అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలుశిక్ష ముగించుకున్న శశికళ.. మరికొద్దిసేపట్లో చెన్నైలో అడుగుపెట్టబోతున్నారు. తొలిసారి చెన్నైకి వస్తున్న శశికళ కోసం ఆమె అభిమానులు, అనుచరులు భారీ ఏర్పాట్లు చేశారు. శశికళ రాజకీయ ఎంట్రీకి ఈ ప్రయాణాన్ని తొలి అడుగుగా చెబుతున్నారు.
తమిళనాడు సరిహద్దులో ఉన్న హోసూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో శశికళ ప్రయాణిస్తారు. మొత్తంగా 7 జిల్లాల మీదుగా ఈమె ప్రయాణం సాగుతుంది. ఈ మేరకు ఆమె అనుచరులు సకల ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో ఒక్కోచోట శశికళ ఆగుతారు. జయలలిత అభిమానులతో ముచ్చటిస్తారు.
శశికళ రాకతో అన్నాడీఎంకేలో గుబులు పట్టుకుంది. ఆమె పేరు చెబితే వణికిపోతున్నారు పళని, పన్నీర్. పైకి గంభీరంగానే ఉన్నా.. పార్టీని ఆమె చేజిక్కించుకుంటే తమ పరిస్థితి ఏంటా అని ఆందోళనలో పడ్డారు. అందుకే శశికళను కట్టడి చేసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
జయలలిత సమాధి వద్దకు వెళ్లకుండా, ఇప్పటికే కట్టడి చేశారు. సమాధికి మెరుగులు అనే సాకుతో అనుమతి నిరాకరించారు. ఇక శశికళ వచ్చే దారిలో ఉన్న రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలోకి ఆమె అడుగుపెట్టకుండా తమ అనుచరులతో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎందుకైనా మంచిదని… ఆమె వస్తున్న 7 జిల్లాల పోలీస్ అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. శశికళ రాకతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఓవైపు ఇన్ని పనులు చేస్తూనే మరోవైపు పార్టీని కూడా గాడిలో పెట్టే పనిలో పడ్డారు. చెన్నై రాబోతున్న శశికళను అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ కలవకూడదని హుకుం జారీచేశారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా శశికళను కలిస్తే, వాళ్లను పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
మరోవైపు శశికళ చేయాల్సిందంగా ఆల్రెడీ చేసేశారని చెబతున్నారు విశ్లేషకులు. అన్నాడీఎంకే పార్టీలో ఎవరెవర్ని తనవైపు తిప్పుకోవాలో ఆ మేరకు ఆమె అన్ని ఏర్పాట్లు తెరవెనక చేసుకున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నాడీఎంకే నుంచి వాళ్లంతా శశికళ వైపు వస్తారని అంచనా వేస్తున్నారు.
మరో 3 నెలల్లో.. తమిళనాట ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల టైమ్ కు అన్నాడీఎంకేను చీల్చాలనేది శశికళ టార్గెట్. ఆమె రీఎంట్రీతో అన్నాడీఎంకేకు కొత్త తలనొప్పులు, తమిళనాట సరికొత్త రాజకీయాలు ఒకేసారి మొదలు కాబోతున్నాయి.