పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వంపై సగం విజయం సాధించినట్టైంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గౌరవంగా ఎన్నికల ప్రక్రియను తన పదవీ కాలం ముగిసేలోపు పూర్తి చేసుకుని, మిగిలిన సగం విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత నిశ్చింతగా పదవీ విరమణ చేసి ఉంటే గౌరవంగా ఉండేది.
ఎన్నికలే వద్దని భీష్మించిన జగన్ ప్రభుత్వం …ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో తలొగ్గక తప్పలేదు. ఇదే నిమ్మగడ్డ చేతిలో జగన్‌కు అతిపెద్ద ఓటమి. కానీ ఈ విజయంతో నిమ్మగడ్డ సంతృప్తి చెందలేదు. మరేదో చేయాలనే కక్ష, ఆక్రోశం నిమ్మగడ్డలో కనిపిస్తోంది. ఈ ధోరణే ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య ఘర్షణకు దారి తీసింది. ఏ వ్యవస్థకూ రాజ్యాంగం అపరిమితమైన అధికారాలను కట్టబెట్టలేదు. ఈ వాస్తవాన్ని గ్రహించకపోవడం వల్లే వ్యవస్థల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి.
కానీ సర్వోన్నత న్యాయస్థాన తీర్పు తనకు సర్వాధికారాలను కట్టబెట్టినట్టు నిమ్మగడ్డ భావించి, తన పరిధి అతిక్రమించి ఆదేశాలు ఇవ్వడం ద్వారా అనవసర సమస్యలను సృష్టించినట్టవుతోంది. ప్రభుత్వంపై విజయం సాధించిన నిమ్మగడ్డ వినమ్రతకు బదులు అహంకారం డ్యామినేట్ చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అహంకారాన్ని తలకెక్కించుకున్న వాళ్లెవరూ ప్రజాభిమానాన్ని చూరగొన్న దాఖలాలు చరిత్రలో లేవు. అయితే ఇవేవీ గుర్తించే స్థితిలో నిమ్మగడ్డ లేరని ఆయన వ్యవహార శైలి గమనిస్తున్న వారెవరైనా చెప్పే మాట. నిమ్మగడ్డతో వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఎస్ఈసీ అయిన తనకు మాత్రమే రాజ్యాంగం సర్వ హక్కులు కల్పించిందని, మిగిలిన వారికి అసలు ఏ హక్కులూ ఇవ్వలేదనే భ్రమలో ఉన్నారు.
అందువల్లే అత్యున్నతాధికారులపై అభిశంసన, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయాలనే ఆదేశాలు ఇవ్వడంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుడే అత్యంత శక్తిమంతుడు. ప్రజల కేంద్రంగా రాజ్యాంగం ఆవిర్భవించిందే తప్ప, నిమ్మగడ్డ లాంటి అధికారుల కోసం కాదనే వాస్తవాన్ని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.
తాజాగా ఎన్నికల తర్వాత కూడా ఉద్యోగుల బదిలీలను తన అనుమతి తీసుకుని చేయాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు ఇవ్వడం వివాదానికి దారి తీసింది. స్థానిక సంస్థల ఎన్నికల ఉద్దేశాన్ని పైకి నిమ్మగడ్డ ఏం చెప్పినా ….ప్రతీకారం తీర్చుకోవడమే ఆయన ప్రధాన ఎజెండాగా ప్రతి చర్య ప్రతిబింబిస్తోంది.
సంకల్పం మంచిది కానప్పుడు, దాని ఫలితాలు కూడా అట్లే ఉంటాయని నిమ్మగడ్డ గుర్తించాల్సి ఉంది. మాటకు ముందు, తర్వాత రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు చెప్పే నిమ్మగడ్డ, దాని ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘వృక్షో రక్షతి రక్షితః’ అని అంటారు. దీని అర్థం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని. ఇదే సూత్రం రాజ్యాంగానికి కూడా వర్తిస్తుంది. రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటే, అదే మనకు రక్షణ కవచంగా ఉంటుంది. కానీ నిమ్మగడ్డ మాత్రం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్ఈసీ పదవి ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకునేందుకు, పంతం నెగ్గించుకునేందుకు దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల సంఘం కమిషనర్‌గా తన పదవిని ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటర్ల హక్కులను కాపాడేందుకు, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేసేందుకు సద్వినియోగ పరిస్తే చరిత్రలో నిలిచిపోతారు. నిమ్మగడ్డ చేయాల్సిన ప్రధాన పని ఇదే. కానీ ఆయన వ్యవహారాలు అధికార పార్టీపై ప్రతీకార చర్యల్లా ఉన్నాయే తప్ప, తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్టుగా లేవు. పైగా తన మనసు చెప్పినట్టు వింటూ, వాటికి రాజ్యాంగం అండగా ఉంటుందని దుర్వినియోగం చేయడం స్పష్టంగా అర్థమవుతోంది.
ఇసుక నుంచి తైలాన్ని అయిన తీయొచ్చేమో కానీ, రాజ్యాంగం ప్రకారం నిమ్మగడ్డ నడుచుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుందేమో!