ట్విట్టర్‌ను ఓ 250 మంది భారతీయుల ట్విట్టర్ ఎక్కౌంట్లను సస్పెండ్ చేయమని ఆదేశించింది.

వాళ్లలో సామాజిక కార్యకర్త హన్స్‌రాజ్ మీనా, నటుడు సుశాంత్ సింగ్, ‘‘కారవాన్’’ ఎడిటోరియల్ డైరక్టర్ వినోద్ జోస్, ప్రసారభారతి సిఇఓ వెంపటి శశి శేఖర్ వగైరాలు ఉన్నారు. ఎందుకంటే వాళ్లు అభ్యంతరకరమైన హేష్‌ట్యాగ్‌ లేదా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారని, దానివలన దేశంలో హింస పెరిగిపోతుంది అంటూ ఫిర్యాదు చేసింది.

ట్విటర్ తక్షణమే సస్పెండ్ చేసేసింది. కానీ సాయంత్రాని కల్లా ‘మేం పరిశీలించాం. ఆ హేష్‌ట్యాగ్ అంత ప్రమాదకరమైనది, అభ్యంతరకరమైనదీ అనిపించలేదు’ అంటూ పునరుద్ధరించింది. ప్రభుత్వానికి విపరీతమైన కోపం వచ్చింది. ‘ఏది మంచో, ఏది చెడో తీర్పివ్వడానికి నువ్వెవరివి? నేను చెప్పినా చేయవా? నీ మీద కేసు పెడతాం. పెనాల్టీ వేస్తాం. నువ్వు దేశంలో ఆపరేట్ చేయకుండా చూస్తాం’ అంటూ రంకెలు వేస్తోంది. ట్విటర్ తర్వాత ఫేస్‌బుక్ వంతేమో తెలియదు.

ఎందుకంటే టీవీ మీడియా, ప్రింటు మీడియాలలో చాలా భాగం ప్రభుత్వానికి వశం అయిపోయాక, ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. గతంలో సామాన్య రోమన్‌లు గోడల మీద తమ అభిప్రాయాలు రాసేవారట. ఇప్పుడు సామాన్యులు ఆకాశాన్ని వాడుతున్నారు. దేశంలో ఏడున్నర కోట్ల మంది ట్విటర్ వాడుతున్నారట. నిజంగా సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే నష్టపోయేది బిజెపి పార్టీయే. అది పైకి రావడానికి, చిత్తం వచ్చినట్లు ప్రచారం చేయడానికి ఉపయోగపడినది అదే.

ఇప్పుడు ఐటీ శాఖ కూడా ‘ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి అసత్యమైన ట్వీట్లు, హేష్‌ట్యాగ్‌లు వాడుతున్నారని విచారం వ్యక్తం చేసింది. ఏ హాష్‌ట్యాగ్ యింత కలవరం రేపిందా అని చూడబోతే ‘మోదీ ప్లానింగ్ టు ఫార్మర్స్ జినోసైడ్..’ అని తోస్తోంది. జినోసైడ్ (జాతిహననం) అనేది నిజంగా చాలా పెద్ద మాట. రైతులందర్నీ పనిగట్టుకుని చంపేస్తాడు అనడం దుర్మార్గం. రైతులకు హాని కలిగిస్తున్నాడు అనవచ్చు కానీ బొత్తిగా యిలాగా? కానీ యీ రోజుల్లో గాంధీని, నెహ్రూలతో సహా ఏ జాతీయ నాయకుణ్నీ వదలటం లేదు. ఇలాటి వర్ణనలు అంటగడుతున్నారు. వీటిని ఎవరైనా ఖండించాల్సిందే. ఖండించడానికి పార్టీ యంత్రాంగం వుంది, ఆరెస్సెస్ దళాలున్నాయి. ప్రభుత్వమెందుకు యింత ఉలిక్కిపడడం?

నిజానికి హంతకుడనిపించుకోవడం మోదీకి కొత్త కాదు. సోనియా గాంధీ ఎప్పుడో మృత్యుబేహారి అంది. అయితే మోదీ జంకారా? చో రామస్వామి చెన్నయ్‌కు పిలిచి ‘హంతకుడా, వేదికపైకి రా’ అంటూ దండకం చదివితే చిరునవ్వులు చిందిస్తూ వేదిక మీదకు వెళ్లారు. చో మరణించిన తర్వాత పద్మభూషణ్ యిచ్చి సత్కరించారు.

మోదీ హస్తాలు గోధ్రా రక్తంతో తడిచాయని అందరూ అంటే, నానావతి కమిషన్ అబ్బే, ఆయన కింద పనిచేసిన పోలీసు అధికారుల చేతులు తడిచాయి తప్ప మోదీవి కావని క్లీన్‌చిట్ యిచ్చింది. ఇచ్చేందుకు ముందే గుజరాత్ ప్రజలు మోదీని వరుసగా ఎన్నుకుంటూనే పోయారు. 2014 నుంచి దేశప్రజలు ప్రధానిగా ఎన్నుకుంటూ పోతున్నారు. రాష్ట్రం తర్వాత రాష్ట్రం బిజెపికి కైవసం అవుతున్నాయి. తాజాగా ఇండియా టుడే సర్వేలో కూడా మోదీయే దేశానికి దిక్కు అని అధికాంశం ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు.

పరిస్థితి యిలా వుండగా ఎవరో ఏదో అన్నారని, వేరెవరో దాన్ని యింకోళ్లకు మోశారనీ యింత గింజుకోవడం దేనికి? అధికారం చేతిలో వుంది కదాని ట్విటర్‌ను బెదిరిస్తారు, సరే, బయటి దేశాల నోరు మూయించగలరా? దిల్లీలోని అమెరికన్ ఎంబసీ ప్రతినిథి సాగు చట్టాలు మంచివే నంటూనే ప్రజాస్వామ్యంలో యింటర్నెట్ వంటి సాధనాల ద్వారా సమాచారం తెలుకునే హక్కు ప్రజలకుంటుంది అన్నాడు.

ఆ హక్కు గురించి యిప్పుడెందుకు అర్జంటుగా గుర్తుకు వచ్చింది? నువ్వు చెప్పాలా? మాకు తెలియదా? అని అడుగుదామంటే, ‘ఏం? జనవరి 6 ఘటన తర్వాత అధికార బదిలీ ప్రశాంతంగా జరగాలి అని మీరు మాకు చెప్పలేదా? మాకు మాత్రం తెలియదా?’ అని వాళ్లు అనవచ్చు. రైతులతో సంప్రదింపులు జరపండి. శాంతియుతంగా పరిష్కరించుకోండి అని ప్రపంచంలో ఏ దేశమైనా సుద్దులు చెప్పవచ్చు. ఉడుక్కోవడం అనవసరం.

రాముడంతటి వాడు మాట పడ్డాడు. పడ్డాక నా భార్య గురించి అంటాడా, దేశంలో రజకులందరి నోళ్లూ కుట్టేయండి అనలేదు. ప్రజల్లో యిలాటి భావన కూడా వుందన్నమాట అని తెలుసుకుని దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకున్నాడు. మనం రాముడంత వాళ్లం కాకపోయినా, కనీసం పట్టించుకోకుండా వుండడం నేర్చుకోవాలి.

ఇందిరా గాంధీ చూడండి, ఎమర్జన్సీ విధించినప్పుడు అంతర్జాతీయ సమూహం చేత ఎన్ని మాటలు పడిందో! ‘ప్రజాస్వామ్యవాది ఐన నెహ్రూ కూతురు అయి వుండి యిలా చేస్తుందా?’ అని చేర్చి మరీ అన్నారు. మోదీ అదృష్టం. అలాటి బ్యాగేజీ లేదు. ఎవరేమన్నా ఇందిర పట్టించుకుందా? ఎమర్జన్సీలో దేశం బాగుపడిపోయింది. రైళ్లు సకాలానికి నడుస్తూ ప్రజలంతా హ్యేపీగా వున్నారని అనుకున్నపుడే ఎత్తివేసింది. అఫ్‌కోర్స్, ఆమె ఊహ తప్పిందనుకోండి. అది వేరే విషయం. ఏది ఏమైనా ప్రభుత్వపరంగా యింత రియాక్షన్ అనవసరం. నేతల నైతిక స్థయిర్యం గురించి అది తప్పుడు సంకేతాలు పంపగలదు. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)