'చలోఆత్మకూరు' అంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు అనూహ్య మలుపు తిరిగింది. పల్నాటిసీమలో తమ నేతలు పత్తిత్తులు అని, వారు గాంధేయ వాదులు అని.. వారు సాగించిన దాష్టీకాలు లేవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం పరమ ఫ్యాక్షనిస్టులు అంటూ చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.
తమ పార్టీకి చెందిన అపరగాంధేయ వాదులు కోడెల శివప్రసాద్ రావు, యరపతినేని శ్రీనివాసరావు వంటి వారిని వెనకేసుకు వస్తూ, వారి ఆధ్వర్యంలో గత ఐదేళ్లలో సాగించిన దాష్టీకాలను దాచి పెడుతూ.. ప్రస్తుతం పరారీల్లో ఉన్న తమ పత్తిత్తులకు రక్షణ కల్పించడానికి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.
ఒకవైపు పునరావాస కేంద్రాలు అంటున్నారు. ఆ కేంద్రాల్లో చంద్రబాబు నాయుడు తమ వారిని పరామర్శించుకోవచ్చు. అయితే అలా చేస్తే రాజకీయంగా మైలేజీ రాదు కదా. అందుకే చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబుది రాజకీయం అని స్పష్టం అవుతూనే ఉంది.
కే ట్యాక్స్ లు, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలిన పల్నాటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టిన వైనం తేటతెల్లం అయ్యింది. దీంతో చలో పల్నాడు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నేఫథ్యంలో ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టే పని మొదలుపెట్టారు. పల్నాడులో సెక్షన్ అమల్లో ఉందని.. ర్యాలీలకూ, బహిరంగ సభలకు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేశారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబును, లోకేష్ ను హౌస్ అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను కూడా ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది.
మరోవైపు పల్నాడులో ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించడంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పలువురు టీడీపీ నేతల్ని వాళ్ల ఇళ్లలోనే గృహనిర్బంధంలో ఉంచారు పోలీసులు.
వైసీపీ బాధితుల పునరావాస శిబిరం అంటూ గుంటూరులో గుడారం ఏర్పాటుచేసిన చంద్రబాబు.. దాని కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటివరకు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, ఇప్పుడు జనజీవనానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ శ్రేణులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి.